హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీ పేరు గత మూడు రోజులుగా వార్తల్లో మార్మోగిపోతోంది. ఢిల్లీ పేలుడు ఘటనలో అనుమానితులు ఆ విద్యా సంస్థలో పనిచేస్తున్న వైద్యులేనని తెలిసిందే. దీంతో యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలపై తాజాగా యూనివర్సిటీ స్పందిస్తూ.. దురదృష్టకరమైన పరిణామాలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. వాటిని ఖండించింది. ఆ వైద్యులతో తమకు వృత్తిపరమైన సంబంధం మాత్రమే ఉందని పేర్కొంది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ భుపిందర్ కౌర్ ఆనంద్ ఓ ప్రకటన విడుదల చేశారు. 1997 నుంచి పలు విద్యా సంస్థలను నిర్వహిస్తున్నామని, యూజీసీ తమను గుర్తించిందని తెలిపింది. ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మందికిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.
‘‘మా విశ్వవిద్యాలయంలో పలు విద్య, వృత్తిపరమైన కోర్సులను నిర్వహిస్తున్నాం.. 2019 నుంచి ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తున్నాం.. మా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా, విదేశాల్లోని పలు ప్రముఖ హాస్పిటల్స్, సంస్థల్లో బాధ్యతాయుతమైన, విశిష్టమైన పదవుల్లో పనిచేస్తున్నారు.. జరిగిన ఈ దురదృష్టకర సంఘటనలపై మేము తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం.. వాటిని ఖండిస్తున్నాం.. ఈ బాధాకర ఘటనలతో ప్రభావితమైన అమాయకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
‘‘మా యూనివర్సిటీలో పనిచేసే ఇద్దరు డాక్టర్లను దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నట్టు మాకు తెలిసింది. వారు తమ అధికారిక హోదాలో పనిచేయడం తప్ప, విశ్వవిద్యాలయానికి వారితో ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేస్తున్నాం’’ అని ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడమే లక్ష్యంగా వస్తున్న నిరాధారమైన నివేదికలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది. తమ సంస్థ గురించి ఆన్లైన్, సోషల్ మీడియాలో నిరాధారమైన, తప్పుదోవ పట్టించే కథనాలు, నివేదికలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని వివరించింది. మా వర్సిటీ ప్రాంగణంలో ఎటువంటి కెమికల్స్ లేదా పేలుడు సామాగ్రి నిల్వ చేయలేదని స్పష్టం చేసింది.
‘యూనివర్సిటీ ల్యాబ్‌లను పూర్తిగా, ప్రత్యేకంగా ఎంబీబీఎస్ విద్యార్థుల విద్యా, శిక్షణ అవసరాల కోసం, ఇతర అధీకృత కోర్సులకే వినియోగిస్తాం... ప్రతి ల్యాబ్‌లోనూ నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా నిబంధనలు, చట్టబద్ధ ప్రమాణాలు, నైతిక ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ నిర్వహిస్తున్నాం’” అని విశ్వవిద్యాలయం పేర్కొంది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేసే ఇద్దరు వైద్యులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పేలుడు అనుమానితుడు డాక్టర్ ఉమర్ మొహమ్మద్ కూడా ఇదే వర్సిటీలో పనిచేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa