ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 02, 2026, 11:52 AM

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన పరాకాష్టకు చేరిందని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు ఇవ్వకూడదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల విశ్వాసాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. పవిత్రమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం హోదాలో చంద్రబాబే దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. అయితే తాజా సీబీఐ సిట్ నివేదికలో లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు లేదని స్పష్టమైందన్నారు. నిజాలు బయటపడటంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు కూటమి నేతలు ఫ్రస్టేషన్‌కు లోనయ్యారని చెప్పారు. ఈ అహాన్ని కప్పిపుచ్చేందుకు వాస్తవాలను పక్కదోవ పట్టిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరోసారి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కించపరిచేలా పోస్టర్లు వేయించారని ఆరోపించారు. ఫ్లెక్సీలను తొలగించేందుకు వెళ్లిన సమయంలో పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హిందూపురంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గుండాలు దాడి చేశారని, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడుదల రజనిపై కూడా దాడికి పాల్పడ్డారని గుర్తు చేశారు. తిరుమల లడ్డూ అంశంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మాజీ హోంమంత్రి సుచరితను కూడా పోలీస్ కార్యాలయంలోకి అనుమతించలేదని అన్నారు. రాష్ట్ర డీజీపీ పూర్తిగా బంట్రోతుగా మారిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తక్షణం కేంద్ర ప్రభుత్వం స్పందించాలని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఎంతవరకైనా వెళ్తామని, దౌర్జన్యాలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడదని స్పష్టం చేశారు. కూటమి కార్యకర్తలను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తూ, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని ఆయ‌న‌ హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa