వయసు 30 దాటిందంటే చాలు శరీరంలో మెల్లమెల్లగా మార్పులు మొదలవుతాయి. మునుపటి ఉత్సాహం తగ్గడం, త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా 35 ఏళ్లు పైబడిన వారు తమ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోకపోతే త్వరగా ముసలితనం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ పీడియాట్రిషియన్, నియోనాటాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ యలమూడి హెచ్చరిస్తున్నారు. వయస్సు 30ల్లోకి వచ్చాక కొన్నింటిని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని లేదంటే చాలా బాధపడతారని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
కండరాల పుష్టి చాలా ముఖ్యం
సాధారణంగా 35 ఏళ్ల తర్వాత శరీరంలో కండరాల సాంద్రత క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే శరీరం బలహీనపడి త్వరగా ముసలితనం వచ్చేస్తుంది. అందుకే ప్రతిరోజూ కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా బరువులు ఎత్తే వెయిట్ ట్రైనింగ్ వంటివి చేయడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి. మీ శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి
శరీరానికి సరైన మొత్తంలో ప్రోటీన్ అందకపోతే అది నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. డాక్టర్ గౌతమ్ యలమూడి చెబుతున్న దాని ప్రకారం.. ప్రతి వ్యక్తి తన శరీర బరువులో కిలోకు కనీసం ఒక గ్రాము ప్రోటీన్ ప్రతిరోజూ తీసుకోవాలి. ఒకవేళ ప్రోటీన్ లోపిస్తే విపరీతమైన అలసట వస్తుంది. జుట్టు రాలడం, పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీ ఆహారంలో పప్పులు, గుడ్లు, పాలు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి.
నిద్ర విషయంలో అశ్రద్ధ వద్దు
సరైన నిద్ర లేకపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. రాత్రి 11 గంటల లోపు నిద్రపోయేలా అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం 8 గంటల గాఢ నిద్ర అవసరం. ఇలా నిద్రపోని పక్షంలో శరీరంలో టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా రోజంతా నీరసంగా అనిపించడం, ఏ పనిపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
చక్కెర, జంక్ ఫుడ్‌కు దూరం
బయట దొరికే జంక్ ఫుడ్స్, అధికంగా చక్కెర ఉండే పదార్థాలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అస్తవ్యస్తం అవుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారి తీస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ప్రాసెస్ చేసిన ఆహారానికి బదులు ఇంట్లో వండిన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.
నడకను అలవాటు చేసుకోండి
శారీరక శ్రమ లేకపోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది. రోజుకు కనీసం 10 వేల అడుగులు అంటే సుమారు 7 నుంచి 8 కిలోమీటర్లు నడవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరం రోజంతా ఉల్లాసంగా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa