ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ ప్రాంతీయ కార్యాలయాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న ప్రధాన బ్యాంకులన్నీ ఇకపై అమరావతి కేంద్రంగా తమ కార్యకలాపాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 28న ఉద్దండరాయునిపాలెం సమీపంలో 12 ప్రముఖ బ్యాంకుల రాష్ట్ర ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాజధాని అమరావతి నిర్మాణానికి, ఆర్థిక కార్యకలాపాలకు కొత్త ఊపునివ్వనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాల్గొననున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమక్షంలో, ఒకే వేదికపై ఏకకాలంలో 12 బ్యాంకుల భవన నిర్మాణాలకు పునాది రాయి వేయనున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB), ఇండియన్ బ్యాంక్, ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ (APCOB), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా మరికొన్ని బ్యాంకులు తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నాయి.
గతంలో తెదేపా ప్రభుత్వం ఉద్దండరాయునిపాలెం వద్ద ప్రధాన రహదారి (ఎన్10 రోడ్డు) సమీపంలో ఈ బ్యాంకుల కోసం స్థలాలను కేటాయించింది. ఎస్బీఐకి 3 ఎకరాలు, ఆప్కాబ్‌కు 2 ఎకరాలు, ఇతర బ్యాంకులకు 25 సెంట్లు చొప్పున భూమిని కేటాయించారు. ఈ కార్యాలయాల్లో అత్యంత భారీ స్థాయిలో ఎస్బీఐ ప్రధాన కార్యాలయం 14 అంతస్తుల్లో, లక్ష చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మితం కానుంది. బ్యాంకులు తమ కార్యకలాపాలను అమరావతికి తరలించడం ద్వారా వేలాది మంది ఉద్యోగులు రాజధానికి రానున్నారు, ఇది స్థానిక ఆవాసాలు, రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్నిస్తుంది.
ప్రధాన బ్యాంకుల రాకతో అమరావతి నిజమైన ఆర్థిక కేంద్రంగా (Financial Hub) రూపుదిద్దుకుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ఏర్పాటు వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకుంటున్న నేపథ్యంలో, బ్యాంకుల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపనతో అమరావతి ప్రగతి బాటలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని కూడా ప్రతిబింబిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa