ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో అధ్యక్షుడి ఆకస్మిక పర్యటన.. పాకిస్థాన్‌కు షాకిచ్చిన యూఏఈ

international |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 08:20 PM

గతవారం భారత్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆకస్మిక పర్యటన‌ దక్షిణాసియా భౌగోళిక రాజకీయ సమీకరణాలను మలుపుతిప్పింది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు పరోక్షంగా ఎదురుదెబ్బ తగిలేలా చేసింది. షేక్ నహ్యాన్ మూడు గంటల పర్యటన తర్వాత.. ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే ప్రణాళికను యూఏఈ రద్దు చేసుకుంది. ఈ ఒప్పందం ఆగస్టు 2025 నుంచి చర్చల్లో ఉంది. దీనిని పాక్ పత్రిక ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ధ్రువీకరించింది. ఈ ప్రాజెక్టుపై అబుదాబి ఆసక్తి కోల్పోవడం, కార్యకలాపాలను ఔట్‌సోర్స్ చేయడానికి స్థానిక భాగస్వామిని పేర్కొనడంలో విఫలం కావడంతో ఈ ప్రణాళికను నిలిపివేసినట్లు నివేదించింది.


 పాక్ మీడియా నివేదిక ఈ ఒప్పందం రద్దును రాజకీయ కారణాలతో ముడిపెట్టలేదు. అయితే, ఇది యూఏఈ, సౌదీ అరేబియా మధ్య పెరుగుతున్న విభేదాల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఒకప్పుడు గల్ఫ్ దేశాల్లో అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉన్న రియాద్, అబుదాబి.. యెమెన్‌లో ప్రత్యర్థి వర్గాలకు మద్దతు విషయంలో బహిరంగంగా విభేదిస్తున్నాయి.


పాకిస్థాన్‌తో సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే, టర్కీతో కలిసి ‘ఇస్లామిక్ NATO’ను ఏర్పాటు చేయాలని సౌదీ కోరుకుంటోంది. మరోవైపు, పాక్ సైనిక నైపుణ్యంపై సౌదీ ఆధారపడుతుండగా.. భారత్‌తో యూఏఈ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకుంది. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట వరకు పాకిస్థాన్ అతిపెద్ద వాణిజ్య భాగస్వాములలో ఒకటిగా యూఏఈ ఉండేది. వివిధ రంగాల్లో వేలాది మంది పాకిస్థానీయులు పనిచేయడంతో విదేశీ మారక ద్రవ్యంకు కీలక వనరుగా ఉండేది. ఇరు దేశాలు రక్షణ, ఇంధనం, పెట్టుబడి ప్రాజెక్టులలో పరస్పరం సహకరించుకున్నాయి. కానీ, ఏళ్లు గడిచేకొద్దీ, పాకిస్థాన్‌లోని భద్రతా సమస్యలు, లైసెన్సింగ్ వివాదాలు, పాడుబడిన మౌలిక సదుపాయాల కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయి.


తాజాగా ఓ నివేదిక ప్రకార.. , పాకిస్థాన్‌లోని ప్రభుత్వ రంగ సంస్థలలో రాజకీయ జోక్యం వల్ల పేలవమైన పాలన,నిర్వహణ లోపాల కారణంగా భారీ నష్టాలు వస్తున్నాయని, ఆ తర్వాత అవి తక్కువ ధరలకు అమ్మకానికి పెడుతున్నారని తెలిపింది. పాకిస్థాన్ గతేడాది పాక్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ను ప్రైవేటీకరించింది. క్లిష్టమైన వాతావరణాలు, అఫ్గనిస్థాన్‌తో సహా విమానాశ్రయాలను నిర్వహించడంలో యూఏఈకి అనుభవం ఉన్నప్పటికీ, ఇస్లామాబాద్ విమానాశ్రయం నుంచి వైదొలగడం విశ్వాసం తగ్గినట్టు స్పష్టమవుతోంది.


దీనికి విరుద్ధంగా గత వారం ఢిల్లీ పర్యటన తర్వాత 900 మంది భారతీయ ఖైదీలను విడుదల చేయడానికి యూఏఈ అధ్యక్షుడు ఆమోదం తెలిపారు. ఇది భారత్ పట్ల గణనీయమైన సద్భావన చర్యగా పేర్కొన్నారు. భారత్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ పూర్తిస్థాయి ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించారు భారత్- యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పరిణితి చెందడమే కాకుండా, ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకమైన, బహుముఖ దశలోకి ప్రవేశించిందని అంగీకరించారు.


మోదీ- బిన్ జాయెద్ సమావేశం తర్వాత విడుదలైన సంయుక్త ప్రకటన దీర్ఘకాలిక భౌగోళిక, ఆర్థిక సంబంధాలకు ఒక బ్లూప్రింట్‌లా ఉంది. ఈ పర్యటన సందర్భంగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేశారు. ఇది రక్షణ సహకారంపై ఫ్రేమ్‌వర్క్ ఒప్పందానికి మార్గం సుగమం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa