ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసిమ్ మునీర్‌ను వణికిస్తున్న 'ధురందర్' సినిమా

international |  Suryaa Desk  | Published : Sat, Dec 27, 2025, 10:38 PM

పాకిస్థాన్ సైనిక నియంత, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం ఒక విచిత్రమైన భయంలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత సైన్యం జరిపిన 'ఆపరేషన్ సింధూర్' దెబ్బకు విలవిలలాడిన పాక్.. ఇప్పుడు చైనా నుండి ఐదో తరం యుద్ధ విమానాలు, టర్కీ నుంచి క్షిపణి రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేస్తోంది. భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణుల నుంచి రక్షణ పొందేందుకు ఆయన వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ సరిహద్దుల అవతల నుంచి దూసుకొస్తున్న మరో శక్తివంతమైన ఆయుధానికి మునీర్ దగ్గర ఎలాంటి విరుగుడు లేదు. అదే.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'ధురందర్'.


'ఉరి' సినిమాతో సంచలనం సృష్టించిన ఆదిత్య ధర్.. ఈ చిత్రంలో పాకిస్థాన్ 'డీప్ స్టేట్' (సైన్యం-ఐఎస్ఐ కూటమి) ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తోందో కళ్లకు కట్టినట్లు చూపించారు. 2000వ దశకంలో కరాచీని శాసించిన రెహమాన్ దకైత్, ఉజైర్ బలోచ్ వంటి మాఫియా డాన్లతో పాక్ సైన్యానికి ఉన్న అక్రమ సంబంధాలను ఈ సినిమా బయటపెట్టింది. అమృత్‌సర్, బ్యాంకాక్ వంటి ప్రాంతాల్లో చిత్రీకరించినప్పటికీ.. కరాచీ అండర్‌వరల్డ్ నరకాన్ని ఈ సినిమా వెండితెరపై ఆవిష్కరించింది.


 పాక్ ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించినప్పటికీ.. ఆ దేశంలోని కోట్లాది మంది ప్రజలు దీనిని ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ చిత్రంలోని పాటలు పాకిస్థాన్‌లో వైరల్ అవుతున్నాయి. "పాకిస్థాన్ తన పెరట్లో పాములను పెంచుతోందని.. అవి ఇరుగుపొరుగు వారిని మాత్రమే కరుస్తాయని అనుకోకూడదని.. ఒకరోజు అవే పాములు యజమానిని కూడా మింగేస్తాయి" అని 2011లో హిల్లరీ క్లింటన్ అన్న మాటలను ఈ సినిమా గుర్తు చేస్తోంది.


బాలీవుడ్ అంటే పాక్ నియంతలకు ఎప్పుడూ భయమే. 2004లో అప్పటి నియంత పర్వేజ్ ముషార్రఫ్ కూడా ఐశ్వర్యరాయ్ వంటి నటీనటులకు "పాక్ వ్యతిరేక సినిమాల్లో నటించకండి" అని ఉచిత సలహాలు ఇచ్చారు. కార్గిల్ యుద్ధం, 26/11 ముంబై దాడులు, పార్లమెంటుపై దాడి వెనుక ఉన్న పాక్ సైనిక కుట్రలను బాలీవుడ్ ఇప్పుడు నిర్మొహమాటంగా ఎండగడుతోంది. ఒకప్పుడు 'అమన్ కీ ఆశా' వంటి ముసుగులో పాక్ తన తప్పులను కప్పిపుచ్చుకునేది.. కానీ 'ధురందర్' ఆ ముసుగును చించేసింది.


వచ్చే ఏడాది మార్చిలో రాబోతున్న ఈ సినిమా రెండో భాగం... పాక్ సైన్యంలోని ఒక ఉన్నత స్థాయి జనరల్ అసలు ముఖాన్ని బయటపెట్టబోతోందని సమాచారం. గతంలో భారత్‌పై ఉగ్రదాడులు చేయించిన జావేద్ నాసిర్, హమీద్ గుల్ వంటి జనరల్స్ చరిత్రను ఇది గుర్తు చేయబోతోంది. మొత్తానికి పాక్ కొంటున్న చైనా యుద్ధ విమానాలు సరిహద్దుల్లో పని చేస్తాయేమో కానీ.. సామాన్యుల గుండెల్లోకి చొచ్చుకుపోతున్న ఈ 'సినిమా ఆయుధం' ముందు ఆసిమ్ మునీర్ నిస్సహాయుడిగా మారిపోయారని తెలుస్తోంది. నిత్యం తన అసలు రంగు బయటపడుతుందేమోనని గజగజా వణికిపోతున్నట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa