గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలతో అల్లర్లు చెలరేగడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణాలు అరచేతుల్లో బెట్టుకుని ఇండియాకు పారిపోయివచ్చారు. అయితే, భారత్ నుంచి వెళ్లి ఓ ఫోన్ కాల్ ఆమెను కాపాడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ ఫోన్ కాల్ 20 నిమిషాలు ఆలస్యమైతే.. హసీనా ప్రాణాలతో ఉండేవారకాదని వెల్లడయ్యింది. త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఇన్షా బంగ్లాదేశ్.. ది స్టోరీ ఆఫ్ యాన్ అన్‌ఫినిష్డ్ రివల్యూషన్ (Inshallah Bangladesh: బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు రిజర్వేషన్ల వ్యతిరేకిస్తూ జులై 2024లో యువత చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. హింసలో వందల మంది మృతిచెందగా.. వేలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాలతో నాటి ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవి నుంచి తప్పుకుని, దేశం వీడాల్సి వచ్చింది. ఆందోళనకారులు ప్రధాని అధికారిక నివాసం గణభవన్‌పై దాడిచేశారు. ఇది జరగడానికి 20 నిమిషాల ముందే హసీనా సైనిక హెలికాప్టర్‌లో అక్కడ నుంచి బయటపడ్డారు. భారత్ నుంచి వచ్చిన ఫోన్ కాల్‌తోనే ఆమె తప్పించుకున్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
ఆ పుస్తకంలో పేర్కొన్న ప్రకారం.. ఏం జరిగినా తాను దేశం వీడే ప్రసక్తే లేదని షేక్ హసీనా భీష్మించుకున్నారు. దీంతో ఆమెను ఒప్పించడానికి సోదరి రెహానా, అమెరికాలో ఉండే ఆమె కుమారుడు వాజీద్‌లను బంగ్లాదేశ్ త్రివిధ దళాధిపతులు రంగంలోకి దింపారు. ఇదే సమయంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళనకారులు ప్రధాని అధికార నివాసం దిశగా దూసుకొస్తున్నారు. అప్పటికే హసీనా ప్రయాణించే విమానం తమ గగనతలంలోకి ప్రవేశించేందుకు భారత్ అనుమతి ఇచ్చింది.
సరిగ్గా అప్పుడే 2024 ఆగస్టు 5న మధ్యాహ్నం 1.30 గంటలకు భారత్ నుంచి హసీనాకు ఫోన్ కాల్ వచ్చింది. హసీనాతో బాగా పరిచయం ఉన్న ఉన్నతాధికారి నుంచి ఆ కాల్ వచ్చిందని పుస్తకంలో పేర్కొన్నారు. ‘‘అదొక షార్ట్ కాల్.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని హసీనాకు ఆయన చెప్పారు. తక్షణమే గణభవన్‌ను వీడకపోతే.. చంపేస్తారని అప్రమత్తం చేసిన ఆయన.. భవిషత్యు పోరాటం కోసం ప్రాణాలతో ఉండాలి కదా అని సూచించారు. దీంతో హసీనా ఆశ్చర్యపోయారు. కానీ ఆమె తన నిర్ణయం మార్చుకోడానికి మరో అరగంట పట్టింది. కానీ ఆ మెసేజ్‌ను ఆమె ఎంతగానో విశ్వసించారు.. కానీ, బంగ్లాదేశ్‌ను వీడేముందు తన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, ఏ క్షణమైనా ఆందోళనకారులు గణభవన్‌లోకి చొచ్చుకొచ్చే అవకాశం ఉండటంతో అందుకు సైనికాధికారులు ఒప్పుకోలేదు. తర్వాత హసీనాను ఆమె సోదరి రెహానా బలవంతంగా కారులో కూర్చోబెట్టారు
కేవలం రెండు సూట్‌కేసుల్లో బట్టలు మాత్రమే తీసుకెళ్లారు.. మధ్యాహ్నం 2.23 గంటలకు సైనిక హెలికాప్టర్ ఢాకాలో బయలుదేరి అరగంటలోపు ఇండియాలోని ఢిల్లీ సమీపం హిండన్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. అప్పటి నుంచి ఢిల్లీలోని గుర్తుతెలియని ప్రదేశంలో హసీనాకు భారత్ ఆశ్రయం కల్పిస్తోంది’’ అని ఆ పుస్తకం రచయితలు దీప్ హల్దార్, జైదీప్ మజుందార్, షాహిదూల్ హసన్ ఖోకన్‌లు తెలిపారు. ఆ రోజు గనుక భారత్ నుంచి ఆ కాల్ రాకపోయి ఉంటే.. తన తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ మాదిరిగానే ఆమెకు హత్యకు గురయ్యేవారని వారు ఆందోళన వ్యక్తంచేశారు. బంగ్లా జాతిపితగా గుర్తింపు పొందిన షేక్ ముజిబుర్ రెహ్మాన్ దంపతులు, వారి ముగ్గురు కుమారులను 1975 ఆగస్టులో ఇంట్లోనే సైనికాధికారులు కాల్చిచంపారు. అప్పటికీ హసీనా, ఆమె సోదరి రెహానా విదేశాల్లో ఉండటం వల్ల ప్రాణాలతో బయటపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa