19 ఏళ్ల యువ పండితుడు వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన అసాధారణ ఘనత దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ఆయన దండక్రమ పారాయణాన్ని 50 రోజుల్లోనే విజయవంతంగా పూర్తి చేశారు. ఎలాంటి ఎవరోధాలూ లేకుండా, ఎవరూ ఊహించని విధంగా 2000 మంత్రాలను పఠించి చరిత్ర సృష్టించగా.. ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా ఈ యువకుడిని అభినందించారు.
భారతీయ సంస్కృతికి గర్వకారణం
దేవవ్రత్ మహేష్ రేఖే.. శుక్ల యజుర్వేదంలోని మధ్యాంధిని శాఖకు చెందిన సుమారు 2000 మంత్రాలను ఎలాంటి అవరోధాలు లేకుండా వరుసగా 50 రోజుల్లో పఠించి దండక్రమ పారాయణాన్ని పూర్తి చేశారు. ఈ మంత్ర పఠనంలో అనేక వేద శ్లోకాలు, పవిత్ర పదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని నేరుగా ప్రధాన మంత్రి మోదీయే ఎక్స్ వేదికగా వెల్లడించారు. "వేదమూర్తి దేవవ్రత్ మహేష్ రేఖే సాధించిన ఈ ఘనతను రాబోయే తరాలు తప్పకుండా గుర్తుంచుకుంటాయి. భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యువకుడి పట్ల గర్విస్తారు" అని మోదీ పేర్కొన్నారు.
దేవవ్రత్ మహేష్ రేఖే తన నియోజకవర్గమైన కాశీ (వారణాసి) పట్టణానికి చెందిన వ్యక్తి కావడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. కాశీలో ఈ అసాధారణ ఫీట్‌ను సాధించడం గర్వ కారణమని అన్నారు. ఈ గొప్ప విజయాన్ని సాధించడంలో దేవవ్రత్‌కు మద్దతు ఇచ్చిన అతని కుటుంబ సభ్యులు, భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన అనేక మంది సన్యాసులు, పండితులు, సంస్థలకు మోదీ తన కృతజ్ఞతలను తెలియజేశారు.
ఆధునిక భారత చరిత్రలో రెండో వ్యక్తి
మహారాష్ట్రలోని అహిల్యానగర్‌కు చెందిన దేవవ్రత్ మహేష్ రేఖే.. వేదాద్యయనం కోసం కాశీ వెళ్లారు. వేదాలు నేర్చుకున్న తర్వాత.. శుక్ల యజుర్వేదాన్ని రాసింది చూడకుండానే.. ఏకబిగిన 50 రోజులపాటు 165 గంటలు.. 2000లకుపైగా మంత్రాలను ఆయన ఉచ్ఛరించారు. ఆధునిక భారతదేశ చరిత్రలో ఇలాంటి ఘనత సాధించడం ఇది రెండోసారి మాత్రమే కావడం విశేషం. దండక్రమ పారాయణం చేసిన దేవవ్రత్‌కు దండక్రమ విక్రమాదిత్య బిరుదును ప్రదానం చేశారు.
దండక్రమ పారాయణం అంటే?
అత్యంత శక్తివంతమైన దండక్రమ పారాయణంలో నరసింహస్వామిని స్తుతిస్తారు. దండ క్రమలో.. దండ అంటే స్వీయనియంత్రణ లేదా ఏకాగ్రత, క్రమ అంటే వరుసక్రమం. పారాయణం అంటే పఠించడం. అంటే.. ఏకాగ్రతతో క్రమం తప్పకుండా మంత్రాలను పఠించడం అనుకోవచ్చు. దండక్రమ పారాయణం చేసిన వారి చుట్టూ.. ఒక బలమైన ఆధ్యాత్మిక కవచం ఏర్పడుతుందని నమ్ముతారు. ప్రతికూలతల నుంచి రక్షణకు, ధైర్యం కోసం, మనస్సు ప్రశాంతంగా ఉండటానికి; భయాలు, అవరోధాలు తొలగిపోవడానికి, సంకల్ప శక్తిని పెంచుకోవడానికి, నరసింహ స్వామి ఆశీస్సులు పొందడానికి దండక్రమ పారాయణం చేస్తారు. ఈ పారాయణం అనేది లయబద్ధంగా సాగిపోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa