ఝార్ఖండ్‌లో ఓ రైల్వే గేట్ వద్ద ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటు చేసుకుంది. గేట్ వేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టమూ సంభవించలేదు. ఆ యాక్సిడెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఝార్ఖండ్‌లోని దేవ్‌ఘర్ జిల్లాలోని నవాదిహ్ రైల్వే క్రాసింగ్ వద్ద ట్రాఫిక్ జామ్ కారణంగా ఓ భారీ ట్రక్కు.. రైలు పట్టాలపై నిలిచిపోయింది. అదే సమయంలో ఆ ట్రాక్ గుండా గోండా-అసన్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. ముందు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రక్కు ముందుకు వెళ్లలేక ట్రాక్ పైనే నిలిచిపోయింది. దీంతో ఆ రైలు, ట్రక్కు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. లోకో పైలెట్ త్వరగా స్పందించి రైలు వేగాన్ని తగ్గించారు. దీంతో ట్రక్కును ఢీకొట్టిన రైలు అక్కడే ఆగిపోయింది.ఈ ప్రమాదంలో ట్రక్కు పూర్తిగా దెబ్బతింది. రైలు ఇంజిన్ పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టమూ సంభవించలేదు. ఈ ప్రమాదం కారణంగా జసిడిహ్-అసన్సోల్ మార్గంలో రైలు రాకపోకలు రెండు గంటల పాటు నిలిచిపోయాయి. ఈ ఘటనపై నలుగురు సభ్యుల కమిటీ విచారణ చేయబోతున్నట్టు అసన్సోల్ రైల్వే డివిజన్ అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa