ఎత్తైన కొండలు, పర్వతాలను దాటి.. ప్రయాణ సమయాన్ని, దూరాన్ని తగ్గించడంలో సొరంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొండలపై చుట్టూ తిరిగే రోడ్లు లేదా రైలు మార్గాల కంటే.. సొరంగాల ద్వారా నేరుగా వెళ్లొచ్చు. నగరాల్లో కూాడా ట్రాఫిక్‌ను తప్పించుకోవచ్చు. ఇంధన వినియోగం తగ్గడం వల్ల ఖర్చు కూడా తగ్గుతుంది. అయితే ఈ సొరంగాలను నిర్మించడం.. ముఖ్యంగా.. కొండ ప్రాంతాల్లో టన్నెల్స్ తవ్వడం అంత సులువైన విషయం కాదు. ఎత్తైన కొండలను తొలిచి సొరంగాలు నిర్మిస్తారు. అందుకోసం అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యం అవసరం అవుతుంది. అలాంటి ఇంజినీరింగ్ నైపుణ్యంతో నిర్మించిందే గొత్తార్డ్ బేస్ సొరంగం (Gotthard Base Tunnel). ఈ సొరంగాన్ని ఒక ఇంజినీరింగ్ మార్వెల్‌లా పరిగణిస్తున్నారు. మరి ప్రపంచంలోనే అతిపొడవైన ఈ టన్నెల్ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంజినీరింగ్ మార్వెల్..
స్విట్జర్లాండ్‌లోని గొత్తార్డ్ బేస్ టన్నెల్ ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపొడవైన సొరంగం. 1996లో ఆల్పైన్ రైల్ కారిడార్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. 2016 జూన్ 1న ప్రారంభమైన ఈ సొరంగం పొడవు.. 57.1 కిలోమీటర్లు (35.5 మైళ్లు). దాదాపు 13 బిలియన్ డాలర్ల ఖర్చుతో ఈ సొరంగాన్ని నిర్మించారు. దీనికంటే ముందు జపాన్‌లోని సైకన్ టన్నెల్ (Seikan Tunnel in Japan (53.85 కి.మీ.)) అతిపొడవైన సొరంగంగా ఉండేది. కాగా గొత్తార్డ్ బేస్ టన్నెల్ నిర్మాణంలో.. కఠినమైన శిల, భూగర్భ జలాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇంజినీర్లు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ఇరు వైపుల నుంచి భారీ టన్నెల్ బోరింగ్ మెషీన్లతో దీన్ని నిర్మించారు. అయితే డ్రిల్లింగ్ సరిగ్గా మధ్యలో ఒకేచోట కలిసేలా.. అత్యంత కచ్చితత్వంతో డిజైన్ చేశారు. అందుకే దీన్ని ఆధునిక ఇంజినీరింగ్ మార్వెల్‌గా పరిగణిస్తారు.
అత్యాధునిక సౌకర్యాలు..
రెండు సింగిల్ ట్రాక్ ట్యూబ్స్‌లా ఈ సొరంగం నిర్మాణం జరిగింది. దారి పొడవునా ప్రతి 325 మీటర్లకు ఎమర్జెన్సీ రూట్స్, వెంటిలేషన్ వ్యవస్థలు, అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్ గుండా రైళ్లు గంటకు 250 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చు. ఉత్తర యూరప్ నుంచి ప్యాసింజర్లను, వస్తువులకు దక్షిణ యూరప్‌కు సులభంగా తీసుకెళ్లొచ్చు.
ఎత్తైన స్విస్ ఆల్ప్స్ (పర్వత ప్రాంతాలు)లో ఈ సొరంగం ఉంది. ఈ సొరంగం నిర్మించడానికి ముందు.. మలుపులు ఉన్న పర్వత మార్గాల్లో ప్రయాణించడం సవాలుగా ఉండేది. వ్యయప్రయాసలకోర్చి కొండలు దాటుకుని.. ప్రయాణికులను, వస్తువులను అవతలివైపుకు చేరవేయాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు చెక్ పెట్టాలని యూరప్.. గొత్తార్డ్ బేస్ సొరంగానికి రూపకల్పన చేసింది.
ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాల్సిందే..
ఈ టన్నెల్ గుండా హై-స్పీడ్ రైళ్లు వెళతాయి. దాదాపు 20 నిమిషాల ప్రయాణం ఉంటుంది. టన్నెల్ అంతా చీకటిగా ఉంటుంది. రైళ్లో కేవలం క్యాబిన్ లైట్లు మాత్రమే ఆన్‌లో ఉంటాయి. ఎలాంటి కదలికలు లేకుండా ట్రైన్ స్మూత్‌గా వెళుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. దాదాపు 7500 అడుగుల వరకు ఎత్తుండే ఉండే పలు పర్వతాల గుండా ఈ సొరంగం వెళుతుంది. అంటే మనం కొండ కింద.. దాదాపు 2.3 కిలోమీటర్ల (2,300 మీటర్ల) లోతులో ప్రయాణిస్తున్నట్లన్నమాట. తలచుకుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి కదూ! అందుకే ఇలాంటి అనుభూతిని జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిందే. ఏమంటారు!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa