ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిమాలయాల్లో దాగి ఉన్న ఓ అణు బాంబు రహస్యం ,,,, ప్రమాదంలో గంగానది

national |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 08:55 PM

ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండాలనే ఆశతో అమెరికా గత కొన్ని దశాబ్దాలుగా.. చాలా దేశాలను తమకు అనుకూలంగా పావులాగా వాడుకుంటోంది. అయితే అమెరికాతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలను ఓ కంట కనిపెట్టాలనే ఉద్దేశంతో.. గూఢచర్యాన్ని ప్రోత్సహించి.. ప్రత్యర్థి దేశాల రహస్యాలను, అభివృద్ధిని పసిగట్టే పనిని ఎప్పటి నుంచో చేస్తోంది. అందులో భాగంగానే తమకు మిత్ర దేశాలను వాడుకుంటోంది. ఇలాగే గతంలో ఓసారి చైనా విషయంలో భారత్‌ను వినియోగించుకుని.. ఇప్పుడు భారత్ ముందు పెద్ద పెను ముప్పును పెట్టింది. గత కొన్ని దశాబ్దాలుగా వెలుగులోకి రాని రహస్యంగా ఉన్న ఈ విషయానికి సంబంధించి.. పదే పదే ఆందోళనలు, భయాలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. రెండు దేశాల ప్రభుత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు.


1964లో చైనా తన తొలి అణు పరీక్షలు నిర్వహించడంతో అగ్రరాజ్యం అమెరికా అలర్ట్ అయింది. వెంటనే చైనాపై నిఘా పెట్టేందుకు రెడీ అయింది. దీంతో పక్కనే ఉన్న భారత్‌ను ఉపయోగించుకుంది. 1965లో.. చైనా అణు పరీక్షలపై నిఘా ఉంచేందుకు.. అమెరికా సీఐఏ, భారత గూఢచార సంస్థలు కలిసి అత్యంత రహస్యంగా ఒక మిషన్‌ను చేపట్టాయి. హిమాలయాల్లోని ప్రస్తుత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న నందా దేవి పర్వత శిఖరంపై ఒక అణు పరికరాన్ని ఉంచి.. దాని ద్వారా చైనా రహస్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ప్రయత్నాలు చేశాయి.


స్నాప్-19సీ అనే ప్లూటోనియం ఆధారిత పోర్టబుల్ అణు జనరేటర్‌ను నందా దేవి పర్వతం పైన ఏర్పాటు చేయాలని ప్లాన్ చేశారు.


ఇది ప్లూటోనియం శక్తితో నడిచే దాదాపు 23 కిలోల బరువైన ఒక అణు జనరేటర్‌. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని నాగసాకిపై అమెరికా వేసిన అణు బాంబులో ఉన్న ప్లూటోనియంలో మూడింట ఒక వంతు ఈ అణు పరికరంలో ఉంచారు. దీనికి అమెరికా, భారత్ తరఫున కొందరు పర్వతారోహకులను.. ఆ అణు పరికరంతో మంచు కొండపైకి పంపించారు. అయితే ఆ సమయంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితులు తలెత్తాయి.


ఇక ఈ మిషన్‌కు కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ నాయకత్వం వహించారు. మంచు పర్వతంపైకి పర్వతారోహకులు వెళ్లిన తర్వాత.. హఠాత్తుగా తీవ్రమైన మంచు తుపాన్ రావడంతో.. వారిని వెనక్కి రావాలని కెప్టెన్ ఎంఎస్ కోహ్లీ ఆదేశాలు జారీ చేశారు. అయితే వచ్చే ముందు.. ఆ అణు జనరేటర్‌ను సురక్షితంగా ఆ కొండపై ఉంచి రావాలని పేర్కొన్నారు. దీంతో ఆ పర్వతారోహకులు దాన్ని ఒక మంచు పగులులో వదిలి పెట్టి.. మేకులు, నైలాన్ తాడుతో కట్టి కిందికి వచ్చారు. ఇక అక్కడ పరిస్థితులు శాంతించిన తర్వాత.. 1966 మే నెలలో తిరిగి తీసుకువచ్చేందుకు వెళ్లిన బృందానికి షాక్ తగిలింది. వారు దాచి పెట్టిన అణు పరికరంపై కొండ చరియలు విరిగిపడి అది కనిపించకుండా పోయింది.


దాన్ని కనిపెట్టేందుకు భారత్, అమెరికా బృందాలు.. 1967, 1968లలో అనేక పరిశోధన ఆపరేషన్లు నిర్వహించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఆల్ఫా కౌంటర్లు, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లతో సహా అత్యాధునిక పరికరాలు ఉపయోగించినా ఆ అణు పరికరం ఎక్కడికి వెళ్లిందో కనీసం గుర్తించలేకపోయారు. ఫ్లూటోనియం వేడి కారణంగా.. ఆ అణు పరికరం మంచును కరిగించి.. గ్లేసియర్‌లో లోతుగా కూరుకుపోయిందని పర్వతారోహకులు భావించారు.


1970లలో ఈ రహస్య మిషన్‌కు సంబంధించిన వార్తలు వెల్లడి కావడంతో.. అమెరికా, భారత ప్రభుత్వాల్లో తీవ్ర కలకలం చెలరేగింది. అప్పటి భారత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.. ఈ సమస్యను రహస్యంగా పరిష్కరించేందుకు సహకరించుకోవాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ.. అప్పటి నుంచి ఇప్పటివరకు దాని ఆచూకీని మాత్రం కనుగొనలేకపోయారు. దీంతో.. 6 దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా.. భారత పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు, హిమాలయాల అంచున ఉన్న గ్రామ ప్రజలు.. ఈ అణు పరికరం వల్ల ఏర్పడే ప్రమాదాల గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


ప్లూటోనియం అత్యంత విషపూరితమైన రేడియో ధార్మిక పదార్థం. ప్రస్తుతం హిమనీనదాలు కరుగుతున్న కారణంగా.. మంచులో కూరుకుపోయిన ఆ అణు జనరేటర్ బయటకు వచ్చి.. గంగా నది, దాని ఉపనదుల్లో కలుస్తుందనే భయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల.. గంగా, దాని ఉప నదులపై ఆధారపడిన కోట్లాది మంది భారతీయుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని భయపడుతున్నారు. గతంలో 2021లో నందా దేవి పర్వతం సమీపంలో కొండచరియలు విరిగిపడి.. నదీ ప్రవాహం పెరిగి 200 మందికి పైగా దుర్మరణం చెందారు. దానికి కూడా అణు పరికరం విడుదల చేసిన వేడి కారణమని కొందరు అనుమానం వ్యక్తం చేశారు.


ఇక ఈ రహస్య మిషన్‌లో పాల్గొన్న పర్వతారోహకులు.. దశాబ్దాల మౌనం తర్వాత.. తమ జీవిత చివరి దశలో ఆ మిషన్ అనుభవాలను పంచుకున్నారు. చివరి అమెరికన్ పర్వతారోహకుల్లో ఒకరైన జిమ్ మెక్‌కార్తీ(92).. ఆ అణు పరికరాన్ని పర్వతంపై వదిలివేసినందుకు మిషన్‌కు నేతృత్వం వహించిన ఎంఎస్ కోహ్లీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగా నదిలోకి ప్లూటోనియాన్ని వదలలేరని.. ఆ నదిపై ఎంతమంది ప్రజలు ఆధారపడి ఉన్నారో తెలుసా అని మండిపడ్డారు. ఈ మొత్తం ఘటనను అమెరికా ప్రభుత్వం ఇప్పటికీ బహిరంగంగా అంగీకరించకపోయినా.. ఈ మిషన్ పత్రాలు మాత్రం.. హిమాలయన్ ఇన్సిడెంట్, నందా దేవి అఫైర్ పేరుతో ఇప్పటికీ ఆర్కైవ్స్‌లో కనిపిస్తూనే ఉన్నాయి.


నందా దేవి పర్వతాన్ని గత కొన్ని దశాబ్దాలుగా అధిరోహించకుండా మూసివేసి ఉంచారు. దాని చుట్టుపక్కల నివసించే గ్రామాల ప్రజలు తీవ్ర భయందోళనలో బతుకుతున్నారు. ఒక అణు పరికరం కనిపించకుండా పోయిందని తమ గ్రామస్తులకు తెలుసని 2023లో చనిపోయిన స్థానిక రైతు, పర్యావరణ కథనాలను రాసిన ధన్ సింగ్ రాణా.. అప్పట్లో తెలిపారు. అయితే మొదట అది పేలిపోయి ఉంటుందని తాము అనుకున్నట్లు చెప్పారు. ప్రజలు చంద్రుడిపైకి వెళ్లే టెక్నాలజీ సాధించినప్పుటు.. ఆ అణు పరికరానికి ఏమైందో ఎందుకు కనుగొనలేరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.


1970లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ నియమించిన నిపుణుల కమిటీ.. స్థానికుల భయాలను తొలగించే ప్రయత్నం చేసింది. ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను విశ్లేషించి.. ఎలాంటి కాలుష్యం ఆనవాళ్లు లేవని తేల్చారు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆ అణు జనరేటర్ పగిలిపోయి.. ప్లూటోనియం బయటికి వచ్చినా.. దాని వల్ల జరిగే నీటి కాలుష్యం.. అంత పెద్ద ప్రమాదం కాదని ఆ కమిటీ తేల్చింది. గంగా నదిలోకి ప్రవహించే నీరు చాలా ఎక్కువగా ఉన్నందున.. ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆ కమిటీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.


జలవిద్యుత్ కోసం హిమాలయ నదులపై భారత్ ఆనకట్టలు నిర్మిస్తోందని.. చైనా సరిహద్దు వెంబడి రహదారులను విస్తరిస్తోందని.. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్ తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో చాలా కార్యకలాపాలు జరుగుతున్నాయని.. అందుకే ఆ అణు పరికరాన్ని తవ్వి తీసి శాశ్వతంగా అక్కడి వారి భయాలను తొలగించాలని పేర్కొన్నారు. దీనిపై 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా మహారాజ్ చర్చించారు. 1965లో జరిగిన విషయం ప్రధాని మోదీకి తెలియదని.. కానీ పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.


ఇటీవల బీజేపీ నేత, లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబే కూడా.. ఈ అదృశ్యమైన అణు పరికరమే వరుసగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలకు కారణమా అంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మరోసారి.. ఆ భయాలను వెలికితీసింది. తన హిమాలయ పర్యటనలో.. అక్కడ కొండచరియలు విరిగిపడటం, వరదల గురించి చాలా కథనాలను విన్నానని.. ఆ తర్వాత తాను కూడా పరిశోధించడం ప్రారంభించినట్లు నిషికాంత్ దూబే వివరించారు. ఈ అణు జనరేటర్ చాలా ప్రమాదకరమైనదని.. దాన్ని ఏర్పాటు చేసిన ఏజెన్సీ తిరిగి వచ్చి దాని ఆచూకీ గుర్తించాలని ఆయన అభిప్రాయపడ్డారు.


ఇక ఈ మిషన్‌కు నాయకత్వం వహించిన కెప్టెన్ ఎం.ఎస్. కోహ్లీ తన మరణానికి ముందు.. ఓ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ మిషన్ గురించి తీవ్ర పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన ఎంఎస్ కోహ్లీ.. తాను ఆ మిషన్‌ను అలా చేసి ఉండాల్సింది కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఐఏ పూర్తి స్థాయిలో సమాచారం అందించలేదని.. వారి ప్లాన్ చాలా తెలివితక్కువదని పేర్కొన్నారు. అంతేకాకుండా తమకు సలహా ఇచ్చిన వారందరూ తెలివిలేని వారేనని.. తాము అందులో చిక్కుకున్నామని ఆ ఘటనను గుర్తు చేసుకున్నారు. ఇక ఆ అణు పరికరం మానవాళికి చాలా తీవ్రమైన ప్రమాదమని మాజీ గూఢచారి ఆర్‌.కె. యాదవ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa