వెనుకబడిన వర్గాలను కేవలం సంక్షేమ లబ్ధిదారులుగా పరిమితం చేయకుండా, వారిని సూక్ష్మ పారిశ్రామికవేత్తలుగా , ఎంఎస్ఎంఈలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కులవృత్తుల వారికి ఆధునిక సాంకేతికతను అందించే లక్ష్యంతో 'ఆదరణ-3' పథకం ద్వారా ఆధునిక పనిముట్లను పంపిణీ చేసేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు.విద్యా రంగంలో బీసీ విద్యార్థులకు అత్యుత్తమ మౌలిక వసతులు కల్పించడంపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో రూ.60 కోట్ల సాస్కీ నిధులతో కొత్తగా బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉన్న 814 బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.17 కోట్ల వ్యయంతో మార్చిలోగా ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. హాస్టళ్లలో పారిశుధ్యం, విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని, అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని చంద్రబాబు స్పష్టం చేశారు.విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన వంటి అన్ని అంశాల్లోనూ ఉత్తమ పద్ధతులను అనుసరించాలని సూచించారు. విద్యార్థుల విద్యాపరమైన పురోగతిని పర్యవేక్షించేందుకు వీలుగా అపార్ ఐడీలను నమోదు చేసి, అనుసంధానం చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ దశలో ఉన్న బీసీ భవనాల పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో నడుస్తున్న 6 రెసిడెన్షియల్ పాఠశాలలను జూనియర్ కళాశాలల స్థాయికి అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు.రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక బీసీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేసే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి వెల్లడించారు. బీసీ స్టడీ సర్కిళ్లను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని, కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, వారికి ప్రయోజనం చేకూరేలా పథకాలు రూపొందించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa