మావోయిస్టు ఉద్యమం పతనానికి అద్దం పట్టేలా సంచలన పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ 2026 జనవరి 1న మూకుమ్మడిగా ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలుస్తామని అధికారికంగా ప్రకటించింది. ఇది త్రిరాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమం దాదాపుగా కుప్పకూలిపోయిందనడానికి స్పష్టమైన సంకేతంగా నిలుస్తోంది.ఈ మేరకు ఎంఎంసీ జోన్ అధికార ప్రతినిధి 'అనంత్' పేరుతో ఒక పత్రికా ప్రకటనతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులకు వేర్వేరుగా లేఖలు విడుదలయ్యాయి. తాము లొంగిపోవడం లేదని, "పునరావాస మార్గాన్ని" ఎంచుకుంటున్నామని ఆ లేఖలో స్పష్టం చేశారు. తమపై యాంటీ-నక్సల్ ఆపరేషన్లను తక్షణమే నిలిపివేయాలని, సాధ్యమైనంత ఉత్తమ పునరావాస ప్యాకేజీని ప్రకటించి, తమకు సురక్షిత మార్గాన్ని కల్పించాలని మూడు రాష్ట్ర ప్రభుత్వాలను వారు కోరారు. ఏ ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్యాకేజీ, గౌరవం ఇస్తుందో ఆ ప్రభుత్వంతోనే కలిసి నడుస్తామని అనంత్ తేల్చిచెప్పారు.ఈ ఏడాది జరగాల్సిన వార్షిక పీఎల్‌జీఏ వారోత్సవాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. కేడర్ ఎవరూ వ్యక్తిగతంగా లొంగిపోవద్దని, అందరూ సామూహికంగా జనవరి 1 వరకు ఆగాలని విజ్ఞప్తి చేశారు. సాయుధ పోరాటానికి ఇది సరైన సమయం కానందుకే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటున్నామని, ఇది సిద్ధాంతాన్ని మోసం చేయడం కాదని అనంత్ వివరించారు.వివిధ ప్రాంతాల్లో ఉన్న కేడర్‌తో సమన్వయం కోసం ఒక ఓపెన్ బాఫెంగ్ రేడియో ఫ్రీక్వెన్సీ నంబర్‌ను కూడా విడుదల చేశారు. డిసెంబర్ 2025 నెల మొత్తం, జనవరి 1న ఉదయం 11 గంటల నుంచి 11.15 గంటల మధ్య ప్రతి ఒక్కరూ ఈ ఫ్రీక్వెన్సీ ద్వారా సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. "మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కామ్రేడ్స్ అందరూ ధైర్యం కోల్పోవద్దు. మనం అందరం కలిసి జనవరి 1న పునరావాస మార్గంలో నడుద్దాం" అని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.ఈ లేఖలు అందిన విషయాన్ని మూడు రాష్ట్రాల ఉన్నత భద్రతాధికారులు ధృవీకరించారు. భద్రతా బలగాల నిరంతర ఆపరేషన్లు, 2025లో పెద్ద ఎత్తున లొంగుబాట్లతో మావోయిస్టుల నైతిక స్థైర్యం దెబ్బతిన్నదనడానికి ఈ ప్రకటన బలమైన నిదర్శనమని అధికారులు తెలిపారు. ఈ లేఖపై ప్రభుత్వాలు అధ్యయనం చేస్తున్నాయని, త్వరలోనే సమన్వయంతో కూడిన స్పందన వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇటీవల పలువురు సీనియర్ నేతలు లొంగిపోవడం లేదా ఎన్‌కౌంటర్లలో మరణించడంతో ఎంఎంసీ జోన్ తీవ్రంగా బలహీనపడిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa