దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగోలో నిర్వహణపరమైన లోపాల కారణంగా గురువారం పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల కారణంగా ఒక్కరోజులోనే 550కి పైగా జాతీయ, అంతర్జాతీయ విమానాలు రద్దు అయ్యాయి. ప్రతి మూడింటిలో రెండు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో దేశవ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
గురువారం ఒక్కరోజే హైదరాబాద్‌లోనే 79 విమానాలు రద్దు అయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో అయితే 172, ముంబయిలో 118, బెంగళూరులో 100, కోల్‌కతాలో 35, చెన్నైలో 26, గోవాలో 11 విమానాలు రద్దవడంతో దేశవ్యాప్తంగా ప్రయాణం స్తంభించింది. విమానం రద్దు సమాచారాన్ని సరైన సమయంలో అందించకపోవడంతో వందల మంది ప్రయాణికులు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్-ఇన్ పూర్తయిన తర్వాత విమానం రద్దు అయిందని చెప్పడంతో ఇండిగో సిబ్బందిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సిబ్బందిలోనే ఒకరిపై దాడి కూడా జరిగింది.
ఉదయం 6.30 గంటలకు చెన్నైకి బయల్దేరాల్సిన 20 మంది ప్రయాణికులు (వివాహానికి హాజరు కావాల్సిన వారు) తెల్లవారుజాము నుంచే ఎయిర్‌పోర్టులో వేచి చూశారు. మధ్యాహ్నం 2 గంటలైనా విమానం రాకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి కొచ్చిన్‌కు వెళ్లాల్సిన విమానం రద్దు అవడంతో శబరిమలకు వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు సైతం విమానాశ్రయంలో నిరసన చేపట్టారు.
ఫిబ్రవరి 10వ తేదీ వరకు ఇదే పరిస్థితా?
విమాన సేవలను సాధారణ స్థితికి తేవడమే తమ తక్షణ లక్ష్యమని ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. అయితే అది అంత సులభం కాదని ఆయన అంగీకరించారు. ఇండిగో విమానాలన్నీ సాధారణ స్థితికి చేరుకోవడానికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీ వరకు సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8వ తేదీ నుంచి విమానాల సంఖ్యను మరింత తగ్గించనున్నట్లు ఇండిగో సంస్థ గురువారం డీజీసీఏకు అందించిన నివేదికలో వెల్లడించింది. మరోవైపు ఇండిగో గందరగోళంపై పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు గురువారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అతి త్వరగా విమానాలను సాధారణ స్థితికి చేర్చాలని, ఛార్జీలను పెంచే చర్యలకు పాల్పడవద్దని ఆయన ఇండిగోకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa