ఢాకాలో ఇస్లామిక్ ర్యాడికల్ గుంపును నియంత్రించడంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పూర్తి విఫలమైంది. మైనార్టీలపై దాడులు, వేర్పాటువాద మూక విధ్వంసాన్ని అడ్డుకోలేకపోయినందుకు ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ ముఖ్య అనుచరుడు, మీడియా సలహాదారు షఫీకుల్ ఆలం క్షమాపణలు చెప్పారు. రాత్రంతా అల్లకల్లోలం సృష్టించి, దినపత్రికల కార్యాలయాలను, సాంస్కృతిక కేంద్రాలను తగలబెట్టారని, వీటిని నియంత్రించడంలో విఫలమైనందుకు సిగ్గుపడుతున్నానని ఆయన అన్నారు. ‘నాకు నేనుగా గొయ్యి తవ్వుకుని స్వీయ సమాధి అయితే బాగుండు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాడికల్స్ పట్ల మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించింది. ఛత్ర శిబిర్ వంటి గ్రూపులకు చెందిన మూకల నిరసనలకు ధైర్యం ఇచ్చింది. ‘‘నిన్న రాత్రి, ది డైలీ స్టార్, ప్రోథోమ్ అలోలోని నా జర్నలిస్ట్ మిత్రుల నుంచి సహాయం కోసం కన్నీటితో నిండిన కాల్స్ వచ్చాయి.. కానీ, వారికి ఎటువంటి సహాయం చేయలేకపోయినందుకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను. సహాయం కోసం ప్రయత్నించి, డజన్ల కొద్దీ కాల్స్ చేశాను.. కానీ అది సకాలంలో జరగలేదు’’ అని షఫీకుల్ ఆలం తన ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్ట్‌లో తెలిపారు.
‘‘డైలీ స్టార్ కార్యాలయంలో చిక్కుకున్న జర్నలిస్ట్‌లందరూ సురక్షితంగా బయటపడినట్టు తెలియడంతో ఉదయం 5 గంటలకు నిద్రపోయాను. .అయితే, అప్పటికే ఆ రెండు వార్తాపత్రికలు దేశంలో మీడియా సంస్థలపై జరిగిన అత్యంత దారుణమైన మూకదాడులు, అగ్నిప్రమాదాలలో ఒకదానిని ప్రత్యక్షంగా అనుభవించాయి’’ అని అన్నారు. ‘‘ఒక మాజీ జర్నలిస్టుగా తాను విచారిస్తున్నాను.. సిగ్గుతో నాకు నేనే గొయ్యి తవ్వుకుని సమాధి కావాలి కోరుకుంటున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ అల్లకల్లోలంలో కూరుకుపోతుండగా.. ఇస్లామిస్ట్ రాడికల్స్ పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. ఢాకా సహా దేశంలోని ఇతర ప్రాంతాలలో మీడియా, సాంస్కృతిక కేంద్రాలపై దాడులు జరుగుతున్నాయి. భారత్ పొరుగున ఉద్భవిస్తున్న ‘కొత్త పాకిస్థాన్’ గురించి ఈశాన్య భారతదేశానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఈశాన్య భారతదేశం గురించి బంగ్లాదేశ్ నాయకులు చేస్తోన్న ప్రకటనలకు వ్యతిరేకంగా ఆ దేశ హైకమిషన్ ఎదుట నిరసన తెలిపిన రాజకీయ పార్టీలు కేవలం తిప్రా మోథా, వైటీఎఫ్ మాత్రమే..రాజకీయ ప్రత్యర్థులారా మేల్కొనండి; మన నిజమైన పోరాటం ఒకరికొకరం కాదు, కొత్త మినీ-పాకిస్థాన్ (బంగ్లాదేశ్)కు వ్యతిరేకంగా ఉండాలి’ అని తిప్రా మోథా ప్రదోయత్ వ్యవస్థాకుడు పిలుపునిచ్చారు.
విద్యార్ధి నేత షరీఫ్ ఉస్మాన్ హాడీపై హత్యపై నిరసన నెపంతో ఇస్లామిక్ ర్యాడికల్స్ వార్తాపత్రికల ఆఫీసులు, సాంస్కృతిక కేంద్రాలు, మైనార్టీలను లక్ష్యంగా చేసుకోవడం, వీధులను తమ అధీనంలోకి తీసుకుంటుండటంతో యూనస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఈ పరిణామాలు యూనస్ ప్రభుత్వం పరిస్థితులపై పట్టు కోల్పోతోందని కూడా స్పష్టం చేస్తున్నాయి.
నిన్న రాత్రి జరిగిన హింసాత్మక ఘటనల్లో ఛాయానాట్ ధ్వంసం షాకింగ్ విషయం. 1960లలో స్థాపించిన ఛాయానాట్, 1971 నాటి యుద్ధంలో కూడా తట్టుకుంది. అప్పటి పాక్ ఆక్రమణదారులు కూడా దీన్ని నాశనం చేయలేకపోయారు. మరి ఈరోజు బంగ్లాదేశ్‌లో ఎలాంటి శక్తి ఛాయానాట్ను ధ్వంసం చేసింది? ఈ ఘటనకు, ఉస్మాన్ హాదీ మరణానికి సంబంధం ఏమిటి? అని బంగ్లాదేశ్ జర్నలిస్ట్, రచయిత షాహిదుల్ హసన్ ఖోకాన్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
ఛాయానాట్ అనేది బెంగాలీ సంస్కృతికి అంకితమైన ఒక సంస్థ. ఇది 1961లో స్థాపించారు. పాకిస్థాన్ పాలనలో ఉన్నప్పుడు, బెంగాల్ సాంస్కృతిక, సంగీత వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, పోషించడానికి దీన్ని ఏర్పాటు చేశారు. ఛాయానాట్ ఏటా బెంగాలీ నూతన సంవత్సరం, పోయిలా బోయిషాఖ్‌ను జరుపుకోవడానికి కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa