ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి కుటుంబానికి పక్కా ఉద్యోగం.. కాంట్రాక్టు ఉద్యోగులందరు పర్మినెంట్..మహా కూటమి మేనిఫెస్టో

national |  Suryaa Desk  | Published : Tue, Oct 28, 2025, 07:19 PM

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్దీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అనేక విన్యాసాలు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఉచిత హామీలు కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆర్జేడీ తేజస్వీ యాదవ్.. మహా కూటమి మేనిఫెస్టోని ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రాణ్‌’ పేరుతో విడుదల చేశారు. అందులో కీలక హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లో బిహార్‌లోని ప్రతికుటుంబంలోని ఒక వ్యక్తికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగుల్లా శాశ్వత హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణతో పాటు తదితర హామీలు మేనిఫెస్టోలో పొందుపర్చారు. మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడిన ఆర్డేజీ నేత తేజస్వి యాదవ్.. బిహార్‌ను అభివృద్ధి పథంలో నడిపించడంతో పాటు దేశంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా పాల్గొన్నారు.


మేనిఫెస్టోలోని హామీలు..


మహా కూటమి అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోపు ప్రతి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం


నెలకు రూ. 30,000 పారితోషికంతో జీవికా దీదీలకు ప్రభుత్వ ఉద్యోగుల్లా శాశ్వత హోదా.


కాంట్రాక్టు ఉద్యోగులందరూ క్రమబద్ధీకరణ


పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ


మై బెహిన్ మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సహాయం అందిస్తారు. డిసెంబర్ 1 నుంచి ఇది అమలు చేస్తారు. ఇలా వచ్చే ఐదేళ్ల పాటు ఏటా రూ. 30,000 ఇస్తారు.


ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల విద్యుత్ ఇచితం


భూమి లేని వారికి 242 గజాల భూమి


వక్ఫ్ సవరన బిల్లును హోల్డ్‌లో పెట్టి.. వక్ఫ్ ప్రాపర్టీలను పారదర్శకంగా, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేలా కాపాడటానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.


వెనుకబడిన పంచాయతీలు, స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు 20 నుంచి 30కి పెంపు. ఎస్సీ కోటా 16 నుంచి 20కి పెంపు.


మద్యపాన నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు


రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పార్కులు ఏర్పాటు చేస్తామని కూటమి మేనిఫెస్టో పేర్కొంది.


బోద్ గయాలో ఉన్న బౌద్ధ ఆలయాలను.. బౌద్ధులే నిర్వహించేలా వారికి అప్పజెప్పడం.


నితీశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం..


ఈ కార్యక్రమానికి ముందు పార్సా, సారణ్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని.. మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని ఆరోపించారు. ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అధికార పక్షంపై ఆరోపణలు చేశారు. 'సారణ్‌లో హత్యలు, దోపిడీ, కిడ్నాప్‌లు నిత్యం జరుగుతున్నాయి. అయినా సీఎం నీతీశ్‌ కుమార్‌ పట్టించుకోవడం లేదు. బాధితులను ఒక్కసారి కూడా పరామర్శించలేదు. ఈ ప్రభుత్వం ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మా కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు.. ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం' అని తేజస్వి యాదవ్ అన్నారు.


మరోవైపు, బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు ఉంది. అయినా మద్యం తయారీ, అమ్మకం, ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ప్రశాంత్‌ కిశోర్‌ జన్‌ సురాజ్‌ పార్టీ ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్‌ 6న తొలిదశ, 11న రెండో దశ పోలింగ్ జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa