ట్రెండింగ్
Epaper    English    தமிழ்

4 వేలమంది కార్మికులు, రూ.1800 కోట్ల ఖర్చు, 5 ఏళ్ల సమయం

national |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 07:27 PM

హిందువుల 500 ఏళ్ల కలను నెరవేర్చుతూ.. అయోధ్యలో దివ్య భవ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇనుము, ఉక్కు వాడకుండా 5వ శతాబ్దపు నాగరా శైలిలో నిర్మించిన 3 అంతస్తుల రామమందిరం నిర్మాణం పూర్తి చేసుకుంది. 2024 జనవరి 22వ తేదీనే ప్రారంభోత్సవం చేసుకున్నప్పటికీ.. పూర్తి స్థాయి నిర్మాణం మాత్రం ఇటీవలె జరిగింది. దీనికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశారు.


ఇక ఈ అయోధ్య బాల రామాలయ నిర్మాణాన్ని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేపట్టింది. 4 వేల మందికిపైగా కార్మికులు.. 5 ఏళ్ల పాటు శ్రమించి నిర్మించారు. ఇక రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ భవ్య రామ మందిరం.. 1000 ఏళ్ల వరకు ఎలాంటి ప్రకృతి వైఫరీత్యాలు ఎదురైనా తట్టుకుని నిలబడేలా నిర్మించారు. ఇక ఆలయ నిర్మాణం ప్రారంభించినపుడు విరాళాలను సేకరించగా.. ఏకంగా రూ.3 వేల కోట్లు సమకూరాయి.


ఈ అయోధ్య రామమందిర నిర్మాణంలో సీబీఆర్ఐ రూర్కీ, ఐఐటీ మద్రాస్ వంటి ప్రముఖ భారతీయ సంస్థల ఇంజనీర్లు టెక్నాలజీ సహకారం అందించారు. ఢిల్లీ, ముంబై, గౌహతి, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ నుంచి ఇంజనీర్లు, నిపుణులు సాంకేతిక సహకారాన్ని ఇచ్చారు. ఈ ఆలయ నిర్మాణంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన బన్సీ పహార్‌పూర్ ఇసుకరాయిని ఉపయోగించారు. ఈ రాయి చెక్కడానికి సులభంగా ఉండటంతో పాటు.. ఎక్కువ మన్నికను కలిగి ఉంటుంది.


గ్రౌండ్ ఫ్లోర్‌లోని గర్భగుడిలో బాల రాముడి విగ్రహం (రామ్ లల్లా) ప్రతిష్ఠించారు. సరయూ నది నీటి జాడలు ఉన్న భూమిలో పునాది సవాళ్లను అధిగమించడానికి.. ఆలయానికి 14 మీటర్ల లోతులో కాంక్రీట్ నింపి, దానిపై గ్రానైట్ ప్లింత్‌ను ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తి కాగా.. మిగిలిన 70 ఎకరాల ప్రాంగణంలో ఔటర్ బౌండరీ వాల్ (పార్క్ కోట), ఆడిటోరియం, పక్షులు, జంతువుల కోసం 'పంచవటి' ల్యాండ్‌స్కేపింగ్ పనులు 2026 చివరి నాటికి పూర్తి కానున్నాయని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.


ఈ అయోధ్య ఆలయం నిర్మాణ కృషి, నిర్మాణ శైలి వంటి కీలక అంశాలను.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా వివరాలు వెల్లడించారు. కాలక్రమేణా తుప్పు పట్టే స్వభావం ఉన్న లోహాల వినియోగాన్ని పూర్తిగా నివారించి.. ఆలయ జీవితకాలాన్ని పెంచడానికి ఈ నిర్మాణం పూర్తిగా లోహం లేకుండా రూపొందించారు.


అయోధ్యలో మరో అద్భుత దృశ్యం.. జెండా ఎగరేసిన ప్రధాని మోదీ


పక్షులు, కోతులు ఆలయం లోపలికి ప్రవేశించకుండా ఉండేందుకు..ఏర్పాటు చేసిన జాలీలను ప్రభుత్వ రంగ సంస్థ అయిన మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) నుంచి సేకరించిన 12.5 టన్నుల టైటానియంతో తయారు చేశారు. ఆలయం 5వ శతాబ్దపు నాగరా శైలి నిర్మాణంలో ఉంది. మూడు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఆలయం 161 అడుగుల ఎత్తు.. 235 అడుగుల వెడల్పు.. 360 అడుగుల పొడవుతో నిర్మించారు. గర్భగుడితో పాటు.. ఆలయ ప్రధాన సముదాయంలో వివిధ సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాల కోసం 5 మండపాలు ఏర్పాటు చేశారు. ఇవి నృత్య, రంగ్, గుఢ్, కీర్తన్, ప్రార్థన మండపాలు.


ఆలయ అంతర్భాగం


ఆలయ గ్రౌండ్ ఫ్లోర్‌లో దేవతలు, దేవతల చెక్కడాలతో సుమారు 160 స్తంభాలు ఉంటాయి. ఇక్కడే గర్భగుడిలో మైసూర్ నల్ల గ్రానైట్‌తో చెక్కబడిన బాల రూపంలో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని 47 తలుపుల్లో 14 బంగారు పూత పూసినవి ఉన్నాయి. ఈ అంతస్తులో రామ్ దర్బార్ ఉంటుంది. ఇక్కడ రాజు రూపంలో రాముడు ఉంటాడు. సీత, లక్ష్మణుడు, హనుమంతుడి విగ్రహాలను రాజస్థాన్ నుంచి తెచ్చిన తెల్ల మక్రానా పాలరాతితో చెక్కారు. ఈ అంతస్తులో మొత్తం 132 స్తంభాలు ఉన్నాయి.


పునాది నిర్మాణంలో సవాళ్లు


ఆలయం నిర్మించే ప్రాంతం సరయూ నది నీటి జాడలు ఉన్న భూమిలో ఉంది. అందుకే ఈ భారీ నిర్మాణాన్ని నిర్మించడం ఇంజనీర్లకు పెద్ద సవాలుగా మారింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ లోతును పెంచారు. ఆలయ పునాదిని 14 మీటర్ల లోతుకు తీశారు. అందులో 1.32 లక్షల క్యూబిక్ మీటర్ల రోలర్-కాంపాక్టెడ్ కాంక్రీట్‌తో నింపారు. దానిపైన స్థిరత్వం కోసం 1.5 మీటర్ల ఎత్తు గల అధిక-బలం కలిగిన రాఫ్ట్‌ను నిర్మించారు. దీనిపై తేమ, వరదల నుంచి ప్రధాన నిర్మాణాన్ని రక్షించడానికి.. సుమారు 24 వేల గ్రానైట్ రాళ్లతో తయారు చేయబడిన 6.5 మీటర్ల ఎత్తైన ప్లింత్ నిర్మించారు.


ఆలయ ప్రాంగణం, మిగిలిన పనులు


మొత్తం రామాలయ ప్రాంగణం 70 ఎకరాలు ఉంది. అందులో 20 ఎకరాల్లో ప్రధాన ఆలయం నిర్మాణం చేశారు. మరో 50 ఎకరాలు ఖాళీగా ఉండగా.. 30 ఎకరాలు గ్రీన్ బెల్ట్‌కు కేటాయించారు. ప్రధాన ఆలయ సముదాయం వెలుపల దాదాపు 750 మీటర్ల పొడవు.. 14 అడుగుల మందంతో రెండు అంతస్తుల బయటి గోడ ఉంది. కింది అంతస్తులో సూర్యుడు, శివుడు, భగవతి, గణేశుడు, హనుమాన్, మాతా అన్నపూర్ణ ఆలయాలు ఉంటాయి. పై అంతస్తు పెద్ద సంఖ్యలో భక్తులను ఉంచే ప్రదక్షిణ మార్గంగా ఏర్పాటు చేశారు.


మహర్షి వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, వాల్మీకి, అగస్త్యుడు, నిషాద్ రాజ్, అహల్య, మాతా శబరి అనే ఏడుగురు ఋషులకు అంకితం చేయబడిన సప్త మందిరాన్ని కూడా నిర్మించారు. ప్రస్తుతం ప్రధాన ఆలయ నిర్మాణం పూర్తయింది. మిగిలిన పనుల్లో భాగంగా 4 కిలోమీటర్ల పొడవైన బయటి కాంక్రీట్ గోడ, ఆడిటోరియం నిర్మాణం వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. కోతులు, పక్షులు, ఉడుతలు మొదలైన వాటి కోసం పంచవటి అనే అటవీ ప్రాంత అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పనిని జీఎంఆర్ గ్రూప్ సామాజిక బాధ్యతగా ఉచితంగా చేపట్టడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa