2025లో భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది. జపాన్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం విశేషం. అంతేకాకుండా గత కొన్నేళ్లుగా అంతరిక్ష రంగంలో కీలక మిషన్లు చేపడుతున్న భారత్.. ఈ ఏడాదిలో సొంతంగా ఉపగ్రహాలను జోడించే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని సాధించడం.. క్రికెట్లో అటు పురుషులు, ఇటు మహిళలు ప్రపంచ కప్‌లను కైవసం చేసుకోవడం వంటి ఎన్నెన్నో అద్భుతాలు ఈ ఏడాది చోటు చేసుకున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో రక్షణ, మౌలిక సదుపాయాల రంగాల్లోనూ మన దేశం ప్రపంచ దేశాల్లో మేటిగా నిలిచింది.
ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ
భారత ఆర్థిక రథం పరుగులు పెడుతోంది. 2025లో భారత్ నామినల్ జీడీపీలో జపాన్ను అధిగమించి ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. సుమారు 6.5 శాతం వృద్ధి రేటును సాధించింది. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు), యూపీఐ ద్వారా జరిగిన భారీ ఎత్తున డిజిటల్ ట్రాన్సాక్షన్లు భారత విజయానికి ప్రధాన కారణం.
అంతరిక్షంలో అద్భుతం.. స్పాడెక్స్ ప్రయోగం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ఈ ఏడాది మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే జనవరి 16వ తేదీన అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను ఒకదానికొకటి విజయవంతంగా జోడించే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పాడెక్స్) ప్రయోగాన్ని చేపట్టింది. ఇక అంతరిక్షంలో భారత్ సొంతంగా స్పేస్ స్టేషన్‌ను నిర్మించుకోవడానికి ఇది అత్యంత కీలకమైన అడుగుగా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) చేరుకున్న తొలి ఇస్రో వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు. ఆక్సియమ్-4 మిషన్‌లో భాగంగా శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల పాటు ఉండి.. పలు కీలక ప్రయోగాలు నిర్వహించి తిరిగి భూమిపైకి విజయవంతంగా చేరుకున్నారు.
గ్లోబల్ ఏఐ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం
ప్రపంచ దేశాల్లో కెల్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోంది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ ప్రకారం.. అమెరికా, చైనా తర్వాత గ్లోబల్ ఏఐ ర్యాంకింగ్స్‌లో భారత్ 3వ స్థానానికి చేరుకుంది. దేశీయంగా సెమీకండక్టర్ తయారీ, ఏఐ స్టార్టప్‌ల వెల్లువ ఈ వృద్ధికి నిదర్శనంగా నిలిచింది.
నావికా దళంలో మూడు మహా నౌకల చేరిక
భారత నౌకాదళ శక్తిని పెంచుతూ ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. అత్యాధునిక స్టీల్త్ ఫ్రిగేట్ అయిన ఐఎన్ఎస్ నీలగిరి (INS Nilgiri).. శక్తివంతమైన స్టీల్త్ డిస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ (INS Surat).. స్కోర్పిన్ క్లాస్ జలాంతర్గామి అయిన ఐఎన్ఎస్ వాఘ్షీర్ (INS Vagsheer)లు ఇండియన్ నేవీకి అప్పగించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్
దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా క్రికెట్ జట్టు.. న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీని దక్కించుకుంది. ఇది భారత్‌కు లభించిన 3వ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కావడం విశేషం.
మహిళా క్రికెట్ ప్రపంచ కప్ కైవసం
మహిళల క్రీడల్లో 2025 గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. నవీ ముంబైలో జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత మహిళల జట్టు తొలిసారిగా టైటిల్‌ను ముద్దాడింది. షెఫాలీ వర్మ, దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో భారత్ చరిత్ర సృష్టించింది.
రైల్వేలలో 100 శాతం విద్యుదీకరణ
పర్యావరణహిత రవాణా దిశగా భారత్ ఈ ఏడాది భారీ విజయాన్ని నమోదు చేసింది. 2025 మార్చి నాటికి దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో బ్రాడ్ గేజ్ నెట్వర్క్ 100 శాతం విద్యుదీకరణ పూర్తి చేసుకుంది. దీనివల్ల దేశంలో కర్బన ఉద్గారాలను భారీగా తగ్గించవచ్చు.
నేషనల్ బయోఫౌండ్రీ నెట్వర్క్ ప్రారంభం
బయోటెక్నాలజీ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశంలోనే తొలి నేషనల్ బయోఫౌండ్రీ నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇది వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయంతోపాటు.. కొత్త రకపు ఔషధాల తయారీకి ఉపయోగపడనుంది.
నీరజ్ చోప్రా 90 మీటర్ల రికార్డు
భారత అథ్లెటిక్స్ దిగ్గజం నీరజ్ చోప్రా.. తన చిరకాల వాంఛను ఈ ఏడాదిలోనే నెరవేర్చుకున్నారు. దోహా డైమండ్ లీగ్‌లో ఈటెను 90.23 మీటర్ల దూరం విసిరి.. 90 మీటర్ల మార్కును దాటిన తొలి భారతీయుడిగా సరికొత్త నేషనల్ రికార్డును నెలకొల్పారు. 2025లో భారత్ సాధించిన ఈ విజయాలు వికసిత భారత్ 2047 లక్ష్యానికి బలమైన పునాదిని వేశాయి. ప్రపంచ వేదికపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa