ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదేళ్లుగా కోమాలో యువతి.... తర్వాత మిరాకిల్

international |  Suryaa Desk  | Published : Wed, Nov 12, 2025, 09:31 PM

తీవ్ర అనారోగ్యం గురై కోమాలోకి వెళ్లిపోయిన యువతి.. తల్లి చేసిన అద్భుతంతో పదేళ్ల తర్వాత బయటపడింది. ఇక తమవల్ల కాదని వైద్యులు చేతులెత్తేస్తే.. ఆ తల్లి మాత్రం తన బిడ్డను వదిలేయలేదు. ఒకటా రెండా ఏకంగా పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఆమెను తిరిగి సాధారణ మనిషిని చేసింది. ప్రతిరోజూ డ్యాన్స్‌కి తీసుకెళ్లి అద్భుతాలు సృష్టించింది. తన కుమార్తెకు తిరిగి జీవం పోయాలనే ఆ తల్లి సంకల్పం ముందు విధి తలవంచింది. కోమాలో నుంచి బయటపడిన ఆ యువతి ఇప్పుడు తన పనులు తానే చేసుకోగలుగుతోంది. తల్లి పట్టుదలతో కుమార్తె పదేళ్ల తర్వాత కోమాలో నుంచి బయటపడిన ఈ అద్భుత సంఘటన చైనాలో చోటుచేసుకుంది.


  వివరాల్లోకి వెళ్తే... హునన్ ప్రావిన్సులకు చెందిన మహిళ షియోవో షుఫై (59)కు యాంగ్ ఫెంగ్ అనే కుమార్తె ఉంది. పదేళ్ల కిందట గ్వాండాంగ్ ప్రావిన్సుల్లో గ్వాంగ్జూలో పనిచేస్తున్న సమయంలో యాంగ్ తీవ్ర అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయింది. ఆసుపత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స అనంతరం వైద్యులు చేతులెత్తేశారు. ఆమెకు కోలుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, చికిత్స అవసరం లేదని చెప్పారు. దీంతో కుమార్తెను ఇంటికి తీసుకొచ్చిన షియోవో పూర్తిస్థాయి సంరక్షకురాలిగా మారిపోయారు. కొద్ది నెలల తర్వాత ఆమె శరీరంలో కొన్ని కదలికలు వచ్చాయి. కానీ, యాంగ్ స్పృహలోకి రాకుండా కోమాలోనే కొనసాగింది.


ఈ క్రమంలో ఆమె మళ్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా.. చచ్చుబడిపోయిన నాడులను ఉత్తేజపరచడానికి సంగీతం, నృత్యంతో పాటు ప్రయాణాలు కూడా సహాయపడొచ్చిన వైద్యులు సూచించారు. దీంతో ప్రతిరోజు ఉదయం, షియావో తన కూమార్తెను వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి సమీపంలోని పార్క్‌కి తీసుకెళ్లేది. స్క్వేర్ డ్యాన్స్ మ్యూజిక్‌కు తాళం వేస్తూ.. తన కుమార్తెను చెయ్యి పట్టుకొని ఆడేది.


చైనాలో నడివయసు మహిళలలో చాలామంది పార్కుల్లో డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు. తక్కువ ఖర్చుతో కూడిన ఈ సామాజిక కార్యక్రమం మనిషి ఉత్తేజ పరచడమే కాకుండా ఒంటరితనాన్ని దూరం చేయడానికి దోహదపడుతుందని నమ్ముతారు. ‘స్క్వేర్ డ్యాన్స్ ఆంటీలు’గా పిలవబడే ఈ మహిళలు సంగీతం కోసం రేడియోలు తెచ్చుకుంటారు. తరచుగా ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. అయితే కొన్నిసార్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వీరిపై ఫిర్యాదులు కూడా చేస్తుంటారు.


షియావో కథ గురించి తెలిసి ఆమెకు సహాయం చేయడానికి డ్యాన్స్ ఆంటీలు ముందుకొచ్చారు. యాంగ్‌కు వ్యాయామాలలో సహకరిస్తూ.. షియావోకు కొత్త స్టెప్‌లు కూడా నేర్పించారు. ఇలా రెండో ఏడాదిలో యాంగ్ మాట్లాడింది. ‘నువ్వు చాలా గొప్ వ్యక్తివి’ అంటూ తనను ఉద్దేశించి కుమార్తె నోటి వెంట తొలి మాట రావడంతో షియావో భావోద్వేగానికి గురయ్యారు. వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లగా.. యాంగ్‌ను పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమె మెదడు మళ్లీ చురుకుగా మారినట్టు గ్రహించారు. ఇది ఓ అద్భుతమని పేర్కొన్నారు.


గత పదేళ్లుగా షియావో రోజూ తన కూతురితో కలిసి స్క్వేర్ డ్యాన్స్ ప్రాక్టీస్‌ కొనసాగించడం వల్ల యాంగ్‌ నడవడం, మాట్లాడడం వంటి సామర్థ్యాలను తిరిగి పొందింది. ప్రస్తుతం యాంగ్ తన పనులు తాను చేసుకోగలుగుతోంది. కానీ, ఆమెకు పూర్తిగా జ్ఞ‌ాపకశక్తి రాలేదు. కేవలం తన తల్లిదండ్రులను మాత్రమే గుర్తించగలుగుతోంది.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షియావో మాట్లాడుతూ.. ప్రస్తుతం 150 మంది సభ్యులతో కూడిన ఒక స్క్వేర్ డ్యాన్స్ బృందాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపింది. ‘‘నేను, నా కుమార్తె ఇద్దరం కూడా స్క్వేర్ డ్యాన్స్‌ ప్రేమికులం. ఇప్పటికీ రోజూ చేస్తూనే ఉన్నాం.. నా కూతురు సంతోషంగా ఉన్నంత వరకూ నేను పడ్డ కష్టాలు, శ్రమ విలువైనవే’’ అని షియావో అన్నారు. ఇక, దశాబ్దం పాటు ఆమె చూపిన పట్టుదల ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని, తల్లిప్రేమ అద్భుతాలను సృష్టిస్తుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. డ్యాన్స్, సంగీతం మాటల్లో చెప్పలేని ఆరోగ్యానికి శక్తిని అందిస్తాయని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa