ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 02, 2025, 06:10 AM

 ప్రజా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 18 నెలల్లో కేవలం సామాజిక భద్రతా పింఛన్ల కోసమే రూ.50,000 కోట్లకు పైగా ఖర్చు చేయడమే ఇందుకు నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో నిర్వహించిన 'పేదల సేవ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి, వారితో ముఖాముఖి మాట్లాడారు.కార్యక్రమంలో భాగంగా ఉంగుటూరులో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నాగలక్ష్మి అనే మహిళ ఇంటికి సీఎం స్వయంగా వెళ్లారు. ఆమెకు నెలవారీ పింఛన్‌ను అందజేసి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె పిల్లలతో కాసేపు ముచ్చటించి, కుటుంబానికి ధైర్యం చెప్పారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ఒక్క పింఛన్ల పంపిణీకే రూ.50,763 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశంలో మరే రాష్ట్రం కూడా సంక్షేమం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. "మేము ఏటా రూ.32,143 కోట్ల చొప్పున ఐదేళ్లలో పింఛన్ల కోసం రూ.1.65 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేయడం లేదు" అని చంద్రబాబు వివరించారు.ప్రస్తుతం రాష్ట్రంలో 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,739 కోట్లు పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. "రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 13 మందికి పింఛన్లు అందిస్తున్నాం. పింఛన్లు అందుకుంటున్న వారిలో 59 శాతం మహిళలే ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన రూ.50,000 కోట్లలో రూ.30,000 కోట్లు మహిళలకే అందాయి" అని ఆయన గణాంకాలతో సహా వివరించారు. ఈ నెల కొత్తగా 7,533 మందికి వితంతు పింఛన్లు మంజూరు చేస్తున్నామని, దీనివల్ల అదనంగా రూ.3 కోట్ల భారం పడుతుందని వెల్లడించారు.గత ఐదేళ్లలో లబ్ధిదారుడు ఒక్క నెల పింఛన్ తీసుకోకపోయినా, వారి పింఛన్‌ను రద్దు చేసేవారని చంద్రబాబు గుర్తు చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, రెండు నెలలుగా పింఛన్ తీసుకోని 1,39,677 మందికి రూ.114 కోట్లు, మూడు నెలలుగా తీసుకోని 13,325 మందికి రూ.16 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. 1984లో టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు పింఛన్ల పథకాన్ని ప్రారంభించారని, తాము దాన్ని దశలవారీగా పెంచుతూ ప్రస్తుతం రూ.4,000 అందిస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రతినెలా ఒకటో తేదీనే పింఛన్ ఇవ్వడాన్ని బాధ్యతగా తీసుకున్నామని అన్నారు.సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి చిన్నారికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయాన్ని 'తల్లికి వందనం' పథకం కింద అందిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 'సూపర్ సిక్స్' పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకే ప్రజలు కూటమికి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని తెలిపారు."దీపం-2 కింద ఏటా 3 సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నాం. ఇప్పటివరకు 2.85 కోట్ల సిలిండర్లను ఉచితంగా అందించాం. ఇందుకోసం రూ.2,104 కోట్లు ఖర్చు చేశాం. 'స్త్రీ శక్తి' పథకం కింద నేటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశాం" అని చంద్రబాబు వివరించారు.ఈ సందర్భంగా జనాభా సమతుల్యత ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. జనాభా క్షీణించడం ఆందోళన కలిగించే విషయమని, జనాభా సమతుల్యత దేశాన్ని, రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa