లోక్‌సభ, అసెంబ్లీల ఐదేళ్ల పదవీకాలాన్ని మార్చడానికి పార్లమెంట్‌కు రాజ్యాంగబద్ధంగా అధికారం ఉందని జమిలీ ఎన్నికల బిల్లుపై అధ్యయనానికి వేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ( JPC )కి లా కమిషన్ తెలిపింది. డిసెంబర్ 4న జరిగే జేపీసీ సమావేశానికి ముందు లా కమిషన్ ఈ మేరకు తన నివేదికను సమర్పించింది. దేశ ప్రయోజనాల కోసం ఈ పదవీకాలాన్ని మార్చవచ్చని, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 83, 172లలో పేర్కొన్న కాలపరిమితి శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఈ ఆర్టికల్స్ ప్రకారం లోక్‌సభ లేదా రాష్ట్రాల శాసనసభల పదవీకాలాన్ని సాధారణ చట్టాల ద్వారా తగ్గించలేం కానీ ప్రజా సంక్షేమం కోసం రాజ్యాంగ సవరణ ద్వారా మార్చగలమని కమిషన్ అభిప్రాయపడింది.
‘‘రాజ్యాంగ సవరణ ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్ అలా చేయగలదని లా కమిషన్ స్పష్టంగా అభిప్రాయపడింది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న బిల్లు కూడా ఇదే ప్రతిపాదిస్తోంది’’ అని కమిషన్ పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో శాసనసభలను రద్దు చేయడం, పదవీకాలాన్ని పొడిగించడం వంటి నిబంధనలు రాజ్యాంగంలోనే ఉన్నాయని, ఇది ఐదేళ్ల పదవీకాలం స్థిరమైంది కాదని సూచిస్తుందని లా కమిషన్ తెలిపింది. ‘‘రాజ్యాంగం స్వయంగా అసెంబ్లీల పదవీకాలంలో మార్పులకు అవకాశం కల్పిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ముందుగానే రద్దు చేయడం, పొడిగించడం వంటివి దీనికి ఉదాహరణలు. దీనిని బట్టి ఐదేళ్ల పదవీకాలం మార్పులేనిది కాదని తెలుస్తుంది’’ అని కమిషన్ వివరించింది. అయితే, జమిలీ ఎన్నికల బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే.
జమిలీ ఎన్నికల వల్ల దేశానికి మేలు జరుగుతుందని, దీనికోసం ప్రస్తుత పదవీకాలాన్ని మార్చడం లేదా తగ్గించడం వంటివి దేశ ప్రయోజనాలకు ఉపయోగపడతాయని లా కమిషన్ పేర్కొంది. "ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని తగ్గించి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ జవాబుదారీతనంతో వృధాను అరికట్టి ఎక్కువ జాతీయ ప్రయోజనాలను సాధించవచ్చు’అని కమిషన్ తన నివేదికలో తెలిపింది. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ ప్రతిపాదన ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచదని, వాస్తవానికి దానిని బలపరుస్తుందని లా కమిషన్ వాదించింది.
‘‘ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడానికి బదులు ఈ ప్రతిపాదిత బిల్లు స్థిరత్వాన్ని నిర్ధారించడం, ఎన్నికల వల్ల నిరంతరాయంగా జరిగే ఖర్చును తగ్గించడం, ప్రభుత్వాలు పాలనపై దృష్టి పెట్టడానికి వీలు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది’’ అని కమిషన్ పేర్కొంది. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను ఈ ప్రతిపాదన ఏమాత్రం హరించదని, కేవలం ఎన్నికల సమయాన్ని సమన్వయం చేయడమే దీని లక్ష్యమని లా కమిషన్ స్పష్టం చేసింది. ‘పౌరుల ప్రజాస్వామ్య ఎంపిక చేసుకునే హక్కు పూర్తిగా అలాగే ఉంటుంది. కాబట్టి, ఈ ప్రతిపాదిత బిల్లు రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించదు’’ అని కమిషన్ తెలిపింది.
కొన్ని సవరణలకు సగం రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ స్పష్టం చేసింది. ‘ప్రతిపాదిత సవరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 (2)లోని నిబంధనకు లోబడి లేదు, కాబట్టి రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు’ అని కమిషన్ అభిప్రాయపడింది. అంతేకాదు, ఎన్నికల కమిషన్‌కు అపరిమిత అధికారాలు అప్పగిస్తున్నారనే ఆందోళనలను కూడా కమిషన్ తోసిపుచ్చింది.
జమిలీ ఎన్నికల వల్ల పునరావృత ఖర్చు, పాలనలో అంతరాయాలు తగ్గుతాయని లా కమిషన్ తెలిపింది. రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంపై అభ్యంతరాలకు ఆధారాలు లేవని లా కమిషన్ పేర్కొంది. ‘స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికలు ప్రాథమిక నిర్మాణంలో భాగమే అయినప్పటికీ, మధ్యంతర ఎన్నికల నిర్వచనం ప్రజల పూర్తి అధికారాలను పరిమితం చేస్తుందనే వాదన, ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతానికి విరుద్ధమని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు’" అని న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తూ కమిషన్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa