ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన యూఏఈ పర్యటనను వేగవంతం చేశారు. పర్యటనలో భాగంగా రెండో రోజైన గురువారం, అబుదాబిలో ఇంధన, టెక్నాలజీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ భేటీలు జరిగాయి. ముఖ్యంగా, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు.దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్... ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూలమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఏపీలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు వివరించారు. యూఏఈ పర్యటనలో భాగంగా రెండో రోజు గురువారం అబుదాబీలో అల్ మైరాహ్ ఐలాండ్‌లోని ఏడీజీఎ స్క్వేర్‌లో ఏడీఎన్‌ఓసీ గ్లోబల్ ట్రేడింగ్ ప్రతినిధి అహ్మద్ బిన్ తలిత్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఈ భేటీలో పెట్రోకెమికల్, ఇంధన, ఎల్‌ఎన్‌జీ, గ్యాస్ ప్రాసెసింగ్, పోర్ట్ లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలు గురించి చర్చించారు. కృష్ణపట్నం, మచిలీపట్నం, రామాయపట్నం, కాకినాడ వంటి పోర్టుల సమీపంలో పెట్రో కెమికల్, ఎనర్జీ రంగాల పెట్టుబడులకు అనువుగా ఉంటాయని సీఎం అన్నారు. ఏడీఎన్ఓసీ - ఆంధ్రప్రదేశ్ మధ్య సాంకేతిక సహకారం పైనా స్పష్టమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని భేటీలో ఇరువురు నిర్ణయించారు.అబుదాబీ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిమ్ అల్ జాబీతో, జీ 42 సీఈఓ మాన్సూర్ అల్ మాన్సూరీతోనూ ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ఏపీ పయనిస్తోందని, రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు జనవరి నుంచి అందుబాటులోకి వస్తున్నాయని సీఎం తెలిపారు. కొత్త అవకాశాలకు, ఇన్నోవేషన్‌కు అమరావతి కేంద్రంగా ఉంటుందన్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సుకు రావాలని ఈ సందర్భంగా వారిని సీఎం ఆహ్వానించారు. కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్, హెల్త్‌టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలపై పనిచేస్తున్న జీ 42 ఇంటర్నేషనల్ సంస్థను ఏఐ డేటా సెంటర్లు, ఇన్నోవేషన్ ల్యాబ్స్, స్మార్ట్ గవర్నెన్స్ టెక్నాలజీని రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు స్వాగతించారు.అనంతరం అబుదాబీలోని పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం నెట్వర్క్ లంచ్ సమావేశంలో పాల్గొంది. దీనిలో జీ 42 సీఈవో మనుకుమార్ జైన్, ఏడీఐసీ గ్లోబల్ హెడ్ లలిత్ అగర్వాల్, ఐహెచ్‌సీ సీఈవో అజయ్ భాటియా, డబ్ల్యుఐవో బ్యాంక్ సీఈవో జయేష్ పాటిల్, పాలిగాన్ మార్ఫిక్ సీఈవో జయంతి కనాని, ట్రక్కర్ సీఈవో గౌరవ్ బిశ్వాస్, పాలసీ బజార్ గ్రూప్ సీఈవో యశిష్ దహియా, ఇన్స్యూరెన్స్ మార్కెట్ సీఈవో అవినాష్, ఇన్సార్ట్స్ సీఈవో అజార్ ఇక్బాల్, జీఐఐ సీఈవో పంకజ్ గుప్తా, నూన్ సీఈవో ఫరాజ్ ఖలీద్, ఇన్సెప్షన్ సీఈవో ఆశీష్ కోషి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను భారతదేశానికి టెక్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యాన్ని వారికి వివరించారు. రాష్ట్రంలో డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్, ఫిన్ టెక్, హెల్త్ టెక్, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను సూచించారు. త్వరలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఏపీలో ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. యూఏఈలో టెక్నాలజీ ఆధారిత కంపెనీలతో సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేసి ఏపీలో భవిష్యత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్‌తో పాటు పరిశ్రమలశాఖ, ఈడీబీకి చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa