విశాఖపట్నం వేదికగా నవంబరు 14, 15 తేదీల్లో జరగనున్న భారత పరిశ్రమల సమాఖ్య భాగస్వామ్య సదస్సును సరికొత్త పంథాలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సు కేవలం పెట్టుబడుల ఒప్పందాల కే పరిమితం కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే విధానాల రూపకల్పనపై విస్తృత మేధోమథనానికి వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సు తరహాలో ఇక్కడ కూడా పెట్టుబడిదారులు, విధానకర్తల మధ్య ఫలవంతమైన చర్చలు జరగాలని స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఉన్నతాధికారులు, ఈడీబీ అధికారులతో కలిసి సదస్సు నిర్వహణపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, "సానుకూల పారిశ్రామిక విధానాలు ఉన్నప్పుడే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకు వస్తాయి. అప్పుడే రాష్ట్రంలో సంపద సృష్టి సాధ్యమవుతుంది. విశాఖ సదస్సును కేవలం పెట్టుబడులు ఆకర్షించే కార్యక్రమంగా చూడవద్దు. ఇది విజ్ఞానాన్ని పంచుకునే, భవిష్యత్ ప్రణాళికలను చర్చించుకునే ఒక మేధోమథన వేదికగా నిలవాలి" అని అన్నారు. ప్లీనరీ, బ్రేక్‌అవుట్ సెషన్ల ద్వారా వివిధ రంగాలపై లోతైన చర్చలు జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, అంతిమంగా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో ఇటీవల గూగుల్ సంస్థ 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో డేటా ఏఐ హబ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం శుభపరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. "గూగుల్ రాకతో విశాఖ నగరం ఒక హ్యాపెనింగ్ సిటీగా మారింది. ఈ స్ఫూర్తితో రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిరునామాగా మార్చాలి. 'వన్ ఫ్యామిలీ వన్ ఏఐ' తరహాలో 'ఏపీ టూ ఏఐ' నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి" అని అధికారులకు సూచించారు. ఈ సదస్సులో ఏఐ ఫర్ గుడ్, సెమీ కండక్టర్లు, అంతరిక్ష సాంకేతికత, డ్రోన్లు, ఎలక్ట్రానిక్స్, మెడ్‌టెక్, స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి భవిష్యత్ తరహా అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని ఆదేశించారు.వీటితో పాటు లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జలరవాణా, కోల్డ్ స్టోరేజీలు, అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలను కూడా చర్చనీయాంశాలుగా చేర్చాలని స్పష్టం చేశారు. సదస్సుకు దేశ, విదేశీ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థల ప్రతినిధులను ఆహ్వానించాలని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సదస్సును ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. సదస్సులో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలను వివరిస్తూ ప్రత్యేక ప్రజంటేషన్ సిద్ధం చేయాలని, 21వ శతాబ్దం భారత్‌దే అనే స్ఫూర్తిని అది ప్రతిబింబించేలా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధుల కోసం హోం స్టే వసతి కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించడం గమనార్హం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa