ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఢిల్లీ పేలుడు

national |  Suryaa Desk  | Published : Tue, Nov 11, 2025, 07:33 PM

సోమవారం సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు.. దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. ఈ ఘటన దేశం మొత్తాన్ని తీవ్రంగా కుదిపేసింది. అంతకుమించి.. బాధితుల కుటుంబాల్లో అంతులేని బాధను మిగిల్చింది. ఇక వారి ఆకస్మిక మరణం.. వారి కుటుంబ సభ్యులకు ఉన్న కొండంత అండను కూల్చేసింది. క్యాబ్ డ్రైవర్, చిరు వ్యాపారి, కండక్టర్ సహా రోజూ పనిచేసుకుంటే తప్ప పూట గడవని వారు ఈ ఘటనలో మృతి చెందారు. ఇక మరికొన్ని మృతదేహాలు అయితే.. ఎవరివో గుర్తించలేని విధంగా ఛిద్రం అయిపోయాయి. దీంతో తమవారి జాడ తెలియక కుటుంబ సభ్యులు


ఈ ఒక్క ఘటన అనేక కుటుంబాల జీవితాలను తలకిందులు చేసింది. కారు పేలుడులో మృతి చెందిన వారిలో క్యాబ్ డ్రైవర్ పంకజ్ సైనీ, కాస్మోటిక్ షాప్ కోసం సరుకులు కొనడానికి వచ్చిన నోమాన్.. కండక్టర్ అశోక్ కుమార్ వంటి సామాన్యులు ఉన్నారు. వీరంతా తమ కుటుంబాలకు ఏకైక జీవనాధారం కావడం మరింత విషాదంగా మారింది. ఇక లోక్ నాయక్ జయప్రకాష్ నారాయన్ ఆస్పత్రి బయట.. బాధితుల బంధువులు.. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతో కన్నీరుమున్నీరుగా రోదించారు. ఇక చనిపోయిన వారిలో కొందరి మృతదేహాలు గుర్తించడానికి కూడా వీలు లేకుండా దెబ్బతినడంతో మరింత క్షోభకు గురవుతున్నారు.


పంకజ్ సైనీ (బిహార్)


బిహార్‌కు చెందిన 22 ఏళ్ల పంకజ్ సైనీ.. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని కుటుంబానికి పంకజ్ సైనీ ఏకైక ఆధారం కాగా.. ఇప్పుడు అతడు లేకపోవడంతో ఆ కుటుంబం తీరని దుఃఖంలో మునిగిపోయింది. తన కుమారుడి మృతిపై పంకజ్ సైనీ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. "ఏం చెప్పాలి. చాంద్‌నీ చౌక్‌లో ప్రయాణికుడిని దించి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని.. తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కన్నీరు పెట్టుకున్నాడు.


అశోక్ కుమార్ (డీటీసీ కండక్టర్)


ఢిల్లీలోని అమోరా ప్రాంతానికి చెందిన అశోక్ కుమార్.. పగలు ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (డీటీసీ)లో కండక్టర్‌గా పనిచేస్తూనే.. కుటుంబాన్ని నెట్టుకురావడం కోసం రాత్రి పూట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇక అశోశ్ కుమార్‌కు భార్య, నలుగురు పిల్లలు సహా మొత్తం 8 మంది కుటుంబానికి అతడొక్కడే జీవనాధారం. ఈ పేలుడు జరిగిన సమయంలో తన బంధువు లోకేష్ కుమార్ గుప్తాను కలవడానికి అశోక్ కుమార్ ఆ ప్రాంతానికి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అశోక్ కుమార్ సైకిల్ కూడా కనిపించకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ఢిల్లీ పేలుళ్లు.. బాంబ్ బ్లాస్ట్ లైవ్ వీడియో వైరల్


నోమాన్ (కాస్మోటిక్ వ్యాపారి)


ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీకి చెందిన 22 ఏళ్ల నోమాన్.. తన కాస్మోటిక్ షాప్ కోసం సరుకులు కొనుగోలు చేయడానికి ఢిల్లీలోని హోల్‌సేల్ మార్కెట్ ఉన్న చాంద్‌నీ చౌక్‌కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే జరిగిన పేలుడు ధాటికి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కష్టపడి పనిచేసే కొడుకును కోల్పోయామని.. ఇలాంటి ఘటనలకు పాల్పడేందుకు ఉగ్రవాదులు మరోసారి సాహసం చేయకుండా కేంద్ర ప్రభుత్వం తగిన విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని.. నోమాన్ మామ ఫుర్కాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


గుర్తు తెలియని మృతదేహాలు.. ఆగని రోదనలు


ఢిల్లీలోని భగీరథ్ ప్యాలెస్‌ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మెడిసిన్ షాప్ ఓనర్ అమర్ కటారియా.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రావస్తి ప్రాంతానికి చెందిన.. ముగ్గురు పిల్లల తండ్రి దినేష్ కుమార్ మిశ్రా (ఇన్విటేషన్ కార్డుల షాప్‌లో పని చేసేవారు) కూడా ఈ పేలుడులో ప్రాణాలు కోల్పోయారు. తన భర్త మృతితో తాను అన్నీ కోల్పోయానని.. దినేష్ భార్య రీనా రోదించింది.


కారులో జరిగిన పేలుడు తీవ్రతతో.. మరణించిన వారిలో చాలా మంది మృత దేహాలు ఇప్పటికీ గుర్తించడానికి వీలు లేకుండా పోయాయి. దీంతో తమ వారి జాడ కోసం లోక్ నాయక్ ఆస్పత్రి వెలుపల మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఒక్క పేలుడుతో తమ జీవితాలు ఎలా నాశనమయ్యాయో అర్థం చేసుకోలేక వారి రోదనలు మిన్నంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa