ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీ20 వరల్డ్ కప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్న భారత్,,,,డ్యూ ఫ్యాక్టర్ గురించి ఆందోళన వ్యక్తం చేసిన ధోనీ

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 04, 2026, 10:53 PM

టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు భారత జట్టుపై మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఈ టోర్నీలో అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. శ్రీలంకతో కలిసి భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీపై మాట్లాడిన ధోనీ జట్టు అనుభవం, ఆటగాళ్ల నైపుణ్యాలపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశాడు.


“భారత జట్టు ప్రస్తుతం అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్‌గా ఉన్నారు. ఈ ఫార్మాట్‌లో వాళ్లకు భారీ అనుభవం ఉంది. ఒత్తిడిలో ఎలా ఆడాలో వారికి బాగా తెలుసు. ఎవరికిచ్చిన బాధ్యతను వారు సమర్థంగా నిర్వర్తించే స్థాయికి వచ్చారు” అని ధోనీ అన్నాడు.


ఈ టోర్నీలో భారత్ గ్రూప్-ఏలో పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, అమెరికా జట్లతో కలిసి ఉంది. పాకిస్తాన్ ఇప్పటికే భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించడంతో, భారత్‌కు ఆ మ్యాచ్‌లో ఫోర్ఫిట్ ద్వారా విజయం దక్కే అవకాశం ఉంది. అయితే, భారత జట్టు బలంగా ఉన్నప్పటికీ ఒక అంశం తనను ఇప్పటికీ భయపెడుతుందని ధోనీ వెల్లడించారు. అదే డ్యూ ఫ్యాక్టర్ అని స్పష్టం చేశాడు.


“డ్యూ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మైదానంపై తేమ పడితే మ్యాచ్ మొత్తం మారిపోతుంది. అప్పుడు టాస్ చాలా కీలకంగా మారుతుంది. నా ఆట సమయంలో కూడా ఇదే అంశం నన్ను ఎక్కువగా భయపెట్టేది. పరిస్థితులు సమానంగా ఉంటే ప్రపంచంలోని ఏ జట్టునైనా భారత్ ఎక్కువసార్లు ఓడించగలదు” అని ధోనీ వివరించాడు.


టీ20 మ్యాచ్‌లు రాత్రి టైంలో జరుగుతుంటాయి. మంచు ప్రభావం ఉన్నప్పుడు.. రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టుకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మరోవైపు లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బౌలర్లు శక్తిమేర ప్రయత్నించినప్పటికీ.. బంతిపై పట్టు దొరక్కపోవడంతో సరైన ప్రదేశంలో బంతులు విసరలేరు. ఇది ఛేజింగ్ జట్టుకు కలిసొస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే ధోనీ డ్యూ ఫ్ట్యాక్టర్ గురించి ఆందోళన వ్యక్తం చేశాడు.


టీ20 ఫార్మాట్‌లో చిన్న తప్పిదమే పెద్ద నష్టంగా మారుతుందని ధోనీ అభిప్రాయపడ్డాడు. కీలక ఆటగాళ్లు ఒకేసారి ఫామ్ కోల్పోతే, ప్రత్యర్థి ఆటగాడు అదిరిపోయే ప్రదర్శన చేస్తే మ్యాచ్ దిశ పూర్తిగా మారిపోతుందని తెలిపాడు. “కొన్నిసార్లు మన కీలక ప్లేయర్లు ఒకేసారి ఆఫ్‌ డేలో ఉంటారు. అదే సమయంలో ప్రత్యర్థి జట్టు నుంచి ఎవరో ఒకరు అద్భుతంగా ఆడతారు. అప్పుడు ఫలితం మన చేతుల్లో ఉండదు. అలాంటి పరిస్థితుల్లో అదృష్టం కూడా అవసరం. ఎవరికీ గాయాలు కాకుండా, అందరూ తమ పాత్రను సరిగ్గా పోషిస్తే.. భారత్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలుస్తుంది” అని ధోనీ అన్నాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa