ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగుల హక్కుల సాదనే ఏపి ఎన్‌జిజిఓ ప్రధాన లక్ష్యమన్న విద్యాసాగర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 23, 2025, 08:03 AM

ఉద్యోగుల హక్కుల సాధనే ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన లక్ష్యమని, వారి డిమాండ్ల పరిష్కారంలో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ స్పష్టం చేశారు.విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ జిల్లా, క్యాపిటల్ సిటీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డీఏ మంజూరు, హెల్త్ కార్డుల అమలు వంటి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన హర్షణీయమని పేర్కొన్నారు.గత ఆరు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఇచ్చిందని తెలిపారు. ఒక విడత కరువు భత్యం మంజూరు చేయడం, 60 రోజుల్లో హెల్త్ కార్డు సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపడుతున్నారని వివరించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా హెల్త్ కార్డులను ఇన్సూరెన్స్ పరిధిలోకి తేవడానికి పరిశీలన జరుగుతోందన్నారు.డీఏ జీవో విడుదలలో ఏర్పడిన ఇబ్బందులపై ఏపీ ఎన్జీవో సంఘం చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం స్పందించి జీవో నెంబర్లు 62, 63 జారీ చేయడం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని విద్యాసాగర్ తెలిపారు. సవరించిన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగులు, సీపీఎస్ సిబ్బంది, పెన్షనర్లకు ఒకే షెడ్యూల్‌లో మూడు విడతలుగా డీఏ బకాయిలు చెల్లించడం ఉపశమనకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 2018 నుండి 2023 వరకు పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల చెల్లింపులు జరగకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ఉద్యోగులకు తల్లిలాంటిదని, 74 సంవత్సరాలుగా ఉద్యోగుల సేవలో ఉన్న ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సభ్యత్వం అనేది ఉద్యోగి, సంఘం మధ్య వారధి అని దానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి. రమణ మాట్లాడుతూ.. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, బకాయిల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నోషనల్ ఇంక్రిమెంట్స్, పదవీ విరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపు వంటి డిమాండ్ల సాధనకు ఏపీ ఎన్జీవో సంఘం కట్టుబడి ఉందని తెలిపారు.డీఏ సవరణలో సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తదితర అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.సమావేశంలో జిల్లా అధ్యక్షుడు డి.ఎస్.ఎన్.రెడ్డి, సహా అధ్యక్షులు వేమూరి ప్రసాద్, కార్యదర్శి పి. రమేష్, కోశాధికారి బి. సతీష్‌కుమార్, వి. నాగార్జున, ఎం. రాజుబాబు, జి. రామకృష్ణ, సిహెచ్. దిలీప్, కె. శివలీల, సివిఆర్. ప్రసాద్, ఎస్కె. నజీరుద్దీన్, కె.ఆర్.ఎస్. గణేష్ తదితరులు పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa