ప్రపంచంలోనే అగ్రదేశాల జాబితాలో రష్యా ఉంటుంది. చమురు, ఆయుధాలు, యుద్ధ సామాగ్రి, ఇతర ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న రష్యా.. చాలా రంగాల్లో మిగిలిన దేశాలతో పోల్చితే ఒక మెట్టు పైనే ఉంటుంది. ఇక అలాంటి రష్యాకు అధ్యక్షుడిగా కొన్నేళ్లుగా కొనసాగుతున్న వ్లాదిమిర్ పుతిన్‌కు సంబంధించిన వివరాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆయన ఆరోగ్యం, రహస్య సమాచారం కోసం వెస్ట్రన్ దేశాలు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన ఆస్తులు, వేతనానికి సంబంధించి.. అందరి దృష్టి పడింది. ఈ క్రమంలోనే అధికారిక లెక్కల ప్రకారం.. పుతిన్ ఎంత జీతం తీసుకుంటారు, ఆయనకు ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి. ఆయన ఆస్తులపై ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
క్రెమ్లిన్ అధికారిక ప్రకటనల ప్రకారం.. పుతిన్ వార్షిక వేతనం 1.40 లక్షల డాలర్లు. అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.1.26 కోట్లు. కానీ ఫైనాన్షియర్ బిల్ బ్రౌడర్ వంటి విమర్శకుల ఆరోపణల ప్రకారం.. పుతిన్ దాచిన మొత్తం సంపద విలువ 200 బిలియన్ డాలర్లు అంటే.. రూ.18 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ రహస్య సంపదను రష్యాలోని ధనిక వ్యాపారవేత్తల నుంచి.. పుతిన్ బలవంతంగా వాటాల రూపంలో తీసుకోవడం ద్వారా కూడబెట్టినట్లు తెలుస్తోంది. పుతిన్ తనకు నమ్మకమైన వ్యక్తులతో కూడిన భారీ నెట్‌వర్క్ ద్వారా ఈ ఆస్తులు కూడబెట్టినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ సంపదలో 1 బిలియన్ డాలర్లు అంటే రూ.9 వేల కోట్ల విలువైన బ్లాక్ సీ ప్యాలెస్, విలాసవంతమైన యాచ్‌లు ఉన్నట్లు సమాచారం.
అయితే రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ మాత్రం ఎప్పుడూ పుతిన్‌ను నిరాడంబరమైన నేతగా చెబుతుంది. కానీ విచారణ అధికారుల అంచనాలు మాత్రం వాటికి భిన్నంగా ఉన్నాయి. రాయిటర్స్ ప్రకారం.. పుతిన్ ప్రకటించిన వార్షిక వేతనం దాదాపు 1.40 లక్షల మాత్రమే. అంతేకాకుండా 800 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్.. ఒక చిన్న స్థలం, 3 వాహనాలు మాత్రమే పుతిన్ పేరున ఉన్నాయి. కానీ రష్యాలో ఒకప్పుడు అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉన్న బిల్ బ్రౌడర్ ఆరోపణల ప్రకారం.. పుతిన్ సంపద 200 బిలియన్ డాలర్ల వరకు ఉండవచ్చని పేర్కొంటున్నారు. ఇదే నిజమైతే.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పుతిన్ నిలుస్తారు.
పుతిన్ దాచిన ఆస్తులు, విలాసవంతమైన వస్తువులు
పుతిన్ అధికారిక ఫైలింగ్‌లలో లేనప్పటికీ.. కొన్ని ఆస్తులు ఆయనకు సంబంధించినవి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుతిన్ సన్నిహితుడు అర్కాడీ రోటెన్‌బర్గ్ పేరుపై బ్లాక్ సీ ప్యాలెస్ అధికారికంగా ఉన్నప్పటికీ.. ఆ ఖరీదైన ప్యాలెస్ బ్లాక్ సీ తీరంలో ఉంది. మరోవైపు.. సుమారు రూ.6 వేల కోట్ల విలువైన సూపర్‌యాచ్‌తో ఆయనకు సంబంధం ఉన్నట్లు బ్రిటన్ ఫారిన్ ఆఫీస్ విడుదల చేసిన రిపోర్టులు చెబుతున్నాయి. పుతిన్ ధరించే లగ్జరీ వాచ్‌ల విలువ ఆయన ప్రకటించిన వార్షిక ఆదాయం కంటే చాలా రెట్లు ఎక్కువ అనే వాదనలు ఉన్నాయి.
సంపదను కూడబెట్టిన విధానం
పుతిన్ ఆర్థిక సామ్రాజ్యం పూర్తిగా రహస్యంగా ఉంటుంది. అయితే పుతిన్ సంపాదించేందుకు ప్రధానంగా రెండు పద్ధతులను పాటిస్తారని.. పలువురు ఆరోపిస్తున్నారు. ఒలిగార్క్ (రష్యాలోనే ధనవంతులైన వ్యాపారులు)ల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విచారణల నుంచి రక్షణ కల్పించడానికి బదులుగా.. రష్యాలోని అత్యంత ధనిక వ్యాపారవేత్తల నుంచి వాటాలు లేదా నగదును పుతిన్ డిమాండ్ చేశారని సీఎన్ఎన్ వంటి ఇంటర్నేషనల్ మీడియా నివేదించింది.
ఫోర్బ్స్ ప్రకారం.. పుతిన్ తన నమ్మకమైన వ్యక్తులు, బంధువులు, చిన్ననాటి స్నేహితులకు లాభదాయకమైన కాంట్రాక్టులను అందించేందుకు నిబంధనలను సులభతరం చేశారు. దీనికి ప్రతిఫలంగా.. వారు ఆయనకు కిక్‌బ్యాక్‌లను పంపుతారని ఆరోపణలు ఉన్నాయి. 2016 పనామా పేపర్లలో.. పుతిన్ సన్నిహితులకు ఉన్న దాదాపు 18 వేల కోట్ల విలువైన ఆఫ్‌షోర్ రుణాలు, కంపెనీల వెబ్ బయటికి వచ్చింది. గత 20 సంవత్సరాలుగా ఫోర్బ్స్ పరిశోధకులు.. పుతిన్ సంపదను కనుగొనడంలో విఫలమయ్యారు. ఆయన నమ్మకమైన సహచరులు, కుటుంబ సభ్యుల నెట్‌వర్క్ ద్వారా ఈ సంపదను నియంత్రిస్తున్నారని అంచనాలు ఉన్నాయి.
2022 ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు.. పుతిన్, రష్యా ప్రముఖులను ఆర్థికంగా బలహీనపరచినట్లు కనిపించడం లేదు. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. రష్యా అత్యంత ధనిక వ్యక్తులు 72 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.6.5 లక్షల కోట్లు సంపాదించారు. దీనికి యుద్ధకాలంలో పెరిగిన డిమాండ్, విదేశీ ఆస్తులను తక్కువ ధరకు స్వాధీనం చేసుకోవడం కారణమని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa