పశ్చిమ బెంగాల్‌లో ఒక కొత్త, అనూహ్య పరిణామం చోటుచేసుకుంటోంది. రాష్ట్రంలోని ముస్లిం జంటలు, ప్రత్యేకించి బంగ్లాదేశ్, బీహార్ సరిహద్దు జిల్లాల్లో, తమ వివాహాలను ‘ప్రత్యేక వివాహ చట్టం-1954’ (ఎస్ఎంఏ) కింద నమోదు చేసుకునేందుకు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. సాధారణంగా మతాంతర వివాహాలు చేసుకునేవారు లేదా సివిల్ పద్ధతిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ చట్టాన్ని ఆశ్రయిస్తారు. అయితే, రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలనపై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనలే ఈ మార్పుకు కారణమని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు.ప్రభుత్వ గణాంకాల ప్రకారం, నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 మధ్య కాలంలో 1,130 ముస్లిం జంటలు ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 16 కింద తమ పెళ్లిళ్ల నమోదుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో సగానికి పైగా, అంటే 609 దరఖాస్తులు, కేవలం జులై నుంచి అక్టోబర్ 2025 మధ్యలోనే రావడం గమనార్హం. పొరుగున ఉన్న బిహార్‌లో కూడా ఇదే సమయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ జరగడం, ఇప్పుడు బెంగాల్‌లో ఈ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఈ ధోరణి పెరిగింది.సాధారణంగా బెంగాల్‌లో ముస్లిం వివాహాలు 'బెంగాల్ మహమ్మదీయ వివాహాలు, విడాకుల రిజిస్ట్రేషన్ చట్టం-1876' ప్రకారం ప్రభుత్వంతో నియమితులైన ఖాజీల ద్వారా జరుగుతాయి. ఈ సర్టిఫికెట్లు చట్టబద్ధమైనవే అయినప్పటికీ, వాటి ఫార్మాట్లలో తేడాలు, చిరునామా ధ్రువీకరణలో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలున్నాయి. దీంతో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వీటిని బలమైన గుర్తింపు రుజువుగా అంగీకరించడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది.దీనికి భిన్నంగా, ప్రత్యేక వివాహ చట్టం కింద జారీ చేసే సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా ఒకే ఫార్మాట్‌లో ఉండి, సర్వత్ర గుర్తింపు పొందింది. దీనిని మరింత అధికారికమైన, నమ్మకమైన పత్రంగా పరిగణిస్తారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా, అధికారులు 2002 నాటి జాబితాతో ప్రస్తుత వివరాలను సరిచూస్తున్నారు. వివరాలు సరిపోలకపోతే, అదనపు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, బీహార్‌లో జరిగిన ప్రక్రియ బెంగాల్ సరిహద్దు ప్రజల్లో ఆందోళనను పెంచిందని, అందుకే తమ రాష్ట్రంలో పరిశీలన ప్రారంభం కాకముందే, ముందుజాగ్రత్త చర్యగా బలమైన, ప్రామాణికమైన వివాహ ధ్రువపత్రాన్ని పొందేందుకు వారు ప్రయత్నిస్తున్నారని అధికారులు విశ్లేషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa