భారత రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కల్గిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ సోమవారం రోజు ఉదయం కన్నుమూశారు. మహారాష్ట్ర లాతూర్‌లోని ఆయన స్వగృహమైన 'దేవ్‌ఘర్'లో ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసు కల్గిన ఆయన.. గత కొంతకాలంగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం రోజు ఉదయం ఆరోగ్యం మరింత క్షీణించి క్షణాల్లోనే చనిపోయారు. ఈ విషయాన్ని నేరుగా ఆయన కుటుంబ సభ్యులే మీడియాకు తెలిపారు. అయితే పాటిల్‌కు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన (బీజేపీ నాయకురాలు), ఇద్దరు మనమరాళ్లు ఉన్నారు.
భారత రాజకీయాల్లో.. శివరాజ్ పాటిల్ తన హుందా ప్రవర్తనకు, ఉన్నత వ్యక్తిత్వానికి ప్రసిద్ధి చెందారు. బహిరంగ ప్రసంగాలతో పాటువ్యక్తిగత సంభాషణల్లో కూడా ఆయన ఎప్పుడూ.. ఇతరులను విమర్శించేవారు కాదని పార్టీ నాయకులు గుర్తు చేసుకున్నారు. విపరీతంగా పుస్తకాలు చదివే ఈయన.. ఒక విషయం పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పష్టమైన ప్రసంగాన్ని ఇచ్చేవారని.. మరాఠీతో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉండేదని వివరించారు. అంతేకాకుండా రాజ్యాంగపరమైన విషయాలపై ఆయనకున్న అసాధారణ పరిజ్ఞానమే ఆయన్ను ఆ కాలపు అత్యంత గౌరవనీయ పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా నిలబెట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి.
శివరాజ్ పాటిల్ భారత రాజకీయాల్లో అనేక కీలకమైన, అత్యున్నత పదవులను అలంకరించారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోం మంత్రిగా పని చేశారు. అంతకుముందు 1991 నుంచి 1996 వరకు 10వ లోక్‌సభ స్పీకర్‌గా గౌరవప్రదంగా బాధ్యతలు నిర్వర్తించారు. పదవీ విరమణ తర్వాత కూడా 2010 నుంచి 2015 వరకు పంజాబ్ గవర్నర్‌గా, చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతానికి అడ్మినిస్ట్రేటర్‌గా కూడా సేవలు అందించారు.
1935 అక్టోబర్ 12న జన్మించిన పాటిల్.. లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్‌గా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 70వ దశకం ప్రారంభంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన ఏడుసార్లు లాతూర్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నాయకుడిగా మారారు. అయితే 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రూపాయి పాటిల్ నిలంగేకర్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. కానీ ఆ తర్వాత ఆయన్ను రాజ్యసభ ఎంపీగా నామినేట్ చేసి మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇలా దేశానికి విశిష్ట సేవలు అందించిన ఆయన తాజాగా మృతి చెందడంతో.. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa