ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ట్రంప్ ఓ వంచకుడు...మమ్మల్ని బలిపశువులను చేశాడు’ ఇరాన్ పౌరులు ఆగ్రహం

international |  Suryaa Desk  | Published : Sun, Jan 18, 2026, 08:49 PM

సుప్రీం లీడర్ఆయతుల్లా అలీ ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన ఇరానియన్లు.. తమకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ఆశాకిరణంలా కనిపించారు. కానీ, ఆయన మాటలకు, చేతలకు పొంతనలేకపోవడం వారిని తీవ్ర నిరాశకు గురిచేసింది. మొదట్లో నిరసనకారులను ప్రోత్సహించిన ట్రంప్.. శాంతియుత ప్రదర్శనకారులకు హాని జరిగితే అమెరికా సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తమకు గట్టి మద్దతు లభిస్తుందని, బహుశా సైనిక జోక్యం కూడా ఉంటుందని ఇరానియన్లు ఆశించారు. దీనికి అనుగుణంగా పెంటగాన్ ఒక ముఖ్యమైన అమెరికా స్థావరం నుంచి సిబ్బందిని తరలించడం వంటి వార్తలు యుద్ధ సన్నాహాలుగా భావించారు.


కానీ, ట్రంప్ అకస్మాత్తుగా తన వైఖరిని మార్చుకున్నారు. ఇరాన్ ప్రభుత్వం హింసను ఆపివేస్తుందని హామీ ఇచ్చిందని, సైనిక చర్య ఉండదని ాయన ప్రకటించారు. ప్రాణాలకు తెగించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులకు ఓ రకంగా ఇది పెద్ద షాక్. 15,000 మంది మరణాలకు ట్రంప్ బాధ్యుడని, ఎందుకంటే చాలా మంది నిరసనకారులు ఆయన ‘locked and loaded’ అనే పోస్ట్ చూసే వీధుల్లోకి వచ్చారని ఇరాన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆరోపించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌తో కలిసి ఇరాన్ పౌరులను ఇలా మోసం చేయడానికి అమెరికా ఓ ఒప్పందం చేసుకుని ఉంటుందని ఆయన దుయ్యబట్టారు.


ఇకపై హత్యలు, మరణశిక్షలు ఉండవని ఇరాన్ అదికారులు తనకు హామీ ఇచ్చారన్న ట్రంప్ ప్రకటనతో అంతా నిశ్చేష్టులయ్యారని దేశం విడిచి వెళ్లిన ఒక ఇరానియన్ తెలిపారు. ‘అందరూ ఆగ్రహంతో ఉన్నారు.. వారు మమ్మల్ని బలిపశువులుగా ఉపయోగించుకున్నారని అనుకుంటున్నారు.. తమను మోసం చేశారని, ఫూల్ చేశారని ఇరాన్ పౌరులు భావిస్తున్నారు.’ అని వ్యాఖ్యానించాడు.


ట్రంప్ మాటలను నమ్మి నిరసనల్లో పాల్గొన్నవారి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ‘ట్రంప్ తప్పు చేశాడు. మా కాళ్ల కింద నుంచి నేలను లాగేసుకున్నాడు... ఆయన ఊసరవెల్లి’ అని మరో టెహ్రాన్ పౌరుడు టైమ్ మ్యాగజైన్‌కు చెప్పారు. ట్రంప్ ప్రకటనలు ప్రజల నిరసన నిర్ణయాలను ప్రభావితం చేశాయని, కానీ అవసరమైన సమయంలో ఆ మద్దతు ఆవిరైపోయిందని వారు భావిస్తున్నారు. కొందరు తెరవెనుక ఒప్పందం జరిగిందని నమ్ముతున్నారు. మరికొందరు ఉదాసీనతను చూస్తున్నారు. అయిేత, కొద్దిమంది మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గడం ఒక వ్యూహాత్మక చర్య అని వాదిస్తున్నారు.


ఇరాన్‌లో తాజా నిరసనలు డిసెంబర్ చివరిలో ప్రారంభమయ్యాయి.కరెన్సీ పతనం, నిత్యావసరాలు, ద్రవ్యోల్బణం పెరుగుదల సహా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గతేడాది డిసెంబరు నుంచి ఇరాన్ పౌరులు నిరసనలకు దిగారు. మొదట్లో ఆర్థిక సమస్యలపై దృష్టి సారించిన నిరసనలు, రాజకీయ సంస్కరణలు, ప్రభుత్వ మార్పుల కోసం పిలుపులకు దారితీశాయి. తర్వాత ఇరాన్ బహిష్కృత యువరాజు రెజా పహ్లవి, ఇతర ప్రతిపక్ష వర్గాల మద్దతుతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీధుల్లోకి వచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa