ఇరాన్ ఇప్పుడు ఒక యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా సాగుతున్న ప్రజా నిరసనలను అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన హింసాత్మక చర్యల్లో ఇప్పటి వరకు 2,571 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 2,403 మంది నిరసనకారులు కాగా.. 147 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే.. ఈ అల్లర్లతో ఏమాత్రం సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది సాధారణ పౌరులు కూడా తూటాలకు బలయ్యారు. సుమారు 18,000 మందిని భద్రతా బలగాలు అక్రమంగా అరెస్టు చేసినట్లు మానవ హక్కుల సంస్థలు వెల్లడించాయి.
స్తంభించిన జనజీవనం, నిఘా నీడలో టెహ్రాన్
ప్రస్తుతం ఇరాన్లో ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం ప్రభుత్వ వెబ్సైట్లు మాత్రమే పని చేస్తుండటంతో బ్యాంకింగ్ లావాదేవీలు స్తంభించాయి. టెహ్రాన్ వీధుల్లో హెల్మెట్లు, బాష్పవాయు గోళాలు, ఆయుధాలు ధరించిన భద్రతా బలగాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ప్రజలు బయటి ప్రపంచంతో కమ్యూనికేట్ చేయకుండా ఉండేందుకు 'స్టార్‌లింక్' డిష్‌ల కోసం సైన్యం ఇళ్లను జల్లెడ పడుతోంది. ప్రభుత్వ ఒత్తిడితో కొన్ని దుకాణాలు తెరిచినా, కస్టమర్లు లేక బజార్లన్నీ వెలవెలబోతున్నాయి. పలుచోట్ల బ్యాంకులు, ఏటీఎంలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.
ఇరాన్లో జరుగుతున్న ఈ మారణహోమంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "హత్యలు ఆపేవరకు ఇరాన్ అధికారులతో నేను జరిపే అన్ని సమావేశాలను రద్దు చేస్తున్నాను" అని ఆయన ప్రకటించారు. అంతటితో ఆగకుండా నిరసనకారులను ఉద్దేశించి.. "ఇరాన్ పోరాట యోధులారా.. వెనకడుగు వేయకండి, సంస్థలను మీ ఆధీనంలోకి తీసుకోండి. మీకు అందాల్సిన సాయం దారిలోనే ఉంది" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అమెరికా సైనిక చర్యకు సంకేతమా అన్న చర్చ మొదలవ్వడంతో ఇరాన్ పౌరుల్లో ఆందోళన నెలకొంది.
శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై కాల్పులు ఆపాలని యూఎన్ మానవ హక్కుల చీఫ్ వోకల్ టర్క్ సూచించారు. అలాగే నోబెల్ విజేత మలాలా నిరసనకారులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇరాన్ దౌత్యవేత్తలపై నిషేధం విధిస్తామని ఈయూ హెచ్చరించగా.. ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ ప్రతి చర్య తప్పదని బదులిచ్చారు. మరోవైపు దేశంలో ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు భారీగా జరగడంపై సుప్రీం లీడర్ ఖమేనీ హర్షం వ్యక్తం చేస్తూ.. ఇది అమెరికాకు గట్టి హెచ్చరిక అని పేర్కొన్నారు. తాము అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, అయితే వారి హెచ్చరికలు తమకు ఆమోదయోగ్యం కాదని ఇరాన్ స్పష్టం చేసింది. అగ్రరాజ్యం జోక్యం చేసుకుంటుందన్న భయాల మధ్య ఇరాన్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa