ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్ కొత్త శత్రువు అఫ్గన్ వెనుక ఉన్నది ఇతడే

international |  Suryaa Desk  | Published : Fri, Oct 17, 2025, 10:02 PM

దాయాది పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ మధ్య ఇటీవల పరస్పర దాడులు దశాబ్దాల తర్వాత రెండు పొరుగు దేశాల మధ్య జరిగిన అత్యంత తీవ్రమైన ఘర్షణల్లో ఒకటిగా నిలిచింది. దీనికి ప్రధాన కారణంగా ఉగ్రవాద నేత పేరు వినిపిస్తోంది. పాక్ ఆరోపణల ప్రకారం.. ఆ నేత తన భూభాగంపై దాదాపు ప్రతిరోజూ దాడులు చేసే ఉగ్రవాదులకు దిశానిర్దేశం చేస్తున్నాడని మండిపడుతోంది. అఫ్గన్, పాక్ మధ్య అక్టోబరు 14న 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాద సంస్థ అధినేత నూర్ వలి మెహ్‌సూద్, అతడి సహచరులు అఫ్గనిస్థాన్‌లో ఆశ్రయం పొందడంపై పాక్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.


గతవారం నూర్ వలి మెహసూద్‌ లక్ష్యంగా పాకిస్థాన్ సైన్యం కాబూల్‌లో వైమానిక దాడి చేసింది. అతడు ఉన్నట్టు భావించిన టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుంది. కానీ, ఈ దాడిలో అతడు త్రుటిలో తప్పించుకున్నట్టు పాక్ చెబుతోంది. ఆ తరువాత అతడి పేరుతో టీటీడీ ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేసింది. కానీ, 2022లో అల్ ఖైదా నేత ఐమాన్ అల్-జవహిరి లక్ష్యంగా అమెరికా జరిపిన దాడి తర్వాత కాబూల్‌లో జరిగిన తొలి వైమానిక దాడి ఇదే కాగా.. దీనిని పాక్ అధికారికంగా ధ్రువీకరించలేదు. అయితే,, పాక్ ఆరోపణలను ఖండించిన తాలిబన్లు.. ఆ దేశమే ఉగ్రవాదులకు స్వర్గంగా మారిపోయిందని ఎదురుదాడి చేశారు.


టీటీపీ చీఫ్‌గా 2018లో పగ్గాలు


అమెరికా డ్రోన్ దాడిలో టీటీపీ అగ్రనేతలు ముగ్గురు హతమవ్వగా.. మెహ్‌సూద్ 2018లో దాని నాయకత్వ బాధ్యతలు చేపట్టారు. అప్పటికే పాక్ దళాలు పట్టున్న ప్రదేశాల నుంచి అఫ్గన్‌లోకి తరిమికొట్టాయి. అయితే, మెహ్‌సూద్ పగ్గాలు చేపట్టిన తర్వాత టీటీపీ పునరుద్దరించి, వ్యూహాన్ని మార్చాడు. తమలో తాము పోరాడుకుంటోన్న వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చాడని విశ్లేషకులు అంటున్నారు. మత పండితుడిగా శిక్షణ పొందిన అతను సైద్ధాంతిక యుద్ధాన్ని కూడా చేపట్టాడు. ఇక, 2021లో తాలిబన్ల తిరిగి అఫ్గన్‌లో అధికారాన్ని చేజిక్కించుకోవడంతో టీటీపీకి మరింత స్వేచ్ఛ లభించడమే కాదు, ఆయుధ సహకారం అందుతోందనేది పాక్ వాదన.


 


 


గతంలో మసీదులు, మార్కెట్లు సహా పౌరులను లక్ష్యంగా చేసుకున్న టీటీపీ.. 2014లో ఓ పాఠశాలపై మారణకాండకు పాల్పడిన 130 మందికిపైగా పిల్లల ప్రాణాలు తీసింది. ఈ దాడులు పాక్ ప్రజల ఆగ్రహానికి కారణమయ్యాయని ఆందోళన చెందిన మెహ్‌సూద్.. కేవలం సైన్యం, పోలీసులనే లక్ష్యంగా చేసుకోవాలని టీటీపీకి సూచించారు.


ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఒక అరుదైన వీడియో ప్రసంగంలో.. ఆయన పాక్ సైన్యాన్ని ఇస్లాం వ్యతిరేకిగా చిత్రీకరించారు. రాజకీయాల్లో దాని పాత్రను విమర్శించారు. సైనిక జనరల్స్ "గత 78 ఏళ్లుగా పాకిస్థాన్ ప్రజలను హైజాక్ చేశారు’ అని అన్నారు. అటు, పాక్ సైన్యం మాత్రం టీటీపీ ఇస్లాంను వక్రీకరించిందని, తమ విరోధి భారత్ దానికి మద్దతు ఇస్తుందని ఆరోపించగా.. దీనిని న్యూఢిల్లీ ఖండించింది.


గిరిజన తిరుగుబాటు


మతపరమైన అంశాలను జాతీయవాదంతో కలిపి ఉగ్రవాద సిద్ధాంతాన్ని నిర్మించిన మెహ్‌సూద్.. కనీసం మూడు పుస్తకాలను రాశారు. అందులో 700 పేజీల కలిగిన ఓ పుస్తకంలో ఈ తిరుగుబాటుకు బీజాలు బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే ఉన్నాయని వాదించాడు.


ఉగ్రవాద కార్యకలాపాలపై నిపుణుడు అబ్దుల్ సయీద్ ప్రకారం.. మేహ్‌సూద్ పాక్ వాయువ్య ప్రాంతం, అఫ్గనిస్థాన్‌లో ఉండే పశ్తూన్ తెగకు ప్రతినిధిగా మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటాడు. టీటీపీని సాయుధ పోరాట ఉద్యమంగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, పశ్తూన్ గిరిజనుల హక్కుల కోసం తాలిబన్ పాలనా విధానానికి సమానమైన వ్యవస్థను స్థాపించాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే, టీటీపీకి వాయువ్య ప్రాంతం సహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ప్రజల మద్దతు చాలా స్వల్పంగా మాత్రమే ఉంది.


ఇటీవలి పాక్ అధికారులతో గిరిజన పెద్దల ద్వారా జరిగిన అనధికార చర్చల్లో టీటీపీ కొన్ని డిమాండ్లు చేసింది. అఫ్గన్ సరిహద్దుల్లో తమ విధానంలోని ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడం, ఆ ప్రాంతం నుంచి సైన్యాన్ని వెనక్కు తీసుకోవడం, వారిని తిరిగి అక్కడికి అనుమతించడం వంటి ఈ డిమాండ్లను అధికారులు తిరస్కరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa