లంచం, అవినీతి పట్ల ఉక్కుపాదం మోపుతున్న చైనా ప్రభుత్వం.. మరో అధికారిని ఉరితీసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవినీతి, లంచాలను తీవ్రంగా పరిగణిస్తున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ .. కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. తమ పార్టీ అయినా, ఇతర పార్టీ అనే తేడా లేకుండా.. భారీ అవినీతి పాల్పడిన వారికి ఏకంగా ఉరిశిక్షలు విధిస్తూ.. మిగిలిన అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. జిన్‌పింగ్ ఆదేశాల దెబ్బకు.. చైనా అధికారులు లంచం, అవినీతి అంటేనే ఆమడ దూరం పారిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాలోని ఓ ప్రభుత్వ బ్యాంకు మేనేజర్ ఏకంగా 156 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1400 కోట్లు లంచం తీసుకున్నట్లు తేలడంతో అతడికి ఉరిశిక్ష విధించారు.
చైనాలోని అగ్రశ్రేణి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఆస్తి నిర్వహణ సంస్థ హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (సీహెచ్ఐహెచ్) మాజీ ఎగ్జిక్యూటివ్ అధికారి బాయి తియాన్‌హుయ్‌కి అవినీతి ఆరోపణల కేసులో మంగళవారం ఉరిశిక్ష అమలు చేసినట్లు చైనా మీడియా ప్రకటించింది. 2014-2018 మధ్య ప్రాజెక్టుల కొనుగోలు, ఫైనాన్సింగ్ ఇవ్వడంలో అతడు అవకతవకలకు పాల్పడ్డాడని.. ఇందుకోసం ఏకంగా 156 మిలియన్ డాలర్లకు పైగా లంచాలు తీసుకున్నట్లు తేలింది.
ఈ నేరాలు అత్యంత తీవ్రమైనవని.. దేశ ప్రయోజనాలకు గణనీయమైన నష్టాన్ని కలిగించేవి అని.. సుప్రీం పీపుల్స్ కోర్ట్ తేల్చి చెప్పింది. అవినీతి వ్యతిరేక చర్యలు చేపడుతున్న షీ జిన్‌పింగ్ మెయిన్ టార్గెట్‌లో ఈ హువారోంగ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సంస్థ ఉంది. ఈ సంస్థ మాజీ ఛైర్మన్ లాయి జియావోమిన్‌ని కూడా 2021లో ఉరితీశారు.
చైనాలోని అతిపెద్ద ఆస్తి నిర్వహణ నిధుల్లో ఒకటైన చైనా హువారోంగ్ అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థకు అనుబంధంగా ఉన్న సీహెచ్ఐహెచ్‌లో గతంలో జనరల్ మేనేజర్‌గా బాయి తియాన్‌హుయ్ పనిచేశారు. అయితే.. చైనాలో అవినీతి కేసుల్లో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించడం సర్వసాధారణమే అయినప్పటికీ.. చాలా కేసుల్లో ఇది 2 ఏళ్ల వాయిదాతో జీవిత ఖైదుగా మారుస్తారు. అయితే బాయి తియాన్‌హుయ్ శిక్షను మాత్రం వాయిదా వేయకుండా అమలు చేయడం గమనార్హం.
ఉత్తర టియాంజిన్‌లో మే 2024లో బాయి తియాన్‌హుయ్‌కి మరణశిక్ష విధించగా.. ఆయన ఆ తీర్పును అప్పీల్ చేసుకున్నారు. అయినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పునే సమర్థించారు. దీంతో టియాంజిన్‌లో మంగళవారం ఉదయం అతడికి ఉరిశిక్ష అమలు చేసినట్లు మీడియా తెలిపింది.
హువారోంగ్ మాజీ ఛైర్మన్ లాయి జియావోమిన్ కూడా 253 మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా రూ.23 కోట్ల లంచాలు తీసుకున్నారనే ఆరోపణలపై 2021 జనవరిలో ఉరిశిక్షకు గురయ్యారు. బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ ఛైర్మన్ లియు లియాంగేకు 121 మిలియన్ యువాన్లు అంటే భారత కరెన్సీలే ఏకంగా రూ.153 కోట్ల లంచం కేసులో నవంబర్ 2024లో రెండేళ్ల వాయిదాతో మరణశిక్ష విధించారు. ఇంకా చాలా మంది ఉన్నత స్థాయి అధికారులు కూడా అవినీతి కేసుల్లో శిక్షలు ఎదుర్కొంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa