ట్రెండింగ్
Epaper    English    தமிழ்

19.10.2025 నుండీ 25.10.2025 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు)

Astrology |  Suryaa Desk  | Published : Sun, Oct 19, 2025, 02:50 PM

మేషరాశి.... (అశ్విని 1 2 3 4,భరణి 1 2 3 4,కృతిక 1వ పాదం) (నామ నక్షత్రములు: చూ, చే ,చొ, లా,లీ, లూ, లే, లో,ఆ)వారం ప్రారంభంలో చతుర్ధధిపతి, ద్వితీయ సప్తమాధిపతి షష్ఠ స్థానంలో యుతి, నవమ వ్యయాధిపతిఉచ్ఛ లో చతుర్ధ స్థాన ప్రవేశం. ఆత్మీయుల దగ్గర నుంచి ఆశించిన స్థాయిలో సహకారం తగ్గుతుంది. అయినప్పటికీ సజ్జన వ్యక్తుల సహాయంతో కొంత ముందుకు వెళతారు. పెద్దల ఆశీస్సులు, సామాజిక సేవ, ఆధ్యాత్మిక ఆలోచనలు, కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామితోనూ అనుకూలతలో మిశ్రమ ఫలితాలు. వృత్తి సంబంధ విషయాలలో అధిక శ్రమ విజయం. వ్యక్తులు ప్రశంసిస్తారు. వారం చివరిలో లాభాలను ఉపయోగించుకునే విషయంలో అనవసర వైరాగ్య భావనలను అధిగమించాలి, ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. ఈ విషయంలో అనేక ఆటంకాలు ఇబ్బంది పెడుతున్న అధిక కృషితో ముందుకు వెళతారు.అధిక ఉద్వేగాలను నియంత్రించు కోవాలి వృత్తిపరమైన విషయాల్లో అధిక శ్రమ, కొలీగ్స్ తో అభిప్రాయ బేధాలు రాకుండా కమ్యూనికేషన్ విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. గాసిప్స్ కి దూరంగా ఉండటం మేలు.మంచి ఫలితాల కొరకు దుర్గాదేవి ఆరాధన, దేవాలయ దర్శన మంచిది


వృషభరాశి...(కృతిక 2,3,4,రోహిణి 1 2 3 4,మృగశిర 1 2 పాదాలు) (నామ నక్షత్రములు:ఈ, ఊ, ఎ, ఓ, వా, వీ, వూ, వె, వో)  


వారం ప్రారంభంలో తృతీయాధిపతి లగ్న షష్ఠాధిపతి పంచమ స్థానంలో యుతి, అష్టమ లాభాధిపతి గురుడు ఉచ్ఛ లో తృతీయ స్థాన ప్రవేశం, ఫలితాంశ ములు గమనించగా ఆకస్మిక ఖర్చులు చేసి, లాభపరమైన విషయాల కొరకు ముందుకు వెళతారు. గౌరవాన్ని పెంపొందించు కోవడానికి కృషి చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనలు వారి ఆలోచనలు సమన్వయ పరుచుకుంటూ ముందుకు వెళ్లినట్లయితే అభిప్రాయ బేధాలకు దూరంగా ఉంటారు. అనవసరమైన ఖర్చులను ముఖ్యంగా అవసరం లేని వస్తువులకు కొనుగోలు కొరకు నియంత్రించుకోవాలి. వ్యాపార పరంగా కొంతవరకు ఆదాయం అనుకూలంగా ఉంటుంది, సంతానము జీవిత భాగస్వామి తో కలిపి చక్కని సమయాన్ని గడుపుతారు. వారం మధ్యలో ఇష్టమైన వ్యక్తుల కొరకు చేసే ఖర్చులు అధికంగా ఉంటాయి. వారం చివరిలో దూర ప్రయాణాల మీద ఆసక్తి తగ్గుతుంది. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య మీద శ్రద్ధ తీసుకుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులను, ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన శ్రద్ధతో ముందుకెళ్లాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు గణేష్ ఆరాధన మంచిది.


మిధున రాశి...(మృగశిర 3 4,ఆరుద్ర 1 2 3 4,పునర్వసు 1,2,3 పాదాలు) (నామ నక్షత్రములు: కా, కి, కూ, ఖం , జ్ఞ, చ్చ, కే, కో, హ, హి)  


వారం ప్రారంభంలో ద్వితీయాధిపతి, పంచమ వ్యయాధిపతి చతుర్ధ స్థానంలో యుతి, సప్తమ రాజ్యాధిపతి ఉచ్ఛ లో ద్వితీయ స్థాన ప్రవేశం. ఆర్థిక విషయాలు మాట విలువ గౌరవము కుటుంబ అంశాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా గౌరవం పెంపొందించుకుంటారు. సామాజిక సంబంధాల విషయంలో విలువలు పెరుగుతాయి. సంతాన అభివృద్ధి కొరకు, సృజనాత్మకత పెంపొందించుకునే విషయాలలో ప్రత్యేక ఆలోచనలు. వాహన, గృహ విషయాలు కొంత అసౌకర్యం. సంతానానికి సంబంధించిన విషయాలలో ఇగో (అహం) సమస్యలకి చోటి ఇవ్వరాదు. హృదయాందోళనను అధిగమించాలి. సంతానం యొక్క ఆలోచనలు ఆరోగ్యము మీద దృష్టి సారిస్తారు. ఆశించిన స్థాయిలో ఉన్నత పదవులలో ఉన్న వ్యక్తుల సహకారం లభ్యం అవ్వకపోవడం వల్ల కొంత అసంతృప్తి. వారం మధ్యలో ఆశించిన విషయాలలో విజయం. ఇతరులు తీసుకున్న రుణములు అందుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి.దైనందన జీవితంలో కొత్త మార్పులు చేసుకుంటారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయుని ఆరాధన, శ్రీ దత్త శరణం మమ శ్లోకం మంచివి


కర్కాటక రాశి...(పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4 పాదాలు) (నామ నక్షత్రములు: హి, హూ, హే, హో, డా, డీ ,డూ, డే, డో)


వారం ప్రారంభంలో తృతీయంలో చంద్ర శుక్రుల యుతి, రాశిలోకే షష్ట భాగ్యాధిపతి గురుగ్రహ ఉచ్ఛస్థాన ప్రవేశం.ఆధ్యాత్మిక కార్యక్రమముల మీద ఆసక్తి పెరుగుతుంది. క్షేత్ర సందర్శనకై దూర ప్రయాణములకు, విద్యాపరంగా ఉన్నత విద్య కొరకు విదేశాలకు ప్రయత్నములు అధికం. సజ్జన వ్యక్తుల సహకారం ఆనందాన్నిస్తుంది, నూతన స్నేహ సంబంధాల విషయంలో భావోద్వేగాలకు లోనవుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లోనూ, వ్యాపార సంబంధాల్లోనూ ఘర్షణలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో కుటుంబ సభ్యుల సహకారంతో అనుకొన్న పనులు సాధిస్తారు, వృత్తి పరంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది మానసిక ప్రశాంతత పొందుతారు వారం చివరలో సమయస్ఫూర్తి, జ్ఞాపక శక్తి మొదలైన విషయాలలో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి.ఉపాసన విషయంలో ఆటంకాలు అధిగమించాలి. తెలియని హృదయాందోళన, అనవసర ఆలోచనలు చికాకులు కలిగించే అవకాశం ఉంది. సంతాన అభివృద్ధి విషయాలు మీద దృష్టి. మంచి ఫలితాలు కొరకు గణపతిని గరిక పూజతో పూజించటం మేలు.


సింహరాశి...(మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1వ పాదం) (నామ నక్షత్రములు: మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే)


వారం ప్రారంభంలో ద్వితీయంలో తృతీయ రాజ్యాధిపతి శుక్ర, వ్యయాధిపతి చంద్రుల కలయిక, వ్యయ స్థానంలో ఉచ్ఛ లోకి పంచమ అష్టమాధిపతి అయిన గురు గ్రహ ప్రవేశం.ఆకస్మిక ధన వ్యయ సూచన, నిర్ణయ సామర్థ్యం పెంచుకొనడానికి కృషి చేస్తారు. శారీరక శ్రద్ధ, రోగ నిరోధక శక్తిని చూసుకుంటూ ముందుకు పెడతారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నిత్య జీవన దినచర్యలో నూతన మార్పులు చేపడుతారు. వాకింగ్ యోగా లేదా జిమ్ మొదలైన వాటి మీద ఆసక్తి పెంచుకుంటారు. పూర్వపు రుణములు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇబ్బంది పెట్టే శత్రువుల విషయంలో అలాంటి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలోమిత్రుల సహకారం బాగుంటుంది. ప్రయాణాలు చేస్తారు. పడిన శ్రమకి తగిన ప్రతిఫలం లభిస్తుంది.స్నేహ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి కమ్యూనికేషన్ ని పెంపొందించుకుంటారు. వారం చివరిలో డ్రైవింగ్ చేసేవారు తగిన శ్రద్ధ తీసుకోవాలి. గృహ వాతావరణంలో కొంత సౌకర్యంగా ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులతో , గృహ వాహన విషయాలలో, విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. స్థిరాస్తుల పెంపొందించుకునే విషయంలో ఆలోచనలు. మరిన్ని మంచి ఫలితముల కొరకు విష్ణుమూర్తి దేవాలయ సందర్శన మంచిది


కన్యా రాశి...(ఉత్తరఫల్గుణి 2 3 4,హస్త 4,చిత్త 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: టో,పా,పి,పూ,షం,ణా,పే,పో)


వారం ప్రారంభంలో రాశిలో ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు లాభాధిపతి చంద్రునితో యుతి, లాభ స్థానంలో ఉచ్చ స్థానంలోకి చతుర్ధ సప్తమాధిపతి అయిన గురుగ్రహ ప్రవేశం. ఫలితాంశములను గమనించగా మాట విలువ గౌరవం పెరుగుతుంది , వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమతో అనుకున్న కార్యక్రమాలు చేయడానికి శ్రద్ధగా ముందుకు వెళతారు. ఆర్థిక, కుటుంబ విషయాలలో పడిన శ్రమకి తగిన గౌరవం గుర్తింపు లభిస్తాయి. వ్యాపార, భాగస్వామ్య వ్యవహారాలలో ఆర్థిక ఒడిదుడుకులను అధిగమిస్తారు. జీవిత భాగస్వామివృత్తి పరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ సంతానపరమైన విషయాలలో, నూతన పెట్టుబడులలో, కొన్ని సమయాలలో సమయస్ఫూర్తి తగ్గటానికి అవకాశం ఉన్న రీత్యా ఆచితూచి వ్యవహరించాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాలు మీద శ్రద్ధ వహించాలి. ప్రియమైన వ్యక్తులతో అభిప్రాయ భేదాలకు దూరంగా ఉండాలి. వారం చివరిలో ఇతర సహకారం ఆకస్మికంగా లభ్యం ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయం. మరిన్ని మంచి ఫలితాల కొరకు విష్ణు సహస్రనామాలు వినడం , ఆలయ సందర్శన మేలు.


తులా రాశి...(చిత్త 3 4,స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: రా, రి, రూ, రె, రో, తా, తీ, తూ, తే)    


వారం ప్రారంభంలో ద్వాదశ స్థానంలోలగ్న అష్టమాధిపతి, రాజ్యాధిపతి యుతి, తృతీయ షష్ఠాధిపతి రాజ్య స్థానంలో ఉచ్ఛ లో ప్రవేశం, ఫలితాంశములు గమనించగా ఇతరుల సహకారాన్ని కోరకుండానే మీ అంతట మీరు శ్రమించి వృత్తిపరంగా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ అవసరం, మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. బంధుమిత్రులతో వైరములకు దూరంగా ఉండాలి. దైవ కార్యక్రమముల మీద మనసు ప్రభావితం అవుతుంది. చారిటబుల్ ట్రస్టులు మొదలైన వాటిని సందర్శిస్తారు. డొనేషన్లు ఇస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ సందర్శన కొంత ప్రశాంతతనిస్తాయి. వృత్తిపరమైన విషయాలలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. సంతానముతో, ముఖ్యముగా ప్రియమైన వ్యక్తుల యొక్క ప్రవర్తనతో అధిక భావోద్వేగాలకు గురి అవుతారు. రావలసిన, పూర్వపు పెట్టు బడుల స్థిర చరాస్తుల గురించి చర్చలు. వాహన విషయాలు, ముఖ్యంగా తల్లి ఆరోగ్యము పై శ్రద్ధ తీసుకుంటారు. వారం మధ్యలో మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే విధంగా మంచి పుస్తకాలు, చదువుతారు. వారం చివరిలో ఆర్థిక కుటుంబ వ్యవహారాలలో కొన్ని చికాకులు, నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మికంగా ఉన్నత వ్యక్తుల సహకారం లభ్యం అవుతుంది. మరిన్ని మంచి ఫలితాలు కొరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మంచిది


వృశ్చిక రాశి...(విశాఖ 4,అనురాధ 1 2 3 4, జేష్ఠ 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: తో, నా, నీ, నూ, నె, నో, యా, యీ, యు)   


వారం ప్రారంభంలో లాభ స్థానంలో సప్తమ వ్యయాధిపతి, భాగ్యాధిపతి యుతి, ద్వితీయ పంచమాధిపతి ఉచ్చ స్థానమైన భాగ్యస్థానంలో ప్రవేశం, ఫలితాంశ ములు గమనించగా సంఘంలో గుర్తింపు పలుకుబడి గౌరవం కోసం, ప్రయాణాలరీత్య, సోదర వర్గంతో సమావేశాలు చర్చలు, ఆత్మీయ వ్యక్తుల కొరకు వారికి సహకరించుట కొరకు ఆకస్మిక ధన వ్యయం.సంతానం యొక్క అభివృద్ధి కొరకు, మరి ఆరోగ్య శ్రద్ధ కొరకు, పెట్టుబడుల కొరకు ధనాన్ని ఖర్చు చేస్తారు. కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, నూతన పరిచయాలు, సోషల్ మీడియా, ఇంటర్నెట్, ఆన్లైన్ మార్కెటింగ్ విషయాలలో కొత్త వ్యక్తుల్ని నమ్మినప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. వారం మధ్యలో ఆరోగ్య మీద శ్రద్ధ, కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రమ బడలిక అధికంగా ఉంటుంది. ఏదో తెలియని మానసిక ఒంటరితనం, ఆలోచనలు చికాకులు, వృత్తి పరంగా ఒత్తిడి. వారం చివరిలో వ్యక్తిగత స్థిర నిర్ణయాలు, నూతన ఉత్సాహం పెంపొందించుకునే దిశగా కొంతవరకు కృషి చేస్తారు. ఇబ్బంది పెట్టే వ్యక్తులని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. మరిన్ని మంచి ఫలితాలు కొరకునవగ్రహ దేవాలయ దర్శన, ఆదిత్య హృదయ పారాయణ మంచిది.


ధను రాశి...(మూల 1 2 3 4,పూర్వాషాఢ 1 2 3 4,ఉత్తరాషాఢ 1వ పాదం) (నామ నక్షత్రములు: యే, యో, భా,భీ, భూ, ధ, ఫ, డా, భే)


వారం ప్రారంభంలో లగ్న చతుర్ధాధిపతి గురుడు ఉచ్ఛ లో అష్టమ స్థాన ప్రవేశం, అష్టమాధిపతి, షష్ట లాభాధిపతి రాజ్య స్థానంలోయుతి. ఫలితంశములను గమనించగావృత్తిపరమైన విషయాలలో వ్యక్తులతో అభిప్రాయ బేధములకు, ఊహించని శత్రుత్వములకు ఘర్షణ, అవకాశములు. మీ యొక్క తెలివితేటలతో నైపుణ్యాలను పెంచుకుంటూ అత్యధిక శ్రమతో ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. భాగస్వామ్య వ్యవహారాల్లోనూ, కుటుంబ, గృహ విషయాలలోనూ ముఖ్యంగా వృత్తిపరమైన అంశాలలోనూ అధిక శ్రద్ధ చూపిస్తారు. అది కొంతవరకు ఆశించినంత మేరకు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి కుటుంబ వ్యవహారాల్లో ఆర్థిక విషయాలలో కొన్ని మార్పులు చేసుకుంటారు. కానీ తోబుట్టువులతో, వారసత్వ ఆస్తులు విషయంలోనూ ఘర్షణలకు దూరంగా ఉండాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన శ్రద్ధగా ముందుకు వెళ్లాలి. మాట్లాడే మాటల వల్ల ఆత్మీయులతో సంబంధాలు ఇబ్బంది పడే అవకాశం ఉన్న రీత్యా అధిక ఉద్వేగాలను అధిగమించాలి. వారం మధ్యలో ఎదురుచూసిన వర్తమానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో చర్చలు. మానసిక ప్రశాంతత. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. స్థిరాస్తులు, ముఖ్యంగా పాత ఇంటిని రీ మోడల్ చేయించుకోవడానికి అధికంగా ఖర్చులు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, చివరిలో ఆకస్మిక ప్రయాణాలు, శ్రమ నిద్రలేమి, చికాకును కలిగిస్తాయి. రుణము ఇచ్చేటప్పుడు, వ్యాపార వ్యవహారాల్లోనూ జాగ్రత్త అవసరం. మరిన్ని మంచి ఫలితాల కొరకు లక్ష్మీ అష్టోత్తరాలు శతనామావళి జపించడం మేలు


మకర రాశి...(ఉత్తరాషాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ఠ 1 2 పాదాలు) (నామ నక్షత్రములు: భ,జా,జి,ఖి,ఖు,ఖే,ఖో,గా,గి)


వారం ప్రారంభంలో సప్తమాధిపతి, పంచమ రాజ్యాధిపతి నవమస్థాన యుతి, తృతీయ వ్యయాధిపతి గురుడు ఉచ్చ, సప్తమ స్థాన ప్రవేశం, ఫలితాంశములు గమనించగా జీవిత భాగస్వామి, అన్నదమ్ములు మొదలైనవారి కొరకు ఖర్చులు, విదేశాల కొరకు దూర ప్రయాణాలు, శత్రువుల మీద విజయం సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు, స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటారు. లాభదాయకమైన ఆలోచనలు. భాగస్వామి ఆరోగ్య విషయంలో అధిక శ్రద్ధ, వ్యాపార అంశాలలో వేరే ప్రదేశాలలో విస్తరించడానికి కీలక నిర్ణయాలు, బంధుమిత్రుల సహకారం, తర్కంగా ఆలోచనలు చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులను, ఆధ్యాత్మిక వ్యక్తులను కలుస్తారు. తెలివిగా చాకచక్యంగా వ్యవహరించి వృత్తిపరంగా, అధిక శ్రమతో అభివృద్ధి చెందుతారు. జీవిత భాగస్వామితో అనుకూలం, వ్యాపారం మార్పులు. వారం చివరిలో ఆరోగ్యం గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి సమయానికి ఆహార స్వీకరణ అవసరం. విదేశీ ప్రయాణాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. భూ, రియల్ ఎస్టేట్ అంశాలు ఆశాజనకంగా ఉంటాయి. మరిన్ని మంచి ఫలితాలు కొరకు వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది


కుంభ రాశి...(ధనిష్ట 3 4, శతభిషం 1 2 3 4, పూర్వాభాద్ర 1 2 3 పాదాలు) (నామ నక్షత్రములు: గూ, గే, గో, సా, సి, సు, సే, సో, దా)    


వారం ప్రారంభంలో షష్ఠాధిపతి, చతుర్ధ భాగ్యాధిపతి అష్టమ స్థాన యుతి. ద్వితీయ లాభాధిపతి ఉచ్చలో షష్ట స్థాన ప్రవేశం. ఫలితాంశములు గమనించగా మాటల వల్ల అపార్థములు రాకుండా గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని పెంపొందించుకోవాలి. కొత్త ఆలోచనలు , మీ వృత్తిలో అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు.ఆర్థిక విషయాలలోనూ, సంతాన అభివృద్ధి ఆరోగ్య విషయాలలోనూ, విద్యార్థులు పోటీకి సంబంధించిన అంశాలలోనూ అధిక శ్రద్ధ చూపిస్తారు. పాత రుణములు కొంతవరకు తీరుస్తారు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో తల్లి తరపు బంధు వర్గంతో అభిప్రాయ బేధాలకు దూరంగా ఉండాలి. వారం మధ్యలో నైపుణ్యాలు పెంచుకుంటారు. కృషి శీలత పెరుగుతుంది. వారం చివరిలో ఆత్మీయ వ్యక్తులతో అనవసర అపార్ధాలు కలక్కుండా వారికి అవసరమైన సహకారాన్ని అందించాలి. విద్యార్థులు అధిక శ్రమతో, పోటీలలో నెగ్గి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. స్నేహ సంబంధాలు, మైత్రి బంధాలు ముఖ్యంగా ఉన్నత అధికారులతోనూ, పలుకుబడి కలిగిన వ్యక్తులతోనూ వారి సహాయ సహకారాలు కోరుకునేటప్పుడు ఘర్షణలకు దూరంగా వినయముగా ఉండాలి. అధిక శ్రమతోనైనా అనుకున్న ఫలితాలను సాధించుకో గలుగుతారు. మరిన్ని మంచి ఫలితాల కొరకు శివరాధన , దేవాలయ సందర్శన మంచిది


మీన రాశి...(పూర్వాభాద్ర 4,ఉత్తరాభాద్ర 1 2 3 4,రేవతి 1 2 3 4 పాదాలు)(నామ నక్షత్రములు: దీ , దు, ఇ+, ఝ, ధా, దే, దో, చా, చి)


వారం ప్రారంభంలో పంచమాధిపతి, తృతీయ అష్టమాధిపతి సప్తమ స్థానంలో యుతి, లగ్న రాజ్యాధిపతి ఉచ్ఛలో పంచమస్థాన ప్రవేశ ఫలితాంశములు గమనించగా స్వస్థల సందర్శన కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు, పెద్దల ఆరోగ్యం అసంతృప్తిని ఇస్తుంది. మీ పాత అనారోగ్యాల విషయంలో తగిన శ్రద్ధ అవసరం.గృహ వాతావరణం లో కుటుంబ సభ్యులతో ఘర్షణలు ఆత్మ విశ్వాసం తగ్గిస్తాయి. డ్రైవింగ్ చేసే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వారం మధ్యలో ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలను అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఉపాసనబలం పెంచుకుంటారు. రైటింగ్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. వారం చివరిలో శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి అధిక కృషితో ముందుకు వెళతారు. పాత రుణాలు తీరుస్తారు. ముఖ్యంగా ఘర్షణాత్మకమైన వాతావరణానికి వీలైనంత దూరం మేలు.తండ్రి,పెద్దలతో వా దోపవాదాలు నివారించాలి. మరిన్ని మంచి ఫలితాల కొరకు దత్తాత్రేయ స్వామి ఆరాధన మంచిది.


 


(గమనిక: గోచార రీత్యా చెప్తున్న రాశి ఫలితాలు జనరల్ వి, వ్యక్తిగతంగా ఉద్దేశించి చెబుతున్నవి కావు, వ్యక్తిగత జన్మజాతకంలో అనగా వ్యక్తి జన్మ కుండలి (జన్మించిన సమయం, తేదీ, ప్రదేశం ఆధారంగా నిర్మించేది) ప్రకారం నడిచే దశలు అంతర్దశలు ప్రధానంగా చూసుకుంటూ ఆ దశ అంతర్దశలకు సంబంధించిన దానికి తగిన పరిహారాలు పాటించుకుంటూ, దానితో పాటు ఈ గోచార ఫలితాలను చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి. చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు).


 


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa