ఆర్ఎస్ఎస్ కార్యకాలాపాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. ఈ మేరకు జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం మంగళవారం (అక్టోబర్ 28) మధ్యంతర స్టే విధించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను నవంబరు 17వ తేదీకి వాయిదా వేసింది.
అలా చేస్తే కఠిన చర్యలు..
ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏ సంస్థ అయినా.. రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల, విద్యాసంస్థల ఆవరణలను ఉపయోగించుకోవాలనుకుంటే.. తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని చెప్పంది. ఈ మేరకు అక్టోబరు 18న కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు, ఆర్ఎస్ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తైన నేపథ్యంలో భారీస్థాయిలో కవాతులు నిర్వహించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు రావడంపై తీవ్ర వివాదం నెలకొంది. రాష్ట్రంలో ఆరెస్సెస్‌ను నిషేధించడమే లక్ష్యంగా కర్ణాటక కాంగ్రెస్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఓ సంస్థ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రైవేటు సంస్థల హక్కులను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో ఆరోపణలు చేసింది. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.
మరోవైపు, అక్టోబర్ 19న ఆర్ఎస్ఎస్ ర్యాలీకి అధికారులు అనుమతి నిరాకరించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే సొంత నియోజకవర్గం చిట్టాపూర్‌లో.. ఆర్‌ఎస్‌ఎస్ ‘రూట్ మార్చ్’నిర్వహించాలనుకుంది. ఈ మేరకు తహశీల్దార్‌కు దరఖాస్తు కూడా చేసుకుంది. శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందనే కారణం చూపుతూ.. తహశీల్దార్ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. కాగా, ఇటీవల తమిళనాడులో పాఠశాలలో గురు పూజ, శాఖ శిక్షణా కార్యక్రమం నిర్వహించారని39 మంది ఆర్ఎస్ఎస్ సభ్యులు అరెస్ట్ చేశారు.
'ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి..'
ఇటీవల కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై ప్రజా స్థలాల్లో నిషేధం విధించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు.. మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. పోలీసుల అనుమతి లేకుండా.. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్‌ఎస్ఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపించారు. అనంతరం ఈ లేఖను పరిశీలించాలని అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కర్ణాటక సీఎస్‍కు లేఖలు రాసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa