అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టు అదరగొట్టింది. రికార్డు స్థాయి ఛేజింగ్ తో ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆఫ్ఘనిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ 115 అద్భుతమైన సెంచరీతో చెలరేగగా, విధ్వంసకర హాఫ్ సెంచరీలతో వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రే జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 6న ఇదే వేదికపై జరగనున్న ఫైనల్లో భారత్, ఇంగ్లండ్‌తో తలపడనుంది.ఆఫ్ఘనిస్థాన్ నిర్దేశించిన 311 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ కేవలం 41.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు పెద్దగా రాణించని ఆరోన్ జార్జ్, కీలకమైన సెమీస్‌లో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (33 బంతుల్లో 68) మెరుపు ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించాడు. ఫీల్డర్లు రెండుసార్లు క్యాచ్‌లు జారవిడిచిన అవకాశాన్ని సూర్యవంశీ చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. అనంతరం కెప్టెన్ ఆయుష్ మాత్రే (39 బంతుల్లో 62) కూడా వేగంగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.భారత ఛేదనలో భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించాయి. తొలి వికెట్‌కు జార్జ్, సూర్యవంశీ 90 పరుగులు జోడించగా, రెండో వికెట్‌కు జార్జ్, కెప్టెన్ మ్హత్రే కలిసి 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక మూడో వికెట్‌కు విహాన్ మల్హోత్రా (47 బంతుల్లో 38 నాటౌట్)తో కలిసి జార్జ్ మరో 96 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయ తీరాలకు చేర్చాడు.అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్, నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110), ఉజైరుల్లా నియాజీ (86 బంతుల్లో 101 నాటౌట్) అద్భుత సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 148 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో రెండు వికెట్లు తీసినప్పటికీ, మిగతా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ విజయంతో భారత్ మొత్తమ్మీద పదోసారి అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించగా, వరుసగా ఆరోసారి తుదిపోరుకు చేరడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa