న్యూజిలాండ్‌లో సిక్కులు చేపట్టిన మతపరమైన ర్యాలీ (నగర్ కీర్తన)ని రైట్ వింగ్ అడ్డుకోవడం వివాదాస్పదమపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలలో, నీలం రంగు టీ-షర్టులు ధరించిన కొందరు వ్యక్తులు గ్రేట్ సౌత్ రోడ్‌లో నిలబడి, సాంప్రదాయ మావోరీ 'హకా' ప్రదర్శిస్తూ ఊరేగింపును అడ్డుకోవడం కనిపించింది. ఈ ఆందోళనకారులు పెంతకోస్టల్ పాస్టర్ బ్రియాన్ అనుచరులని చెబుతున్నారు. వారు "ఒకే నిజమైన దేవుడు" ‘యేసు-యేసు’ అని నినాదాలు చేశారు. ఈ ఘర్షణ సమయంలో పోలీసులు ఇరువర్గాలను అడ్డుకుని పరిస్థితి అదుపుతప్పకుండా జాగ్రత్తపడ్డారు.
తమ అనుచరులు ప్రదర్శించిన హకా ద్వారా ‘న్యూజిలాండ్‌ను న్యూజిలాండ్‌గా ఉంచండి’ అనే సందేశాన్ని స్పష్టంగా చెప్పామని తమాయ్ అనే వ్యక్తి ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ‘మానరేవాలోని కొన్ని ప్రాంతాలు గంటల తరబడి సిక్కులు, ఖలిస్థన్ తీవ్రవాదులతో స్తంభించిపోయాయి.. వారు కత్తులు, బాకులు ధరించి, విదేశీ, తీవ్రవాద జెండాలు ఎగురవేశారు. మేము దేశానికి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేశాం: ఇది న్యూజిలాండ్. ఇవి మా వీధులు. ఇది మా భూమి’" అని అతడు ఆరోపించారు. అయితే, ఆయన తన వాదనలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు.
హకా అనేది మావోరీ సంస్కృతిలో ఒక భాగం. ఇది గుర్తింపు, గర్వం, ఐక్యతను సూచిస్తుంది. సాధారణంగా ఒక సమూహం కలిసి చేసే నృత్యం. అయితే, ర్యాలీ నిర్వాహకులు తాము అనుమతులు తీసుకున్నామని, అడ్డుకోవడం దారుణమని అన్నారు.ఈ ఘటనపై న్యూజిలాండ్ రాజకీయ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమాయ్‌ను, ఆయన అనుచరులను విమర్శిస్తూ సిక్కు సమాజానికి మద్దతు తెలిపారు. న్యూజిలాండ్ ఎంపీ ప్రియాంక రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. ఇక్కడ 300కు పైగా భాషలు మాట్లాడేవారు, అనేక మతాలకు చెందినవారు ఉన్నారని, వారు అనేక సంప్రదాయాలను, పండుగలను ఈ దేశానికి తెచ్చారని పేర్కొన్నారు. ‘ఉదాహరణకు సిక్కులు, 1800ల చివరి నుంచి ఇక్కడ ఉన్నారు. కాబట్టి, ఒక వ్యక్తి, అతడి అనుచరులు ఎవరు కివీనో, ఏది 'కివీ జీవన విధానమో' నిర్ణయించగలమని అనుకోవడం చాలా హాస్యాస్పదం’ అని ఆమె మండిపడ్డారు.
ఇలాంటి ప్రవర్తన ఇతర సమూహాలను దూరం చేస్తుందని, వారిని తక్కువగా చూసేలా చేస్తుందని ఆమె హెచ్చరించారు. ‘ఇది చాలా ప్రమాదకరమైనది,ఇటువంటి వాటిని అనుమతించకూడదు’ అని ఆమె అన్నారు. మరో న్యూజిలాండ్ ఎంపీ ఒరిని కైపారా కూడా ఈ ఘటనను విమర్శించారు. ఆక్లాండ్‌కు చెందిన విద్యావేత్త హర్‌ప్రీత్ సింగ్ ‘మా కోసం, మా భూమి కోసం నిజంగా శ్రద్ధ వహించే మా టంగాటా వెనువా, మా టంగాటా మోవానా, టంగాటా తిరిటి కోసం మీరు స్థలాన్ని సృష్టించినందుకు ధన్యవాదాలు. ఒక వ్యక్తి, అతడిని నమ్మే వారి చర్యలు మా పట్ల మీ అవగాహన, కరుణకు ధన్యవాదాలు.. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మేము సిక్కులుగా, అలాగే న్యూజిలాండ్‌వాసులుగా మీతో ఉన్నాం’ అని పేర్కొన్నారు.
ఈ ఘటనపై భారత్‌లోనూ కలకలం రేగింది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్, న్యూజిలాండ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని ప్రస్తావించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉందని, పంజాబీలు కష్టపడి పనిచేసేవారని, వారు ఎక్కడికి వెళ్లినా ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడతారని సీఎం మాన్ అన్నారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ ప్రభుత్వంతో లేవనెత్తి, భారతీయ జనాభా హక్కులను రక్షించడానికి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి బలమైన చర్యలు తీసుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రి . జైశంకర్‌ను బాదల్ కోరారు.
దీనిపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ స్పందిస్తూ.. సిక్కుల సంప్రదాయాలను ద్వేషపూరిత దృష్టితో చూడటం అత్యంత ఖండించదగినదని, నగర్ కీర్తన్ అడ్డుకోవడం దీనికి ఉదాహరణ అని మండిపడింది. సిక్కు మతం పునాది ‘సర్బత్ దా భలా’ (అందరి సంక్షేమం), సోదరభావం, మానవ సేవ సూత్రాలపై ఆధారపడి ఉందని ప్రబంధక్ కమిటీ అధ్యక్షుడు ధామి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa