దేశవ్యాప్తంగా పేద విద్యార్థినుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)లో శాశ్వ త ప్రాతిపదికన బోధన సిబ్బంది నియామకానికి విధివిధానాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. శాశ్వత బోధన సిబ్బంది నియామ కం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించాలని పేర్కొంది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ హరిహరనాథ శర్మతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సమగ్ర శిక్ష పథకం కింద నిర్వహించే కేజీబీవీల్లో పార్ట్‌టైం పో స్టు గ్రాడ్యుయేట్ టీచర్లు(పీజీటీలు)గా పనిచేస్తున్న తమ ను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాల్ చేస్తూ 2023లో కొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యా జ్యంపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు పిటిషనర్లను ఉద్యోగాల నుంచి తొలగించడా న్ని తప్పుపట్టారు. వారిని కొనసాగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశిస్తూ 2023 డిసెంబరు 5న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ అధికారులు ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవ ల విచారణ జరిపిన ధర్మాసనం... కేజీబీవీలు ఏర్పాటు చేసి 21 ఏళ్లు గడుస్తున్నా శాశ్వత ప్రాతిపదికన సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. ఇలా అయితే.. ఆ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థినులకు నాణ్యమైన విద్యను అందించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. బోధనా సిబ్బంది నియామకం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో స్థిరమైన వైఖరి కనిపించడం లేదని పేర్కొంటూ.. దీనిపై వివరణ ఇచ్చేందుకు అక్టోబరు 14న తమ ముందు హాజరు కావాలని కేంద్ర మానవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఈ అప్పీల్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చింది. హైకోర్టు ఆదేశాలమేరకు కేంద్ర పాఠశాల విద్య మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ ఆన్‌లైన్ ద్వారా, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ నేరుగా ధర్మాసనం ముందు హాజరయ్యారు. విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది గుర్రం రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ ... సింగిల్ జడ్జి ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన రిట్ అప్పీల్‌ను ఉపసంహరించుకుంటామన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అప్పీల్ ఉపసంహరణకు అనుమతించలేమని స్పష్టం చేసింది. కేంద్ర పాఠశాల విద్యశాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్ బదులిస్తూ.. సమగ్ర శిక్ష పథకం 2026 వరకు అమల్లో ఉంటుందన్నారు. ఆ తర్వాత పథకం కొనసాగింపు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి కావాలన్నారు. కోన శశిధర్ బదులిస్తూ... అర్ధంతరంగా పథకం నిలిపివేస్తే శాశ్వత ప్రాతిపదికన నియమించే బోధన సిబ్బందిని సర్దుబాటు చేయడం కష్టమవుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa