ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'పాక్-అఫ్గాన్ యుద్ధం ఆపడం నాకు చాలా సులువు': ట్రంప్

international |  Suryaa Desk  | Published : Sat, Oct 18, 2025, 08:50 PM

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో పెరుగుతున్న ఉద్రిక్తతలను గమనించిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ ఘర్షణను తన తదుపరి 'గొప్ప విజయం'గా పేర్కొన్నారు. నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్న ట్రంప్.. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించడం తనకు చాలా సులభం అని చెప్పుకొచ్చారు. ఇలా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాలను ఆపి లక్షలాది మంది జీవితాలను కాపాడటం తనకు చాలా ఇష్టమని ప్రకటించారు.


తాను ఇప్పటికే ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని ట్రంప్ మళ్లీ నొక్కి చెప్పారు. రువాండా-కాంగో, భారత్-పాకిస్థాన్‌ల మధ్య యుద్ధాల గురించి ఆలోచించమని అన్నారు. ఆ యుద్ధాలు అన్నింటినీ తానే ఆపానని.. వాటన్నిటినీ ఓసారి అంతా గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతీ యుద్ధాన్ని ఆపడానికి ముందు.. ఈ యుద్దం ఆపితే మీరు నోబెల్ బహుమతి వస్తుందని చెప్పారని.. కానీ ఎన్ని ఆపినా తనకు ఇప్పటి వరకు రాలేదని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ ఓ మహిళకు వచ్చిందని.. ఆమె ఎవరో తనకు సరిగ్గా తెలియకపోయినా.. ఆమె చాలా ఉదారంగా ఉందని వివరించారు. ఆ విషయాల గురించి తాను పట్టించుకోనని చెప్పారు. తాను ప్రాణాలను కాపాడటం గురించి మాత్రమే ఆలోచిస్తానని ట్రంప్ వెల్లడించారు.


 అంతేకాకుండా తానిప్పుడు పాక్-అఫ్గాన్ మధ్య ఘర్షణను ఆపితే.. తొమ్మిదవది అవుతుందన్నారు. తనకు తెలిసినంతలో ఇప్పటి వరకు ఒక్క యుద్ధాన్ని కూడా పరిష్కరించిన అధ్యక్షుడు తమకు లేడని అన్నారు. బుష్ ఒక యుద్ధాన్ని ప్రారంభించారని.. కానీ తాను లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని మరోసారి చెప్పుకొచ్చారు. పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ఘర్షణలపై వ్యాఖ్యానిస్తూ.. ట్రంప్ తన మునుపటి వాదనను పునరావృతం చేశారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి కూడా తాను లక్షలాది మంది ప్రాణాలను కాపాడానని అన్నారని గుర్తు చేశారు. పాకిస్థాన్, భారత్‌ల ఉదాహరణ చూడమంటూనే.. అది చాలా దారుణంగా ఉండేదన్నారు. ఇప్పుడు పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై దాడి చేసిందనే విషయం తనకు అర్థమైంనదన్నారు.


అవసరమైతే.. నేను దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని అన్నారు. అది నాకు సులభమైన విషయం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి తాను అమెరికాను నడపాలని.. కానీ యుద్ధాలను పరిష్కరించడం నాకు చాలా ఇష్టమని ట్రంప్ అన్నారు. పాక్-అఫ్గాన్‌ల మధ్య 48 గంటల కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన అనంతర ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కాల్పుల విరమణ పొడిగింపు.. సమస్య పరిష్కారానికి ఇరు పక్షాలు దోహాలో సమావేశం కానున్నట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఈక్రమలోనే ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం.








SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa