ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే అత్యంత సులువైన మార్గం విమానయానమే. సుదూర ప్రాంతాలను కూడా వేగంగా చేరుకునేందుకు ఈ విమానాలు ఎంతో ఉపయోగపడతాయి. టికెట్ ఖర్చులు ఎక్కువే అయినప్పటికీ.. వేగంగా, సురక్షితంగా చేరుకోవాలంటే ప్రయాణికులు విమానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. ప్రస్తుతం అత్యాధునిక విమానాలు, ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి వచ్చి.. విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం విమానయాన రంగంలో అనుభవిస్తున్న ఆధునిక సదుపాయాలు, సౌకర్యాలు.. మొదటిసారి విమానం ఆకాశంలోకి ఎగిరినపుడు కలలుగా ఉండేవి. 1909లో ప్రారంభమైన కాలేజ్ పార్క్ ఎయిర్‌పోర్ట్ నుంచి సిడ్నీ, పారిస్, ఆమ్స్‌టర్‌డామ్ వరకు ఉన్న ఈ 10 ఎయిర్‌పోర్టులు ఆకాశ ప్రయాణం ఎలా అభివృద్ధి చెందిందో చెబుతున్నాయి.
కాలేజ్ పార్క్ ఎయిర్‌పోర్ట్, అమెరికా – 1909
విల్బర్ రైట్ స్వయంగా సైనిక అధికారులకు శిక్షణ ఇచ్చిన ఈ ఎయిర్‌పోర్ట్ ప్రపంచంలోనే అతి పురాతనమైన ఎయిర్‌పోర్టు కావడం విశేషం. క్రేడిల్ ఆఫ్ ఏవియేషన్ అనే బిరుదు ఈ కాలేజ్ పార్క్ ఎయిర్‌పోర్టుకే దక్కింది. 1909లో ఈ కాలేజ్ పార్క్ విమానాశ్రయం ప్రారంభం అయింది.
హాంబర్గ్ ఎయిర్‌పోర్ట్, జర్మనీ – 1911
1911లో ప్రారంభమైన ఈ హాంబర్గ్ ఎయిర్‌పోర్టు యూరప్‌లోనే రెండో అతి పురాతనమైనది కావడం గమనార్హం. కాలానుగుణంగా ఆ ఎయిర్‌పోర్టును ఎప్పటికప్పుడు ఆధునికీకరించడంతో ఇప్పటికీ యూరప్‌లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటిగా నిలిచింది.
బుఖారెస్ట్ బేనేసా ఎయిర్‌పోర్ట్ , రొమేనియా – 1912
తూర్పు యూరప్‌లో మొట్టమొదటగా ప్రారంభమైన ఈ బుఖారెస్ట్ బేనేసా విమానాశ్రయం.. ఇప్పుడు ప్రధానంగా బిజినెస్, చార్టర్ విమానాలకు మాత్రమే సేవలు అందిస్తోంది. ఇది 1912లో ప్రారంభోత్సవం జరుపుకుంది.
బ్రెమెన్ ఎయిర్‌పోర్ట్, జర్మనీ – 1913
1913లో ఫిక్స్‌డ్ వింగ్ విమానాల కోసం రూపొందించిన జర్మనీలోని తొలి ఎయిర్‌పోర్ట్ ఇదే కావడం విశేషం. కేఎల్ఎం సంస్థ ఈ బ్రెమెన్ ఎయిర్‌పోర్టు నుంచి తన మొట్టమొదటి ఇంటర్నేషనల్ విమాన సర్వీసును ప్రారంభించింది.
రోమ్ చియాంపినో ఎయిర్‌పోర్ట్, ఇటలీ – 1916
ఇటలీలోని రొమ్‌లో 1916లో ప్రారంభమైన ఈ రోమ్ చియాంపినో ఎయిర్‌పోర్టు 1960 వరకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇప్పుడు ఇది తక్కువ ఖర్చు ఎయిర్‌లైన్స్‌కి కీలక హబ్‌గా మారిపోయింది.
ఆమ్‌స్టర్‌డామ్ స్కిప్‌హోల్, నెదర్లాండ్స్ – 1916
మొదట 1916లో ప్రారంభమైనపుడు సైనిక స్థావరంగా ఉన్న ఈ ఆమ్‌స్టర్‌డామ్ స్కిప్‌హోల్ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు యూరప్‌లో అత్యంత రద్దీగల హబ్‌లలో ఒకటిగా మారింది.
పారిస్ లె బోర్జెట్ ఎయిర్‌పోర్టు, ఫ్రాన్స్ – 1919
1919లో ఈ పారిస్ లె బోర్జెట్ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వచ్చింది. 1927లో చార్లెస్ లిండ్బర్గ్ తన చరిత్రాత్మక అట్లాంటిక్ ప్రయాణం ముగించిన స్థలం ఈ పారిస్ లె బోర్జెట్ ఎయిర్‌పోర్టులోనే కావడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన పారిస్ ఎయిర్ షో ఈ ఎయిర్‌పోర్టులోనే జరుగుతుంది.
సిడ్నీ ఎయిర్‌పోర్ట్, ఆస్ట్రేలియా – 1920
దక్షిణార్థగోళంలోని అతి పాత ఎయిర్‌పోర్ట్‌గా ఈ సిడ్నీ ఎయిర్‌పోర్టు ప్రసిద్ధి చెందింది. దీన్ని 1920లో ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. క్వాంటాస్, ఇతర ప్రధాన ఎయిర్‌లైన్స్‌కు కీలక హబ్‌గా ఇది నిలిచింది.
మిన్నియాపోలిస్/సెయింట్ పాల్ ఎయిర్‌పోర్ట్, అమెరికా – 1920
ఈ సెయింట్ పాల్ ఎయిర్‌పోర్టు 1920లో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ మిన్నియాపోలిస్ విమానాశ్రయం అమెరికాలో అత్యంత కీలక అంతర్గత హబ్‌లలో ఒకటిగా నిలుస్తోంది.
ఆల్బనీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అమెరికా – 1928
1928లో సేవలు అందించడం ప్రారంభించిన ఈ ఎయిర్‌పోర్టు అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర రాజధానిని ప్రపంచానికి కలిపింది. ఇప్పుడు సంవత్సరానికి దాదాపు 27 కోట్ల మంది ప్రయాణికులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa