శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న వెనుకబాటుతనం తొలగిపోనుంది. కనీస సౌకర్యాలు, అరకొర రవాణా వ్యవస్థతో పాటు అభివృద్ధి అంతంతమాత్రంగా ఉన్న ఈ ప్రాంతానికి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిష్కారం చూపుతోంది. కొత్త రైల్వే లైన్, రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. 80 కిలోమీటర్ల దూరంలోనే బెంగళూరు విమానాశ్రయం ఉండటం పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మడకశిర ముఖచిత్రం మారబోతోంది. ఇన్నాళ్లూ వెనుకబడిన మడకశిర నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధి బాట పట్టనుంది. ఈ అభివృద్ధి పనుల వల్ల మడకశిర రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి.
మడకశిరకు రైలు రాబోతోంది.. 2011లో రాయదుర్గం-తుమకూరు రైల్వేలైను నిర్మాణం రూ.1,050 కోట్ల వ్యయంతో ప్రారంభమైంది. అయితే ఈ రైల్వే లైన్‌కు సంబంధించి వ్యయం కూడా పెరిగింది.. మొత్తం రూ.2,496 కోట్లతో పనులు చేపట్టారు. మడకశిరకు వచ్చే ఏడాది డిసెంబరులోపు రైలు తీసుకువస్తామని కేంద్రమంత్రి సోమన్న చెబుతున్నారు. ఆయనే స్వయంగా మూడుసార్లు ఈ రైల్వే లైన్ పనుల్ని పరిశీలించారు.. పనులు వేగవంతం చేయాలని సూచించారు. కొత్త రైల్వేస్టేషన్ నిర్మాణం హరేసముద్రం సమీపంలో వేగంగా జరుగుతోంది. ఈ రైలు మార్గంలో.. రాయదుర్గం, కళ్యాణదుర్గం, పావగడ, మడకశిర, తుమకూరు, బెంగళూరుకు ఈజీగా వెళ్లొచ్చు.
మడకశిర సమీపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయబోతున్నారు. అంతేకాదు 1,600 ఎకరాల భూమిని ఏపీఐఐసీ సేకరించింది. రూ.1,430 కోట్లతో కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ పరిశ్రమను ప్రారంభిస్తోంది. కల్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ సంస్థ ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీలో కీలక పాత్ర పోషించనుంది. రూ.250 కోట్లతో ఎవరెస్టు స్టీల్ బిల్డింగ్స్ కంపెనీ ప్రీ ఇంజినీరింగ్ బిల్డింగ్ పరికరాలను తయారు చేయనుంది. మూతపడిన గార్మెంట్ పరిశ్రమ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించడం స్థానిక ప్రజలకు ఎంతో మేలు చేసింది. ఈ పరిశ్రమ ద్వారా 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇది ఆ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది. ఈ పరిశ్రమల ఏర్పాటుతో మడకశిర ప్రాంతం పారిశ్రామికంగా గణనీయమైన అభివృద్ధి సాధించనుంది.
ఏపీ ప్రభుత్వం కర్ణాటక సరిహద్దులోని మడకశిరను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించింది. ఇంతకుముందు, మడకశిర ప్రాంత ప్రజలు తమ రెవెన్యూ పనుల కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. పెనుకొండకు వెళ్లాలంటే దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. పుట్టపర్తి జిల్లా కేంద్రానికి వెళ్లడం ఇంకా కష్టంగా ఉండేది. ఒక రోజులో వెళ్లి తిరిగి రాలేని పరిస్థితి ఉండేది. ప్రభుత్వం మడకశిరను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించడంతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. అమరాపురం, అగళి, రొళ్ల, గుడిబండ మండలాల ప్రజలు తమ రెవెన్యూ పనులను స్థానికంగానే పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల వారికి సమయం, డబ్బు ఆదా అవుతుంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa