ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘సర్’ ఒత్తిడితో మరో బీఎల్‌ఓ ఉరేసుకుని ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తోన్న సూసైడ్ నోట్

national |  Suryaa Desk  | Published : Mon, Dec 01, 2025, 08:43 PM

కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష (SIR) ప్రక్రియపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో పని ఒత్తిడి కారణంగా పలువురు బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLO) మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, మరో బీఎల్ఓ ఆత్మహత్య చేసుకోగా.. మరొకరు గుండెపోటుతో మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్ బీఎల్ఓ సర్వేష్ సింగ్ సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడగా.. బిజినోర్‌కు చెందిన శోభా రాణి పని ఒత్తిడి, వ్యాకులతతో అనారోగ్యానికి గురై గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఎస్ఐఆర్ పనిభారమే తమవారి మరణాలకు కారణమని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే, అధికారులు మాత్రం వారి మరణాలకు ఎస్ఐఆర్ పని ఒత్తిడి కారణం కాదని కొట్టేయడం గమనార్హం. పలువురు బీఎల్ఓ‌లు తమ ఉద్యోగాలకు సైతం రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.


 సర్వేష్ సింగ్ భగత్‌పూర్ తండా జహీద్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్. తనకు బతకాలని ఉంది కానీ, తాను ఏం చేయలేని నిస్సహాయతలో ఉన్నానంటూ తన సూసైడ్ నోట్‌లో సింగ్ వాపోయారు. ఆయన రాసిన సూసైడ్ నోట్‌లో ‘‘రాత్రులు గడవవు.. పగలు మనశ్వాంతి ఉండదు.. నాకు బతకాలని ఉంది.. కానీ ఏం చేయగలను? ఈ అశాంతితో ఊపిరాడని ఈ పరిస్థితుల్లో నాలో నేను భయపడుతున్నాను’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. భార్య బాబ్లీ మాట్లాడుతూ.. ‘ఆయనకు డిజిటల్ ప్రక్రియ, ఫారమ్ అప్‌లోడ్‌లు, రోజువారీ లక్ష్యాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.. దీనివల్ల క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారేమోనని భయపడేవారు’ తెలిపారు.


నిరంతరం అప్‌డేట్‌లు కోరుతూ, పని పూర్తి కాకపోతే పరిణామాల గురించి అధికారుల నుంచి నిరంతరం హెచ్చరికలు వచ్చేవని ఆమె చెప్పారు. దీంతో పాటు తమ ఇద్దరు కుమార్తెల అనారోగ్యం, కుటుంబమంతా ఆయన ఒక్కరి సంపాదనపైనే ఆధారపడటం వంటి కారణాలు మానసిక భారాన్ని పెంచాయని బాబ్లీ కన్నీటి పర్యంతమయ్యారు.


ఇక, బిజ్‌నూర్‌లోని ధంపూర్ 97వ బూత్‌ లెవెల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న 56 ఏళ్ల శోభా రాణి శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆమె కుమారుడు దీపక్ సైని మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో భాగంగా 1,003 ఫారాలను కేటాయించగా 345 మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, టార్గెట్ పూర్తి చేయడానికి ఆలస్యంగా నిద్రపోయేవారని చెప్పాడు. మధుమేహం ఉందని, కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగోలేదని, అయినప్పటికీ ఎస్ఐఆర్ ప్రారంభమైన తర్వాత పనిభారం విపరీతంగా పెరిగినా విధుల్లో కొనసాగిందని తెలిపారు.


మరోవైపు, ఫతేపూర్‌కు చెందిన బీఎల్ఓ 27 ఏళ్ల లేఖపాల్ సుధీర్ కుమార్ కురిల్.. తన పెళ్లికి ముందు రోజు నవంబర్ 25న ఆత్మహత్య చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. టార్గెట్ పూర్తి చేయకుంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని అధికారులు బెదిరించారని ఆయన సోదరి ఆరోపించారు. అదే రోజు గోండాలోని జైత్‌పూర్ మఝాలో అసిస్టెంట్ టీచర్ విపిన్ యాదవ్ ఇంట్లో విషం తాగి మరణించారు. అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆయన భార్య రికార్డ్ చేసిన వీడియో వైరల్ అయింది.


దీంతో పాటు బరేలీలో అసిస్టెంట్ టీచర్ సర్వేష్ కుమార్ గంగ్వార్ (47) నవంబర్ 26న, లక్నోలో శిక్షా మిత్ర విజయ్ కుమార్ వర్మ (40) నవంబర్ 22న, దేవరియాలో శిక్షా మిత్ర రంజు దుబే (44) నవంబర్ 25న SIR డ్యూటీలోఉన్నప్పుడు గుండెపోటు, మెదడు రక్తస్రావం వంటి అనారోగ్య కారణాలతో మరణించారు. ఈ మరణాలపై ఉత్తరప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ ఎటువంటి స్పందన రాలేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa