విదేశాల్లో ఉద్యోగాలు, ఉన్నత చదువుల కోసం వెళ్తున్న భారతీయులకు 2025 సంవత్సరం గడ్డుకాలంగా మారింది. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రాజ్యసభలో సమర్పించిన గణాంకాలు విదేశాల్లోని భారతీయుల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గత 12 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 81 దేశాల నుంచి ఏకంగా 24,600 మంది భారతీయులు బహిష్కరణకు గురై స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఇందులో ఏ దేశం నుంచి ఎక్కువ మంది తిరిగి భారత దేశానికి వచ్చారో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే వచ్చింది అమెరికా నుంచి కాదు. మరో గల్ఫ్ దేశం నుంచి. అదేంటంటే?
సాధారణంగా అమెరికా నుంచే ఎక్కువ బహిష్కరణలు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ ఈ ఏడాది సౌదీ అరేబియా రికార్డు స్థాయిలో 11,000 మంది భారతీయులను వెనక్కి పంపింది. ఇక అమెరికా విషయానికి వస్తే.. 2025లో 3,800 మంది భారతీయులు బహిష్కరించింది. గత ఐదేళ్లలో అమెరికా నుంచి ఈ స్థాయిలో బహిష్కరణలు జరగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, వీసా పత్రాల క్షుణ్ణమైన తనిఖీలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్ నగరాల నుంచే ఎక్కువ మందిని వెనక్కి పంపినట్లు నివేదిక వెల్లడించింది.
బహిష్కరణలకు ప్రధాన కారణాలివే..
గల్ఫ్ దేశాల నుంచి బహిష్కరణకు గురవుతున్న వారిలో మెజారిటీ కార్మికులు, గృహ సహాయకులు, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులే ఉంటున్నారు. వీరిపై వేటు పడటానికి ప్రధాన కారణాలు.. వీసా లేదా రెసిడెన్సీ పర్మిట్ గడువు ముగిసినా అక్కడే ఉండటం. అలాగే చెల్లుబాటు అయ్యే వర్క్ పర్మిట్ లేకుండా పనిచేయడం. ఇది మాత్రమే కాకుండా కార్మిక నిబంధనలు పాటించకపోవడం, యజమానుల వద్ద నుంచి పారిపోవడం కూడా కారణమే. స్థానిక చట్టాలపై సరైన అవగాహన లేకపోవడం, ఏజెంట్ల చేతిలో మోసపోవడం వల్ల కూడా చాలా మంది కటకటాల పాలవుతున్నారు.
ఇక మయన్మార్ నుంచి 1,591 మంది, యూఏఈ నుంచి 1,469 మంది, మలేషియా నుంచి 1,485 మంది బహిష్కరణకు గురయ్యారు. ముఖ్యంగా మయన్మార్, కంబోడియా దేశాల నుంచి జరుగుతున్న బహిష్కరణల వెనుక "సైబర్ స్లేవరీ" కోణం ఉందని తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ భీమ్ రెడ్డి తెలిపారు. అధిక వేతనాల పేరుతో భారతీయులను ఆకర్షించి.. అక్కడికి వెళ్లాక అక్రమ ఆన్లైన్ కార్యకలాపాలు చేయిస్తున్నారని, చివరకు పోలీసులు దాడులు చేసినప్పుడు మనవారు పట్టుబడి బహిష్కరణకు గురవుతున్నారని ఆయన వివరించారు.
మరోవైపు భారతీయ విద్యార్థుల బహిష్కరణలో బ్రిటన్ (UK) అగ్రస్థానంలో ఉంది. 2025లో యూకే నుంచి 170 మంది విద్యార్థులను వెనక్కి పంపించగా.. ఆస్ట్రేలియా 114 మందిని, రష్యా 82 మందిని, అమెరికా 45 మంది విద్యార్థులను తిరిగి ఇంటికి పంపింది. ఈక్రమంలోనే విదేశాలకు వెళ్లేవారు వీసా గడువులను నిరంతరం ట్రాక్ చేస్తూ.. స్థానిక నిబంధనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa