ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌తో యుద్ధం 200 ఏళ్ల కిందటే మొదలైంది.. హాడీ సోదరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు

international |  Suryaa Desk  | Published : Mon, Dec 22, 2025, 09:48 PM

భారత వ్యతిరేక ఇస్లామిక్ ర్యాడికల్ నేత షరీఫ్ ఉస్మాన్ హాడీ మరణంతో మరోసారి బంగ్లాదేశ్‌లో హింస చెలరేగింది. గతవారం ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హాడీ.. సింగ్‌పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంగతి తెలిసిందే. గతేడాది రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ యువత చేపట్టిన ఉద్యమంలో ఉస్మాన్ హాడీ కీలకంగా వ్యవహరించాడు. ప్రస్తుతం ఇంక్విలాబ్ మంచ్‌కు అధికార ప్రతినిధిగా కొనసాగుతోన్న అతడు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఢాకా-8 బిజోయ్‌నగర్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా హత్యాయత్నం జరిగింది. తాజాగా, హాడీ సోదరి భారత్‌పై బెదిరింపులకు పాల్పడ్డారు.


 హాడీ సోదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఈ నిరసనలు తీవ్ర భారత్ వ్యతిరేక విధానాన్ని సంతరించుకున్నాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుతున్న ఒక వీడియోలో.. ఆమె ‘భారత్‌తో పోరాటాని’కి లింగ, వయో బేధం లేకుండా, పిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జిహాదీ శిక్షణ ఇవ్వాలని ఆమె పిలుపునిచ్చింది.


‘భారత్‌తో పోరాడటానికి లింగ, వయోబేధం లేకుండా సిల్లలతో సహా ప్రతి ఇంట్లోనూ జీహాదీ శిక్షణ ఇవ్వాలి’ అని పేర్కొంది. ఇదే సమయంలో భారతీయ స్వాతంత్య్ర సమరయోధులతో పోల్చుకుంటూ ‘నేను ఖుదీరామ్ బోస్ లేదా ఆజాద్‌లను చూడలేదు.. కానీ, నేను ఉస్మాన్ హాడీని చూశాను.. హాడీ విప్లవ నాయకుడు’ అని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో భారత్‌పై ఆమె ప్రత్యక్షంగా బెదిరింపులకు పాల్పడ్డారు. ‘బంగ్లాదేశీయులమైన మేము భారతీయ కుక్కలను పూర్తిగా తరిమికొట్టే వరకూ వరకూ విశ్రమించం.. ఈ యుద్ధం 200 ఏళ్ల కిందటే మొదలైంది.. అవామీ లీగ్ (షేక్ హసీనా పార్టీ), భారత్‌లు మన దేశంలో ఎన్నికలు జరగకూడదని కోరుకుంటున్నాయి’ అని హాడీ సోదరి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.


ఇప్పటికే బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావజాలాన్ని ఈ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయి. హాడీపై కాల్పులు జరిపిన వ్యక్తి భారత్‌కు పారిపోయారని, వారికి న్యూఢిల్లీ ఆశ్రయం కల్పిస్తోందని బంగ్లా రాజకీయ నాయకులు, ఆందోళనకారులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. వీటికి ఎలాంటి ఆధారాలు లేకపోయినా కానీ భారత్ పట్ల శత్రుత్వాన్ని తీవ్రతరం చేశాయి. ఇప్పటికే హిందువులు సహా మైనార్టీలపై దాడులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. దైవదూషణ ఆరోపణలతో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను మూక కొట్టి చంపి, చెట్టుకు వేలాడదీసి నిప్పంటించింది.


ప్రస్తుత అశాంతి బంగ్లాదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న ఒక విస్తృత మార్పును ప్రతిబింబిస్తోంది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత చైనా, పాకిస్థాన్‌లకు మరింత దగ్గరవుతోంది. చైనా ఆ దేశంతో తన ఆర్థిక మరియు రాజకీయ ప్రభావాన్ని గణనీయంగా విస్తరించింది. అదే సమయంలో పాక్ గూఢచార సంస్థ ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి భారత వ్యతిరేక కథనాలను పెంచి పోషిస్తున్నట్లు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa