అగ్రరాజ్యం అమెరికా పౌరుల భద్రత, ప్రజా భద్రతా ప్రమాణాలను అమలు చేసే దిశగా యూఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది వివిధ కేటగిరీలకు చెందిన 85,000 వీసాలను రద్దు చేసినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇది గత సంవత్సరం రద్దు చేసిన వాటి కంటే రెట్టింపు కావడం గమనార్హం. రద్దు చేసిన వీసాలలో 8,000 మందికి పైగా విద్యార్థుల వీసాలు ఉన్నాయని స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, దాడులు, దొంగతనం వంటి నేరాలే ఇందులో సగం వీసాల రద్దుకు కారణం అని తెలిపారు. "ఈ వ్యక్తులు మా సమాజ భద్రతకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తారు. అందుకే వారిని దేశంలోకి అనుమతించదలుచుకోలేదు" అని ఆ అధికారి స్పష్టం చేశారు.
అడ్మినిస్ట్రేషన్ వీసా పరిశీలన విధానం అత్యంత కఠినంగా ఉందని.. ముఖ్యంగా హై-రిస్క్ ప్రాంతాల నుంచి వచ్చే దరఖాస్తుదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2021లో సైనిక ఉపసంహరణ తర్వాత అఫ్గానిస్థాన్లో నెలకొన్న భద్రతా పరిస్థితులపై ఎప్పుడూ ఆందోళనలు ఉన్నాయని, వీసా దరఖాస్తుదారులు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించకుండా నిరోధించడానికి తనిఖీలను కఠినతరం చేశామని అధికారులు తెలిపారు. "భద్రతా తనిఖీలలో ఎలాంటి తొందరపాటు ఉండదు. దరఖాస్తుదారుడు అమెరికన్ భద్రతకు ముప్పు కలిగించడని నిర్ధారించుకునే వరకు వీసా జారీ చేయబడదు" అని అధికారులు స్పష్టం చేశారు.
అమెరికా విదేశాంగ విధానానికి విరుద్ధంగా.. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులు, స్టూడెంట్ల వీసాలను రద్దు చేస్తున్నామని, ఈ సంఖ్య వందలు, వేలల్లో ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గతంలో ప్రకటించారు. ఆయన ప్రకటనకు అనుగుణంగానే వేలాది వీసాలు రద్దు చేసినట్లు తెలుస్తోంది. అలాగే వీసా అర్హతను నిర్ణయించేటప్పుడు.. కాన్సులర్ అధికారులు కేవలం ఒక అంశాన్ని మాత్రమే కాకుండా, దరఖాస్తుదారుడి మొత్తం పరిస్థితులను పరిశీలించి, ప్రతి కేసును విడిగా నిర్ణయిస్తారని అధికారులు వివరించారు.
ఇది మాత్రమే కాకుండా అగ్రరాజ్యం అమెరికా ప్రజా భద్రతకు ముప్పుగా పరిణమించే విద్యార్థి, హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని విదేశాల్లో ఉన్న తమ రాయబారులకు యూఎస్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాలస్తీనీయన్లకు మద్దతుగా లేదా గాజాలో ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే స్టూడెంట్లు, గ్రీన్ కార్డు దారులకూ బహిష్కరణ ముప్పు తప్పదని విదేశాంగశాఖ హెచ్చరించినట్టు సమాచారం. ఇలాంటి చర్యలు అమెరికా జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తాయని ట్రంప్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa