వెటర్నరీ నిపుణులు ఒక్కమాటలో చెబుతున్నారు – కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పెరటి కోళ్ల పెంపకంతోనే నాటుకోళ్ల కంటే ఎక్కువ లాభం సాధ్యమని. రోగనిరోధక శక్తి బలంగా ఉండటం, సహజంగా తక్కువ ఖర్చు, మార్కెట్‌లో అధిక ధర లభించడం – ఇవన్నీ పెరటి కోళ్లను గ్రామీణ, పట్టణ రైతులకు ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. మాంసం, గుడ్లు రెండూ ఒకేసారి అందించే ఈ రకాలు రైతుకు డబుల్ ఆదాయ మార్గాన్ని తెరుస్తున్నాయి.
పెరటి కోళ్లలో వనరాజ, గ్రామప్రియ, గ్రామలక్ష్మి, వనశ్రీ, రాజశ్రీ, గాగస్, కడక్‌నాథ్, ఆసిల్ వంటి రకాలు ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా వనశ్రీ, రాజశ్రీ రకాలు కేవలం 6 నెలల వయసులోనే 2.5 నుంచి 3 కిలోల వరకు బరువు తీసుకుంటాయి. ఈ వేగవంతమైన ఎదుగుదల వల్ల మాంసం కోసం పెంచే రైతులకు త్వరగా మార్కెట్‌కు తీసుకెళ్లే అవకాశం కలుగుతోంది. అదే సమయంలో ఈ రకాలు రోగాలకు తక్కువగా గురికావడంతో మందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.
గుడ్ల ఉత్పత్తి విషయంలోనూ పెరటి కోళ్లు నాటుకోళ్లను దాటేస్తున్నాయి. సగటున ఒక్కో కోడి సంవత్సరానికి 150 నుంచి 180 గుడ్లు పెడుతుంది. ఈ గుడ్లకు మార్కెట్‌లో సాధారణ కోళ్ల గుడ్ల కంటే రెట్టింపు ధర లభిస్తుంది. అంటే మాంసం అమ్మకాలతోపాటు గుడ్ల అమ్మకం నుంచి కూడా స్థిరమైన ఆదాయం వస్తుంది. రెండు మార్గాల్లోనూ లాభం చేతికి అందడం ఈ వ్యవసాయాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తోంది.
కాబట్టి చిన్న పెట్టుబడితో, తక్కువ స్థలంలోనే మొదలుపెట్టదగిన ఈ పెరటి కోళ్ల పెంపకం గ్రామీణ యువతకు, మహిళా స్వయం సహాయక బృందాలకు ఆదర్శవంతమైన అవకాశం. సరైన శిక్షణ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నెలకు రూ.15,000 నుంచి రూ.30,000 వరకు అదనపు ఆదాయం సులువుగా సాధ్యమవుతుందని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa