ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక పక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన 'రాష్ట్ర ప్రేరణ స్థల్' ప్రారంభోత్సవం జరుగుతుంటే.. మరోపక్క సామాన్య జనం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే కార్యక్రమం ముగిసి ప్రధాని అక్కడి నుంచి వెళ్లిన కొద్ది గంటల్లోనే.. రోడ్ల అలంకరణ కోసం ఏర్పాటు చేసిన వేల సంఖ్యలో పూల కుండీలను స్థానికులు ఎత్తుకెళ్లారు.
4,000 కుండీలు మాయం.. కటౌట్లు కూడా వదల్లేదు!
లక్నో డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యానవన శాఖ అందించిన సమాచారం ప్రకారం.. రోడ్ల వెంబడి అలంకరించిన సుమారు 4,000 కంటే ఎక్కువ పూల కుండీలను జనం దొంగిలించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు తమ ద్విచక్ర వాహనాలపై కుండీలను పెట్టుకుని వెళ్తుండగా.. మరికొందరు కాలినడకన ఒకటి కంటే ఎక్కువ కుండీలను మోసుకెళ్తూ కనిపించారు. విచిత్రం ఏమిటంటే.. కేవలం మొక్కలే కాకుండా అక్కడ ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కటౌట్లను కూడా జనం వదలకుండా తీసుకెళ్లడం గమనార్హం.
లక్నో ఎంపీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి సమక్షంలో ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ 'రాష్ట్ర ప్రేరణ స్థల్' ఎంతో ప్రత్యేకమైనది. సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో.. రూ. 230 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇందులో అటల్ బిహారీ వాజ్‌పేయితో పాటు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయల 65 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేశారు. అలాగే దేశ నిర్మాణం కోసం వారు చేసిన కృషిని వివరించేలా 98,000 చదరపు అడుగుల్లో 'తామర పువ్వు' ఆకారంలో ఒక అద్భుతమైన మ్యూజియాన్ని కూడా నిర్మించారు.
వాజ్‌పేయి వారసత్వానికి గౌరవం
1991 నుంచి 2004 వరకు లక్నో లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు వరుసగా గెలిచిన వాజ్‌పేయికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప నివాళి. మూడుసార్లు ప్రధానిగా పని చేసి, పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. అలాంటి మహనీయుడి స్మారకార్ధం నిర్మించిన ఈ కేంద్రం వద్ద.. క్రమశిక్షణ పాటించాల్సిన జనం ఇలా పూల కుండీల కోసం ఎగబడటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీదైన ప్రాజెక్టులు నిర్మిస్తున్నా.. పౌరుల్లో కనీస బాధ్యత లేకపోవడమే ఈ తరహా ఘటనలకు కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa