పైకి భూమి శాంతంగానే కనిపిస్తున్నా.. భూగర్భంలో మాత్రం అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటి కారణంగానే అప్పుడప్పుడూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. ఇలాంటి భూకంపాలను ముందుగా గుర్తించేందుకు భూగర్భ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూ ఉంటారు. సాధారణంగా భూమి కింద ఉండే టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపాలు సంభవిస్తుంటాయి. ఇక సముద్రం కింద ఇలాంటివి జరిగినపుడు.. సునామీలు ఏర్పడతాయి. భూమి ఏర్పడిన మొదట్లో ఈ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొనడం వల్లే.. పర్వతశ్రేణులు ఏర్పడ్డాయి. అయితే.. ప్రస్తుతం భారత టెక్టోనిక్ ప్లేట్లు చీలిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి కారణంగా భారత్.. భవిష్యత్‌లో భారీ భూకంపాలను ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
భూమి అంతర్గత నిర్మాణానికి సంబంధించి అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ (ఏజీయూ) 2023 సమావేశంలో శాస్త్రవేత్తలు సంచలన ఆవిష్కరణను ప్రకటించారు. భారత్ టెక్టోనిక్ ప్లేట్ టిబెట్ పీఠభూమి కింద లోతుగా చీలిపోతూ.. రెండు పొరలుగా విడిపోతోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను డీలామినేషన్ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. భారత, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ కారణంగానే.. హిమాలయాలు ఆవిర్భవించడం, టిబెట్ పీఠభూమి నిర్మాణం జరిగిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే.. తాజా భూకంప డేటా.. ఈ టెక్టోనిక్ ప్లేట్ల ఘర్షణ మరింత సంక్లిష్టంగా ఉందని రుజువు చేసింది.
టెక్టోనిక్ ప్లేట్ ఎలా చీలుతోంది?
తాజా అధ్యయనం కోసం శాస్త్రవేత్తలు 94 అబ్జర్వేషన్ స్టేషన్ల నుంచి P-వేవ్స్ (క్షితిజ సమాంతర), S-వేవ్స్ (నిలువు) డేటాను విశ్లేషించారు. దీని ద్వారా ఇండియన్ ప్లేట్ లోపలి నిర్మాణం 3డీ మోడల్‌ను రూపొందించారు. ఈ డేటా ప్రకారం.. భారత టెక్టోనిక్ ప్లేట్‌లోని దట్టమైన దిగువ పొర విడిపోయి.. భూమి మాంటిల్‌లోకి మునిగిపోయి కరిగిపోతోందని గుర్తించారు. అదే సమయంలో.. తేలికైన పైపొర మాత్రం యూరేషియన్ ప్లేట్‌ను ఢీకొంటూ ఉత్తరం వైపునకు కదులుతోందని తెలిపారు. ఖండాలు ఈ విధంగా ప్రవర్తిస్తాయని తమకు తెలియదని.. నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ యూనివర్సిటీ జియోడైనమిసిస్ట్ డౌవే వాన్ హిన్స్‌బెర్గెన్ వెల్లడించారు. ఎర్త్ సైన్స్‌కు ఇది చాలా ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు.
హిమాలయాలు ఎందుకు పెరుగుతున్నాయి?
భారత టెక్టోనిక్ ప్లేట్ చీలిక కారణంగా.. దిగువ ప్లేట్ మాంటిల్‌లోకి మునిగిపోతున్నప్పటికీ.. పై పొర మాత్రం ముందుకు కదులుతూ ఒత్తిడిని పెంచుతోందని గుర్తించారు. ఇలా నిరంతరం కదలడం వల్ల టిబెట్ కింద లోతైన పగుళ్లు, భూకంప ఒత్తిడి ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ఈ పగుళ్లను విశ్లేషించడం ద్వారా.. శాస్త్రవేత్తలు ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనేది తెలుసుకునే అవకాశం కలగనుంది. అదే సమయంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఎందుకు వేగంగా పెరుగుతున్నాయి అనే విషయాలను కూడా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.
భూకంప హెచ్చరికలు
ఈ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ దిగువ భాగం మరింత మునిగిపోయే కొద్దీ.. వాటి పగుళ్ల వెంట భారీ ఒత్తిడి ఏర్పడి.. భవిష్యత్తులో భారీ మొత్తంలో భూకంపాలకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ ఆవిష్కరణ కేవలం భూగర్భ శాస్త్ర సిద్ధాంతాలను మార్చడమే కాకుండా.. హిమాలయ ప్రాంతం ఎదుర్కొంటున్న భూకంప ప్రమాదాలను మరోసారి నొక్కి చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa