క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ కీలక ముందడుగు వేయనుందని, 2026 జులై నాటికి దక్షిణాసియాలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఆవిష్కరించనున్నామని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఆయన పాల్గొన్నారు.నైపుణ్యాలు, సహకారంతో క్వాంటమ్ ఆవిష్కరణలను వేగవంతం చేయడంఅనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠిలో లోకేశ్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగమని తెలిపారు. 2024లో 1.3 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్, 2030 నాటికి 41.8 శాతం వార్షిక సగటు వృద్ధి రేటుతో 20 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే, ఈ రంగానికి అవసరమైన నిపుణుల్లో ప్రపంచవ్యాప్తంగా మూడింట ఒకవంతు మాత్రమే అందుబాటులో ఉన్నారని, ఈ నైపుణ్యాల అంతరాన్ని పూడ్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని లోకేశ్ నొక్కిచెప్పారు.ఐబీఎం, టీసీఎస్ భాగస్వామ్యంతో 133-క్విట్ హెరాన్ ప్రాసెసర్‌తో కూడిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ 2ను అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. ఇది భారతదేశంలోనే తొలి డెడికేటెడ్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్‌కు కేంద్రంగా ఉంటుందని తెలిపారు. 50 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ఇన్నోవేషన్ జిల్లాలో అంతర్జాతీయ స్థాయి పరిశోధన కేంద్రాలు, ప్రముఖ కంపెనీలతో కలిసి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు, 50 వేల మందికి పైగా శిక్షణ అందించే వ్యవస్థలను ఏర్పాటు చేస్తామన్నారు. 2026 జనవరి నాటికి 100 క్వాంటమ్ అల్గోరిథంలను, ఆగస్టు 15 నాటికి 100 క్వాంటమ్ వినియోగ కేసులను పరీక్షించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి, ప్రపంచానికి ఎగుమతి చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకెళుతున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.క్వాంటమ్ రంగంలో నైపుణ్యాల కొరతను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అమలు చేయనుందని లోకేశ్ వివరించారు. తొలి దశలో 10 లక్షల మందికి క్వాంటమ్ అక్షరాస్యత కల్పించడం, రెండో దశలో పరిశ్రమలకు అవసరమైన నిపుణులను తయారు చేయడం, మూడో దశలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా లక్ష మంది డెవలపర్లను సిద్ధం చేస్తామని తెలిపారు. భారత ప్రభుత్వం కూడా 'నేషనల్ క్వాంటమ్ మిషన్' ద్వారా రూ.6,000 కోట్లతో ఈ రంగాన్ని ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు.దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం గవర్నమెంట్ ఎఫైర్స్ హెడ్ మరూన్ ఖైరౌజ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏడాదిలోగా ఏపీలో డబ్ల్యూఈఎఫ్-సీ4ఐఆర్ ను కార్యాచరణలోకి తీసుకురావడంపై చర్చించారు. ఇంధన పరివర్తన, సైబర్ సెక్యూరిటీ, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఏపీ ప్రభుత్వం, డబ్ల్యూఈఎఫ్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సాధ్యమైనంత త్వరగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఖైరౌజ్ హామీ ఇచ్చారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి, చర్చలు వాస్తవ పెట్టుబడులుగా మారాలని ఆశిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa