మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పుతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు హిందీలోనే పేర్లు పెట్టడం వివాదాస్పదంగా మారింది. గతంలో బిల్లులకు హిందీ, ఇంగ్లీష్ భాషలు రెండింటిలోనూ పేర్లు ఉండేవి. కానీ ఇప్పుడు కేవలం హిందీ పేర్లను మాత్రమే పెట్టడం అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భాషాపరమైన ఏకీకరణ జరుగుతోందని, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం పేరును మార్చడం కూడా ఈ కోవకే చెందుతుందని అంటున్నారు.
వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ మిషన్ (రూరల్) బిల్లు, వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, సబ్ కా బీమా, సబ్ కా రక్షా బిల్లుకు హిందీ పేర్లు, అణుశక్తి విభాగంలో ప్రైవేట్ రంగాన్ని అనుమతించే బిల్లుకు మాత్రం ‘Sustainable Harnessing and Advancement of Nuclear Energy for Transforming India’ అనే ఇంగ్లీష్ పేరు పెట్టి, దాని సంక్షిప్త రూపం SHANTI (శాంతి) అని పేర్కొన్నారు. గతంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లు వంటి పేర్లతో చట్టాలు వచ్చాయి. విమానయాన చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయాన్ విధేయక్ చట్టం వచ్చింది.
ఉపాధి హామీ పథకం MNREGA పేరును ‘జీ రామ్ జీ’ గా మార్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. హిందూ మతం పట్ల ఆ పార్టీ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని బీజేపీ విమర్శిస్తోంది. అయితే, హిందీ పేర్ల వాడకం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలను పెంచుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చాలామంది ఎంపీలు, రాజకీయ నాయకులు హిందీ పేర్లు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉన్నాయని అంటున్నారు. లోక్‌సభలో వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, RSP(A) నేత ఎన్.కె. ప్రేమచంద్రన్.. ఆ పేరు పలకడం కష్టంగా ఉందని చెప్పారు. కొత్త చట్టాలకు ఇంగ్లీష్‌లో పేర్లు ఉండాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(B) చెబుతోందని ఆయన వాదించారు.
కాంగ్రెస్ ఎంపీ జోతిమణి, డీఎంకే సభ్యుడు టి.ఎం. సెల్వగణపతి కూడా తమ అభ్యంతరాలను తెలిపారు. ‘ఇది హిందీని రుద్దడమే. జాతీయ విద్యా విధానం-2020లో మూడు భాషల విధానాన్ని వ్యతిరేకించినందుకే తమిళనాడుకు సర్వ శిక్షాభియాన్ నిధులు రాలేదు’ అని జోతిమణి ఆరోపించారు. డీఎంకే నేత టి.ఆర్. బాలు కూడా దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దడాన్ని వ్యతిరేకించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ‘ఈ మార్పు హిందీ మాట్లాడని ప్రజలకు, తమ ప్రాంతీయ భాషలను అధికార భాషగా ఉన్న రాష్ట్రాలకు అవమానం.. 75 ఏళ్లుగా ఈ పద్ధతిలో ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు, ప్రభుత్వం ఎందుకు మార్పు చేయాలి?’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ప్రశ్నించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(b) ప్రకారం.. పార్లమెంట్ నిర్ణయించే వరకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లోని అన్ని బిల్లులు, చట్టాలు, ఆర్డినెన్స్‌లు, ఆదేశాలు, నియమాలు, నిబంధనలు, బై-లాస్, అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని అన్ని కార్యకలాపాలు ఇంగ్లీష్‌లో ఉండాలి. ఏదైనా వివాదం వస్తే ఇంగ్లీష్ వెర్షన్‌కే ప్రాధాన్యత ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa